- మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం
- మీడియా అకాడమీ ఆధ్వర్యంలో చెక్కుల అందజేత
- హాజరైన మండలి చైర్మన్ గుత్తా, ప్రభుత్వ సలహాదారు కేకే
హైదరాబాద్ సిటీ, వెలుగు: పాత్రికేయ రంగంలో విశేష సేవలందించిన పది మంది ప్రముఖ జర్నలిస్టుల జీవితాలపై రాసిన చిరు పుస్తకాల(మోనోగ్రాఫ్స్) ను మీడియా అకాడమీ బుధవారం రిలీజ్ చేసింది. అలాగే మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చెక్కులు, ప్రమాదాల బారిన పడిన వారికి రూ.50 వేల చెక్కును అందజేసింది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, మీడియా అకాడమీ చైర్మన్కె.శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలకు చెక్కులు ఇచ్చారు.
ప్రముఖ పాత్రికేయులు ఆబిద్ అలీఖాన్, డి.సీతారాం, బేతనబొట్ల నాగేశ్వరరావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, ఎం.ఎస్.ఆచార్య, ఏబీకే ప్రసాద్, జీఎస్వరదాచారి, సి.రాఘవాచారి, వి.హనుమంతరావు, ఆదిరాజు వెంకటేశ్వర్రావుపై ప్రచురించిన మోనోగ్రాఫ్స్ రిలీజ్ చేశారు. అనంతరం గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ మరణించిన జర్నలిస్టులకు మీడియా అకాడమీ ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. ఇక్కడ ఆవిష్కరించిన పుస్తకాలు చదివితే అప్పటి పాత్రికేయ నైతిక విలువలు ఎలా ఉండేవో తెలుస్తుందన్నారు.
ప్రస్తుతం మీడియాలో పక్షపాతం పెరిగిందన్నారు. కే.కేశవరావు మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు మాట్లాడే భాష కంటే ప్రస్తుతం మీడియాలో వాడుతున్న భాష దారుణంగా ఉంటుందన్నారు. కొన్ని మీడియా సంస్థలు నాయకుల క్యారెక్టర్‌ను అసాసినేషన్చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాను నియంత్రించడం ఎవరి తరం కాదన్నారు. దీనిపై జర్నలిస్టు వర్గాలు చర్చించి, సమావేశాలు నిర్వహించి మార్పు కోసం ప్రయత్నించాలన్నారు.
మిగతా వ్యవస్థలూ అట్లనే ఉన్నయ్: కె.శ్రీనివాస్‌రెడ్డి
కేవలం మీడియా కరెక్ట్‌గా లేదనడం సరికాదని, మిగతా మూడు వ్యవస్థలు కూడా సరిగా లేవని కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఎగ్జిక్యూటివ్వ్యవస్థ అయితే అధికారంలో ఉన్న వారు ఏం చెప్తే అదే చేస్తోందన్నారు. మరణించిన 130 మంది జర్నలిస్టుల కుటుంబాలకు ప్రస్తుతం నెలకు రూ.3వేల చొప్పున, వారి పిల్లలకు రూ.2వేల చొప్పున పెన్షన్ అందజేస్తున్నామని చెప్పారు.
అనారోగ్యంతో ఉన్న సీనియర్ జర్నలిస్టులకు రూ.లక్ష సహాయం అందిస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో రెండు రోజుల పాటు గిరిజన జర్నలిస్టులు, మహిళా జర్నలిస్టులకు ఏఐపై శిక్షణ ఇచ్చామని, త్వరలోనే నేషనల్ సెమినార్లు నిర్వహిస్తామని తెలిపారు.
