- పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్
- కూకట్‌పల్లి దళిత వాడలో పర్యటన.. బ్లడ్ క్యాంప్ ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగం ద్వారా సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం అందించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు. మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లి నియోజకవర్గంలోని దళిత వాడలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం, సహపంక్తి భోజనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..అంబేద్కర్ ఆశయ సాధనే కాంగ్రెస్ లక్ష్యమన్నారు. ఆయన తన కలం ద్వారా రాజ్యాంగాన్ని రచించి సమాజంలోని బడుగు, బలహీన వర్గాలకు ఆశాదీపంగా నిలిచారని కొనియాడారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్, ఇతర నేతలు పాల్గొన్నారు.
పార్టీ నేతలతో వరుస సమీక్షలు
మీనాక్షి నటరాజన్ మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో పార్టీ పటిష్టతపై వరుస సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. గ్రామ, మండల స్థాయి కమిటీల ఏర్పాటుపై ఆమె ప్రధానంగా దృష్టి సారించనున్నారు.క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చేపట్టిన ఈ కమిటీల ప్రక్రియ ఎంతవరకు వచ్చిందనే దానిపై జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుల నుంచి వివరాలు సేకరించనున్నారు. ఇప్పటికే నియమితులైన కొత్త డీసీసీ అధ్యక్షుల పనితీరు, వారి జిల్లాల్లో పార్టీ పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు.
గాంధీ భవన్‌లో పీసీసీ ముఖ్య నేతలు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, అనుబంధ సంఘాల నాయకులతోనూ మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన వివిధ కార్యక్రమాల అమలు తీరు, భవిష్యత్తు కార్యాచరణపై సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్తున్నారనే అంశంపై కూడా ఆమె చర్చించనున్నారు.

