అనుకున్నది సాధించాలన్న పట్టుదల సడలిపోతే ఇంకేదో సాధించాలనే మరో పోరాటంతో లైఫ్ సాగిపోతుంది. కానీ, జీవితమే పోరాటమైనప్పుడు గెలవాల్సిందే. ఓడిపోతే లైఫే లేదనుకున్నప్పుడు రాజీకి అవకాశమే లేదు. కష్టాలకు లొంగని ఓ పట్టుదల పేరు
ఆదిత్య మెహతా. హైస్కూల్ చదువులో అత్తెసరు మార్కులే అయినా పదహారేళ్ల వయసులో కోటిన్నర రూపాయల టర్నోవర్‌తో బిజినెస్ నడిపిన ప్రావీణ్యం అతనిది. వెంటాడిన ప్రమాదం వైకల్యాన్నిచ్చినా జీవితాన్ని సాఫల్యం చేసుకున్న పారా సైక్లిస్ట్ ఆదిత్య. ఏది చేసినా ఉన్నతంగా ఉండాలనిచెప్పే ఓ సాహసి ప్రయాణం ఇది.
మోహన్‌లాల్ మెహతా గుజరాతీ బనియా. 150 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కి వచ్చిండు. నగర వీధుల్లో సైకిల్‌పై తిరుగుతూ బనియన్లు, సాక్సులు అమ్మేటోడు. ఆయనకు ఆరుగురు కొడుకులు. వాళ్లందరిలో చిన్నోడు జేకే మెహతా. తండ్రి వారసత్వంగా గార్మెంట్స్ వ్యాపారంలోకి వచ్చినా అందులో చాలా పైస్థాయికి ఎదిగిండు. గార్మెంట్స్ ఫ్యాక్టరీతోపాటు బిల్డర్‌గా సిటీలో బాగా సంపాదిస్తున్నడు. మోహన్‌లాల్ కొడుకులంతా సొంత వ్యాపారాలు చేసుకుంటున్నా ఉమ్మడి కుటుంబంగానే ఉన్నరు.
నాటీ బాయ్
మోహన్లాల్కి మొత్తం18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నరు. పిల్లలందరూ ఫర్వాలేదు. ఆదిత్య ఒక్కడే కొంచెం నాటీ. ‘వీడు పెద్దయినంక పెద్ద గూండా అయితడ’ని ఇంట్లో అనుకునేటోళ్లు. చలాకీతనం నచ్చినవాళ్లు మంచి బిజినెస్‌మేన్ అయితడని అనేటోళ్లు.
తెలుగంటే భయం
ప్రోగ్రెస్ కార్డ్‌లో ఎవరికి మార్కులు తక్కువొచ్చినా బెత్తం విరిగిపోయేలా కొట్టేటోడు. ఆ 18 మందిలో ఒకడైన ఆదిత్య మెహతాకి అయిదో తరగతి తెలుగులో వందకు 6 మార్కులే వచ్చినయ్. పట్టలేనంత కోపంతో ఆదిత్య వీపు విమానం మోత మోగించిండు.
ఇల్లువదిలి..
పట్టుదలతో ట్యూషన్‌కి పోయిండు. ఫ్రెండ్స్‌తో కలిసి చదువుకోడానికి పోయిండు. ఎంత చేసినా ఫలితం శూన్యం. హాఫ్ ఇయర్లీ పరీక్షల్లో తెలుగులో వందకు 4 మార్కులే వచ్చినయ్. నాన్నకు కనపడే ధైర్యం లేదు. అమ్మ చెవి కమ్మలు అమ్మి, ఫ్రెండ్‌తో కలిసి ట్రైనెక్కిండు. గోవాలో దిగిండు. మూడు రోజులకే డబ్బులు అయిపోయినయ్. ఇంటికి ఫోన్ చేసిండు. అమ్మ పల్లవి బోరున ఏడ్చింది. ‘‘ఇంకేమీ అనం, నిన్నెప్పుడూ దెబ్బలు కొట్టమ’’ని చెప్పింది. గోవా పోయి తీసుకొచ్చినరు.
16 ఏళ్లకే బిజినెస్
వ్యాపార కుటుంబంలో పెరిగిన ప్రభావంతో ఆదిత్యకు చిన్నప్పుడే సొంత వ్యాపారం చేయాలన్న కోరిక పుట్టింది. నాన్న ముందు చదువు, ఆ తర్వాత బిజినెస్ అన్నడు. తను దాచుకున్న పాకెట్‌మనీ (30 వేల రూపాయలు) ఉంది. మరో ఇద్దరితో కలిసి 1998లో గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసిండు. సిటీలో చిన్న గదితోపాటు ఓ అంబాసిడర్ కారుని అద్దెకు తీసుకున్నరు. సాయంత్రం కల్లా అమ్మి డబ్బులు కడతామనే హామీతో పొద్దున గార్మెంట్స్ తీసుకోని అమ్మేటోళ్లు. కారులో గార్మెంట్స్ తీస్కపోయి నిజామాబాద్, కర్నూల్, పరకాల, బోధన్‌లో షాపులోళ్లకు అమ్మేది. మాపటికల్లా సిటీకి చేరేది. సేల్స్ బాగున్నయ్. ఏడాది తిరిగే సరికి 1.5 కోట్ల రూపాయల బిజినెస్ చేసినరు! అదే ఊపులో విదేశాల నుంచి నాన్ బ్రాండెడ్ జీన్స్‌ని దిగుమతి చేసినరు. అయిదేళ్లు బిజినెస్ హ్యాపీగా సాగింది. అనుకోకుండా ఓ రోజు ఇద్దరు పార్ట్నర్స్ ఉడాయించినరట. అప్పటికే కొన్న మాల్కి కట్టాల్సిన డబ్బులకు ఆదిత్య హామీ పడ్డడు. ఆ అప్పులు తీర్చేసరికి అయిదేళ్లు సంపాదనతోపాటు ఇంకో 20 లక్షలు అప్పు చేయాల్సొచ్చింది. కెరీర్ మైనస్ లెవల్‌కి పోయింది.
లేని కంపెనీతో కొత్త బిజినెస్
ఓటమిని ఒప్పుకోలే. బిజినెస్ నుంచి తప్పుకోలే. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా తెలివినే పెట్టుబడిగా పెట్టి రెండు చేతులా సంపాదించడం ఎట్లని ప్లాన్ వేసిండు. దుబాయి పోయి మిడిల్ ఈస్ట్‌లో గార్మెంట్స్ బిజినెస్ చేసేవాళ్లని ఆదిత్య కలిసిండు. ‘నాకు ఇండియాలో గార్మెంట్ ఫ్యాక్టరీ ఉంది. మాల్ పంపిస్త’ అని చెప్పి పెద్ద కంటెయినర్ ఆర్డర్ సంపాదించిండు. కానీ, ఒక కుట్టు మెషిన్, మాస్టర్ టైలర్ తప్ప ఇంకేమీ లేవు. దుబాయికి ఛార్జీలు కూడా లేకపోతే కజిన్ బ్రదర్ దగ్గర అప్పు తీసుకున్నడు. 50 లక్షల రూపాయల ఆర్డర్ వచ్చిందని, ఎక్స్పోర్ట్ చేస్తే మనకు చాలా లాభం ఉంటదని చెప్పి కజిన్ బ్రదర్‌ని కన్విన్స్ చేసిండు. తన సాయంతో ఫస్ట్ ఎక్స్పోర్ట్ చేసిండు. అదే టైమ్‌లో ‘జరి’ అనే బ్రాండ్ పేరుతో షర్ట్స్ తయారుచేయించిండు. తొమ్మిది నెలల్లో ఆదిత్య దశ తిరిగింది. విదేశాలకు ఎక్స్పోర్ట్తోపాటు ఇంపోర్ట్ కూడా మొదలుపెట్టిండు. తొమ్మిది నెలల్లో మస్త్ లాభాలొచ్చినయ్. అట్ల ఇసుకను పిండి తైలం తీయడం అంటే ఏమిటో చేసి చూపించిండు!
ప్రాణం మీదకు తెచ్చిన హెల్మెట్..
బిజినెస్ జోష్ మీదుంది. అదే టైమ్‌లో మాల్ తేవాలని చైనా పోయిండు. హాంకాంగ్‌లోని ఓ షోరూమ్‌లో అందమైన హెల్మెట్ కనిపించింది. తన వింటేజ్ బైక్‌కి ఆ హెల్మెట్కీ మంచిగా మ్యాచ్ అయితదని కొన్నడు. బైక్ మీద తిరిగేప్పుడు ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకోని ఆదిత్య కొత్త హెల్మెట్ కోసమే బైకెక్కిండు. రయ్ మంటూ బైక్ దూసుకుపోతుంటే వెనుకనే ఓ బస్సు ప్రమాదంలా వెంబడించింది. అది గుద్దగానే బైక్‌ని బ్యాలెన్స్ చేస్తూ పోనిచ్చిండు. కానీ, రెండోసారీ గుద్దింది. కాలు మీదకు టైరెక్కింది. కుడి కాలుకి దెబ్బలు బాగా తాకినయ్. డ్రెస్సింగ్ చేస్తే 15 రోజుల్లో తగ్గుతదని డాక్టర్స్ చెప్పినరు.
గాయపడని ప్రేమ
ఆరో రోజు డ్రెస్సింగ్ చేసేప్పుడు డాక్టర్ ఫోన్ మాట్లాడుతూ కట్టు కట్టిండు. కాలికి కాటన్ పెట్టి దానిపై పీఓపీ వేసి పోయిండు. ఎనిమిదోరోజు విప్పితే కాటన్ అంతా గాయంలో కలిసిపోయింది. చేసేది లేక కాలునే తీసేయాలన్నరు. అప్పటికి ఆదిత్య వయసు 23 సంవత్సరాలు. పెండ్లయి ఏడాదే అయింది. భార్య మనీషాని పిలిచి.. ‘నాకు కాలు తీసేస్తరు. ఒంటికాలు జీవితం ఎట్లుంటదో తెలియదు? మనకెలాగూ పిల్లలు లేరు. నన్ను విడిచి వెళ్లిపో.. ఇంకో పెళ్లి చేసుకో’ అన్నడు ఆదిత్య. అప్పుడామె ‘నాకే ఇట్లయితే నువ్వేం చేస్తవ్?’ అని అడిగింది. ఆదిత్య దగ్గర సమాధానం లేదు. ‘నీతోనే ఉంటాన’ని ప్రేమతో చెప్పిందా ఇల్లాలు.
స్పోర్ట్స్ స్టార్
సర్జరీ చేసి కుడి కాలుని మోకాలు పైకి తొలగించినరు. మూడు నెలల తర్వాత ఊతకర్ర సాయంతో వాకింగ్ స్టార్ట్ చేసిండు. వ్యాపారం క్లోజ్ చేసిండు. ఫాదర్ బిజినెస్‌లో జాయిన్ అయిండు. ఆరేండ్ల తర్వాత ఒక రోజు(2011లో) ఒక హోర్డింగ్ మీద సైకిల్ రైడ్ గురించి చూసి.. ‘నేనెప్పటికీ సైకిల్ నడపలేన’ని బాధపడ్డడు. తనకు సైకిల్ రైడ్ చాలా ఇష్టం. కజిన్ బ్రదర్ సపోర్ట్‌తో సైకిల్ రైడ్ మొదలుపెట్టిండు. సైకిల్ రైడ్ డేట్ దగ్గరకొస్తోంది. హైడ్రాలిక్ లెగ్‌తో సైక్లింగ్ ప్రాక్టీస్ కష్టంగా ఉంది. కానీ ఇష్టమైన రైడ్‌కి పోవాలని పట్టువదలకుండా ప్రాక్టీస్ చేసిండు. గెలవాలని కాకపోయినా ఆటలో భాగం కావాలని ఆదిత్య పాల్గొన్నడు. అక్కడి వచ్చిన ప్రముఖ క్రీడాకారుల్ని కాదని మీడియా ఆదిత్యను పలకరించింది. గెలిచిన వాళ్లకంటే పాల్గొన్న ఆదిత్యకే అభినందనలు ఎక్కువగా వచ్చినయి. మీడియాలో పతాక స్థాయిలో వార్తలొచ్చినయి. ఆటకు ఉండే ప్రాధాన్యత ఏమిటో? ఆదిత్యకు అప్పుడర్థమైంది. ఇక పెడల్ మీద కాలు తీసుడు లేదు, హ్యాండిల్ వదిలేది లేదనుకున్నడు. అలా మొదలైంది సైకిల్ రైడ్.
పడిలేచిన పయనం
సైకిల్ రైడ్ ప్యాషన్ ఉన్నవాళ్లెంతమందో ఆదిత్యకు దోస్తులయ్యారు. వాళ్లు వారం వారం చేసే సైకిల్ రైడ్‌కి ఆదిత్యను కూడా పిలిచినరు. ఆ రైడ్‌లో వెనకా, ముందు అనుకోకుండా తన శక్తి మేరకు పోతనేఉన్నడు. ఏడాది తర్వాత.. అయిదున్నర గంటల్లో వంద కిలోమీటర్ల రైడ్‌ని పూర్తి చేసిండు. ఆ రైడ్ వివరాలన్నిటినీ పరిశీలించి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ‘100 కిలోమీటర్ల సైకిల్ రైడ్ పూర్తి చేసిన ఫస్ట్ ఎబోని ఆంపుటీ అథ్లెట్’గా తన పేరిట కొత్త రికార్డ్‌ని క్రియేట్ చేసింది. ఆ రైడ్‌ని అయిదున్నర గంటల్లో ఫినిష్ చేసిండు. ఈ వార్త చూసి ‘సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ ఆదిత్యని ‘‘ఏషియన్ పారా సైక్లింగ్ ఛాంపియన్ షిప్ 2013లో ఇండియాని రిప్రజెంట్ చేస్తవా?’’ అని అడిగింది. కాదనకుండా ప్రాక్టీస్ మొదలుపెట్టిండు.
యాక్సిడెంటల్ హర్డిల్స్
సైక్లింగ్ గోల్డ్ మెడలిస్ట్ రమణ్ గరిమెళ్లని కోచ్‌గా పెట్టుకున్నడు. కాంపిటీషన్ కోసం కొత్తకాలు సెట్ చేయించుకోడానికి ఒక ఫ్యాబ్రికేటర్తో చాలా మార్పులు చేయించిండు. ఆ కాలు సెట్కాక చాలాసార్లు పడిపోయిండు. ఓరోజు 40 కిలోమీటర్ల వేగంతో కోచ్‌తో కలిసి సైకిల్ తొక్కుతున్నడు. ఒక్కసారిగా కాలు ఊడిపోయి, ముందు చక్రంలో దూరింది. 10 అడుగుల ఎత్తు ఎగిరిపడ్డడు. నడుములు విరిగిపోయినయ్. మళ్లా దవాఖానలో పడ్డడు. ఏషియన్ చాంపియన్షిప్కి అయిదు రోజులే ఉంది. ‘ఇక ఆడలేవు. ఆడొద్ద’ని డాక్టర్లు చెప్పినరు. ఇంట్లో వాళ్లు ఒప్పుకోమన్నరు. ఆడకపోయినా ఆటను చూసొస్తని అబద్ధం చెప్పి బయలెల్లిండు. వేరే చోట నుంచి సైకిల్ని పార్శిల్ చేయించిండు.
ఒక అబద్ధం.. రెండు మెడల్స్
ఢిల్లీలో ఏషియన్ పారా సైక్లింగ్ ఛాంపియన్‌షిప్‌కి పోయిండు. కాసేపయితే పది కిలోమీటర్ల ఇండివిడ్యువల్ టైమ్ ట్రైల్ స్టార్టయితది. ‘ఈ నొప్పి టెంపరరీ ఉంటది. నొప్పిని లైట్‌గా తీసుకో. ఇప్పుడు పోరాడితే అదే నొప్పి ఎప్పటికీ గుర్తుంటది. అంతనొప్పిలోనూ రేస్‌లో గెలిచిన్నని ఎప్పటికీ హ్యాపీగా ఫీలవుతవ్. ఈ నొప్పి నీ జీవితాన్ని సంతోషపెడతది’ అని కోచ్ చెవిలో చెప్పి పోయిండు. కోచ్ చెప్పినట్లే నొప్పిని ఓర్చుకుని పది కిలోమీటర్లు సైకిల్ తొక్కిండు. ఇండియాకు ఫస్ట్ సిల్వర్ మెడల్ తెచ్చిండు! ఆ ఈవెంట్ అయిపోయిన అయిదు గంటలకే నలభై కిలోమీటర్ల రైడ్ ఉంది. ‘‘నాకు శక్తి లేదు. నొప్పి బాగా ఉంద’’ని చెబుతున్న ఆదిత్య కళ్లలోంచి కన్నీళ్లు ఉబికి వస్తున్నయి. ఆదిత్యకు కోచ్ మనోబలాన్నిచ్చిండు. రెండో రైడ్‌లోనూ ఆదిత్య సిల్వర్ మెడల్ సాధించిండు. స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ లేని ఆదిత్య విజయం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది!
కొత్త సంకల్పం
ఆదిత్య ఏషియన్ పారా సైక్లింగ్ కాంపిటీషన్స్‌లో తనతో పోటీపడ్డ పేద క్రీడాకారుల్ని చూసి జాలిపడ్డడు. ఆ పోటీల్లో పాల్గొన్న అభిషేక్ (చండీఘడ్) నార్మల్ సైకిల్‌తో పోటీపడి ఫోర్త్ ప్లేస్ సాధించిండు. అలోక్ (కోల్‌కతా)కి సైకిల్ కూడా లేదు. ఎవరిదో సైకిల్ తెచ్చుకుని ఓ కేటగిరిలో ఫోర్త్ప్లేస్లో నిలిచిండు. వాళ్ల దీన స్థితికి చలించిపోయి మీకు నేను సాయం చేస్తానని మాటిచ్చిండు. వాళ్లిద్దరికీ లక్షన్నర రూపాయలతో స్పోర్ట్స్ సైకిల్ కొనిచ్చిండు. శ్రీనివాస్ అనే క్రీడాకారుడు కృష్ణానదిని ఈదిండు. ఆయనకు మంచి కాలు చేయించి ఇచ్చిండు. వాళ్లు ఈ విషయాన్ని ఎంతో మందికి చెప్పినరు. ఇంకొంతమంది ఆదిత్యను సాయం చేయమని అడిగితే తానేమీ చేయలేనని చేతులెత్తేసిండు. అలాగని నాకేమీ బాధ్యత లేదని వదిలేయలేదు. వాళ్లకు సాయం చేయాలని కొన్ని సంస్థలతో కలిసి కశ్మీర్ నుంచి కన్యాకుమారికి సైకిల్ రైడ్ స్టార్ట్ చేసిండు. ఎంతోమంది తనకు మద్దతు పలికినరు. ప్రతి సిటీలో జనం నీరాజనాలు పలికినరు. మీడియాలో మస్త్ వార్తలొచ్చినయ్. ఆ రైడ్ సక్సెస్ అయింది అనుకోవాలో, ఫెయిల్ అనుకోవాలో ఆదిత్యకు అర్థం కాలే. వచ్చింది 20 వేలు. అందులో వాళ్ల నాన్న ఇచ్చినవే 15 వేలు.
ఇట్లయితే లాభం లేదనుకుని అమ్మానాన్నతో పాటు ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి, కె.దుర్గాప్రసాద్, అఖిల్ అక్కినేని, శోభు యార్లగడ్డతో కలిసి ఓ ఎన్జీఓని స్టార్ట్ చేసిండు. ‘ఆదిత్య మెహతా ఫౌండేషన్’ పేరుతో పారా అథ్లెట్లకు హెల్ప్ చేయడమే కాదు వాళ్లకు శిక్షణ ఇచ్చేందుకు అకాడమీ, కౌన్సెలింగ్ చేస్తూ, వైకల్యంతో ఉన్న బాధలు పోగొట్టేందుకు రిహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేసినడు. వాళ్ల నాన్నే రెండు హాస్టళ్ల నిర్వహణకు, రిహాబిలిటేషన్ సెంటర్స్‌కి వాడుకోమని బిల్డింగ్ ఇచ్చిండు. అకాడమీ కోసం 5000 గజాల స్థలం ఇచ్చిండు. ఇప్పుడందులో 15 రకాల క్రీడల్లో పారా అథ్లెట్లకు శిక్షణ ఇస్తున్నరు. పతకాల గెలుపే కాదు జీవితంలో గెలవాలని కొత్తపాఠాలు చెబుతున్నడు ఆదిత్య.
– నాగవర్ధన్ రాయల

