తెలంగాణకు మెగా టెక్స్​టైల్ పార్క్..ట్విట్టర్ ద్వారా ప్రధాని వెల్లడి

తెలంగాణకు మెగా టెక్స్​టైల్ పార్క్..ట్విట్టర్ ద్వారా ప్రధాని వెల్లడి
  • మరో 6 రాష్ట్రాల్లోనూ పార్క్​లు
  • సిరిసిల్ల లేదా వరంగల్​లో ఏర్పాటుకు అవకాశం
  • తెలంగాణకు ప్రధాని మోడీ కానుక: కిషన్​రెడ్డి

న్యూఢిల్లీ/హైదరాబాద్, వెలుగు: తెలంగాణకు మరో మెగా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లక్షలాది మంది రైతులు, చేనేత కార్మికులకు మేలు చేసే, వేలాది మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే పీఎం మిత్ర మెగా టెక్స్ టైల్ పార్క్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్​లో మెగా టెక్స్‌‌టైల్ పార్కులు ఏర్పాటు చేయనున్నట్లు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ వెల్లడించారు. 


దేశంలో టెక్స్​టైల్ రంగానికి బూస్టింగ్​ ఇవ్వడానికి 5 ఎఫ్​ మంత్రతో తమ ప్రభుత్వం పని చేస్తోందని, ఫార్మ్​ టు ఫైబర్.. ఫైబర్​ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్.. ఫ్యాషన్​ టు ఫారిన్​అనేది తమ విజన్ ​అని పేర్కొన్నారు. ఈ టెక్స్​టైల్ ​పార్క్​ల ఏర్పాటుకు అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, వీటిలో ప్రపంచ స్థాయి సంస్థల ద్వారా కోట్లాది రూపాయల పెట్టుబడులు సాధిస్తామని, లక్షలాది మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు. ఈ మెగా టెక్స్​టైల్​ పార్క్​లు మేక్​ఇన్​ఇండియా, మేక్​ఫర్​​ది వరల్డ్​కు గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పారు. 

ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా..

ఆత్మనిర్భర్​ భారత్​లో భాగంగా టెక్స్​టైల్స్ రంగం లో ఇండియాను ప్రపంచంలోనే అగ్రగామిగా నిల పాలన్న ఉద్దేశంతో ‘ప్రధానమంత్రి మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్​టైల్స్ రీజియన్, అపారెల్ పార్క్’(పీఎం మిత్ర) స్కీమ్​కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఫార్మ్ టు ఫైబర్.. ఫైబర్ టు ఫ్యాక్టరీ.. ఫ్యాక్టరీ టు ఫ్యాషన్.. ఫ్యాషన్ టు ఫారిన్ అనే ‘5ఎఫ్’ సూత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్కీంను రూపొందించింది. దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

వరంగల్ లేదా సిరిసిల్లలో ఏర్పాటుకు చాన్స్

వరంగల్​లో కాకతీయ మెగా టెక్స్​టైల్​పార్క్​ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దానితోపాటు సిరిసిల్లలో మెగా టెక్స్​టైల్​పార్క్​ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు కేంద్రాన్ని కోరింది. ప్రధాని ప్రకటనతో వరంగల్, సిరిసిల్లల్లో ఏదో ఒకచోట కేంద్రం తోడ్పాటుతో మెగా టెక్స్​టైల్​పార్క్​ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తెలంగాణకు కానుక: కిషన్ రెడ్డి

మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్క్ తెలంగాణకు ప్రధాని మోడీ అందించిన కానుక అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు పీఎం మిత్ర టెక్స్ టైల్ పార్క్ కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కు ఏర్పాటైతే.. రైతులు, చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని, వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని సీఎం కేసీఆర్ కు గతేడాది తాను లేఖ రాశానని కిషన్​రెడ్డి గుర్తు చేశారు. ‘పీఎం మిత్ర’ప్రాజెక్టు కోసం దరఖాస్తు చేసుకోవాలని అందులో కోరానన్నారు. అలాగే ప్రధానిని, టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ శాఖ మంత్రిని కలిసినప్పుడు మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కు ఏర్పాటు విషయమై పలుమార్లు విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కులో.. దారం తయారీ నుంచి బట్టలు నేయడం, రంగులు అద్దడం, డిజైన్లు ముద్రించడం, వస్త్రాల తయారీ వరకు అన్ని పనులు ఒకే దగ్గర ఉండేలా ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తారని వివరించారు. మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కుల వల్ల రవాణా ఖర్చులు తగ్గి, దేశ టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ రంగంలో పోటీతత్వం పెరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మెగా టెక్స్‌‌‌‌‌‌‌‌టైల్ పార్కు ఏర్పాటుపై చొరవ చూపాలని కోరారు. అవసరమైన సహాయసహకారాలను అందించి ప్రాజెక్టు త్వరగా కార్యరూపం దాల్చటానికి కృషి చేయాలని సూచించారు.


20 లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి: పియూష్​ గోయల్

దేశంలో టైక్స్ టైల్ రంగం భారీగా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని కేంద్ర మంత్రి పియూష్​ గోయల్ అన్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ప్రజలకు సంతోషకరమైన రోజన్నారు. ప్రధాని ప్రకటన తర్వాత ఉద్యోగ్ భవన్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. పీఎం మిత్ర మెగా టెక్స్​టైల్ పార్క్స్ ఏర్పాటుతో 20 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని, ఇందులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మౌలిక వసతులు ఉంటాయని వివరించారు. ప్లగ్ అండ్ ప్లే సదుపాయాలు కల్పించబోతున్నట్లు వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాలను సమన్వయం చేసుకొని స్కీమ్ ను కొనసాగిస్తామని చెప్పారు. ప్రతి పీఎం మిత్ర పార్కుకు పోటీతత్వ ప్రోత్సాహక మద్దతు(సీఐఎస్)గా రూ.300 కోట్లు అందిస్తామన్నారు. ఈ స్కీం కోసం కేంద్ర బడ్జెట్ లో రూ.4,445 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.