
లక్నో: ఒక వ్యక్తి దగ్గర పర్స్, మొబైల్ ఫోన్లు, ఏటీఎంలు కొట్టేసిన దొంగలు పిన్ నంబర్ కోసం వచ్చి పోలీసులకు చిక్కారు. నోయిడాలో బుధవారం ఈ ఘటన జరిగింది. డిన్నర్ కోసం బయటికి వచ్చిన వ్యక్తి దగ్గర నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గన్‌తో బెదిరించి పర్స్, మొబైల్, దొంగలించారు. ఆ పర్సులో ఏటీఎం కార్డు కూడా ఉంది. అయితే కొద్ది దూరం వెళ్లిన దొంగలు ఏటీఎం పిన్ కోసం వెనక్కి వచ్చారు. బెదిరించి పిన్ తెలుసుకుని వెళ్లారు. అయితే సదరు వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దర్నీ ఒక చెక్‌పోస్ట్ దగ్గర పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులపై నిందితులు కాల్పులు జరిపారని పోలీసు అధికారులు చెప్పారు. చెక్ చేసేందుకు బైక్ ఆపాలని పోలీసులు కోరడంతో కాల్పులు జరిపారని, పోలీసులు ఎదురుకాల్పులకు దిగారని అన్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడినట్లు చెప్పారు. రెండు గన్‌లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.