
- 12, 13 తేదీల్లో 60 కి.మీ. వేగంతో వీచే ప్రమాదం
- హెచ్చరించిన ఐఎండీ.. ఆ రెండు రోజులకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సోమవారం, మంగళవారం రెండు రోజులు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉందని పేర్కొంది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. సోమవారం సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో, మంగళవారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.
ఆయా జిల్లాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. మిగతా జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈదురుగాలులతో పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కాగా, శనివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. సిటీలో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. గురువారం మూడు జిల్లాల్లో 41 డిగ్రీలకన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 41.7, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 41.2, సూర్యాపేట జిల్లా పెద్దవీడులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకన్నా తక్కువగా నమోదయ్యాయి.