
హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల పేరుతో అధికార బీఆర్ఎస్ కొత్త డ్రామాకు తెరదీసిందని ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఆరోపించారు. మత్స్యకారులను కేసీఆర్ సర్కార్ నిండా ముంచిందన్నారు. మంగళవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకే చేప పిల్లల కాంట్రాక్ట్‌లను బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేప పిల్లల పంపిణీలోనూ 30 శాతం కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. కమీషన్ లేకుండా మత్స్యకార సొసైటీల్లో కనీసం సభ్యత్వం కూడా ఇవ్వడం లేదన్నారు. సొసైటీల అధికారాలను తగ్గించి నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న నాసిరకం చేప పిల్లల వల్ల మత్స్యకారులు నష్టపోతున్నారన్నారు. ఈ నెల 8న ప్రభుత్వం నిర్వహించే చెరువుల పండుగను మత్స్యకారులు బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.