ఉపాధి పేరుపై పేచీ.. రూ.300 కోట్లు పెండింగ్

ఉపాధి పేరుపై పేచీ..  రూ.300 కోట్లు పెండింగ్
  • వీబీ జీ రామ్ జీ నిబంధనల మార్పు ఎఫెక్ట్ 
  •     ఈ ఆర్థిక సంవత్సరం ఇంకా ఖరారుకాని బడ్జెట్​
  •     నిధులు, పని దినాలపై కొరవడిన స్పష్టత
  •     ఏటా తగ్గుతున్న లేబర్‌‌ బడ్జెట్‌‌
  •     మూడు నెలలుగా ఆగిపోయిన ఉపాధి బకాయిలు
  •     మళ్లీ వేల కుటుంబాల వలసబాట

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్​కు గతంలో మాదిరిగా నేరుగా బడ్జెట్‌‌  కేటాయించకుండా కొత్త పథకంలో విలీనం చేయనుంది. ఇందులో భాగంగా ఎంజీఎన్‌‌ఆర్‌‌ఈజీఎస్‌‌  స్థానంలో ‘వికసిత్‌‌  భారత్‌‌- గ్యారంటీ ఫర్‌‌ రోజ్‌‌గార్‌‌ అండ్‌‌  ఆజీవిక మిషన్‌‌’ కొత్త స్కీమ్​ను తీసుకొచ్చింది. దాంతో పాత ఉపాధి హామీ పథకానికి బడ్జెట్‌‌  కేటాయింపులను తగ్గించి కొత్త పథకానికి మళ్లించింది. గతంలో కేంద్రం 90 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు 10 శాతం నిధులు భరించేవి. కొత్త స్కీమ్​లో  కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం భరించేలాగా మార్పులు చేసింది. ఉపాధి హామీ చట్టం ప్రకారం పాత పద్ధతిలో పని అడిగితే హక్కుగా కల్పించాలనే నియమం ఉండేది. కానీ, ఇప్పుడు కేంద్రం పరిమితి విధించింది. 

ఆ పరిమితి దాటి పని కావాలంటే రాష్ట్రాలే సొంతంగా ఖర్చు పెట్టుకోవాల్సిందే.. కాగా, రాష్ట్రానికి గత మూడు నెలలుగా రావాల్సిన రూ.300 కోట్లను కేంద్రం పెండింగ్‌‌ లో పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వీబీ జీ రామ్​జీ స్కీమ్ ను వ్యతిరేకిస్తుండడం.. ఇంకా పాత ఉపాధి పథకాన్నే కొనసాగిస్తుండడంతో  పేరుపై పేచీ కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్​లో పెట్టినట్లు తెలిసింది. ఫలితంగా దాని ప్రభావం ఉపాధి కూలీలు, ఫీల్డ్​ అసిస్టెంట్లు, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులపై పడింది. ప్రతినెలా సుమారు రూ.100 కోట్ల చొప్పున మూడు నెలలకు రూ.307 కోట్లు పెండింగ్‌‌లో ఉన్నాయి. ఇందులో రూ.57 కోట్లు మాత్రమే కేంద్రం చెల్లించింది. 

వేతనాలు అందక ఆందోళనలో సిబ్బంది 

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద 12,500 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరిలో ఫీల్డ్​ అసిస్టెంట్లు, ఔట్ సోర్సింగ్​ఉద్యోగులతోపాటు ఇతర సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఇంటి అద్దె, నిత్యావసరాలు, స్కూల్​ ఫీజుల కోసం అప్పులు చేయాల్సి వస్తున్నదని వాపోతున్నారు. కూలీలు సైతం వేతనాలు అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. చట్ట ప్రకారం 15 రోజుల్లో కూలి డబ్బులు జమచేయకపోతే.. రోజువారీగా లెక్కేసి పరిహారాన్ని అందించాల్సి ఉంటుంది. 

మరోవైపు..  కేంద్రం ఆధార్‌‌  ఆధారిత చెల్లింపుల వ్యవస్థను తప్పనిసరి చేసింది. బ్యాంకు ఖాతాలకు ఆధార్  అనుసంధానం కాకపోవడం, జాబ్‌‌కార్డుల్లో పేర్లు, పుట్టిన తేదీల్లో తేడాలు ఉండడంతో వేలమంది పేమెంట్లు నిలిచిపోయాయి. వీటిని సరిదిద్దడంలో క్షేత్రస్థాయిలో అధికారులు  విఫలం  అవుతున్నారు. అయితే.. కేంద్రం మాత్రం బ్యాంకు అకౌంట్లు, ఆధార్‌‌  నంబర్‌‌  లింక్‌‌  లాంటి అంశాలను సాకుగా చూపుతూ స్కీమ్​ ఉద్దేశాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

రాష్ట్రంలో 52.21 లక్షల జాబ్‌‌కార్డులు 

రాష్ట్రంలో 52.21 లక్షల జాబ్‌‌కార్డులు ఉండగా.. మొత్తం 1.07 కోట్ల మంది కూలీలు ఉన్నారు. వీరిలో యాక్టివ్‌‌గా పనిచేసే కూలీలు 49.64 లక్షల మంది ఉన్నారు. వీరికి కనీసం వంద రోజులకు తగ్గకుండా ఉపాధి పనులు కల్పించాలి. ఉపాధి పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జాతీయ మొబైల్‌‌  పర్యవేక్షణ విధానం (ఎస్ఎంఎంఎస్) అమలులోకి తెచ్చింది. ఆ యాప్‌‌లో కూలీల ముఖ ఆధారిత హాజరు తీసుకున్నాకే పని కల్పించాలి. ఉదయం 8 గంటలకు కూలి ఒకసారి ఫొటో దిగితే మళ్లీ మధ్యాహ్నం 12 గంటలకు ఫొటో తీయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. 

ఒక గ్రామంలో వంద మంది కూలీలు నాలుగైదు ప్రాంతాల్లో పనిచేస్తే అన్ని ప్రాంతాలకు వెళ్లి ఫీల్డ్​ ‍అసిస్టెంట్‌‌ రెండుసార్లు అథెంటిఫికేషన్‌‌  ఫొటో తీయాల్సిందే. లేకపోతే పనిచేసినా ఆయా కూలీలకు డబ్బులు జమకావు. అయితే, మారుమూల గ్రామాల్లో సిగ్నల్  సమస్యలు, యాప్‌‌లో సాంకేతిక లోపాలతో  చాలా మందికి హాజరుపడడం లేదు. పనిచేసినా హాజరు నమోదు కాకపోవడంతో వేతనాలు రాక కూలీలు పనులకు వెళ్లడమే మానేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది కూలీలు ఈ పథకానికి దూరమైనట్లు గణాంకాలు చెబుతున్నాయి.  

ఏటికేడు తగ్గుతున్న లేబర్‌‌ బడ్జెట్‌‌

ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఏటా లేబర్‌‌ బడ్జెట్‌‌ను  తగ్గిస్తూ వస్తోంది. పనిదినాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా నిధుల విడుదలలో జాప్యం కూడా చేస్తున్నది. నాలుగేండ్లలోనే గ్రామీణ కూలీల పనిదినాలను సగానికి తగ్గించింది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి 11 కోట్ల పనిదినాలను మంజూరు చేయగా..  2025–-26లో వాటిని 7 కోట్లకే పరిమితం చేసింది. 

సుమారు 4 కోట్ల పనిదినాలను కుదించింది. దీంతో గ్రామాల్లో వేల కుటుంబాలు ఉపాధి కోల్పోయి వలసబాట పట్టాయి. ప్రస్తుత 2026–-27 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకానికి కేంద్రం ఇంతవరకు బడ్జెట్‌‌ను ఖరారు చేయలేదు. ఈ ఏడాది ఎన్ని పని దినాలు కల్పిస్తారు? ఎన్ని నిధులు కేటాయిస్తారు? అనేదానిపై స్పష్టత కొరవడింది.