- ఏటా వర్షాల సమయంలో హడావుడిగా పూడికతీత
- రూ.2 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నా ఫలితం శూన్యం
- చాలాచోట్లా కొద్దిపాటి వానకే ఓవర్ ఫ్లో అవుతున్న కాల్వలు
హనుమకొండ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నాలాల్లో పేరుకుపోతున్న పూడిక ముంపునకు కారణమవుతోంది. కూల్చేసిన బిల్డింగ్ వ్యర్థాలు, మట్టి, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారం, గుర్రపుడెక్కతో కాల్వల్లో మీటర్లలోతు సిల్ట్ పేరుకుపోతుండగా, కొద్దిపాటి వానపడినా చాలాప్రాంతాల్లో కాల్వలు ఓవర్ ఫ్లో అవుతున్నాయి. వాస్తవానికి నగరంలో ఏటా దాదాపు రూ.2 కోట్లతో నాలాల పూడికతీత చేపడుతుండగా, కాంట్రాక్టర్లు వర్షాల సమయంలో నామమాత్రంగా డీసిల్టేషన్ చేపట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వానాకాలానికి ముందే నాలాల్లో పూర్తిగా పూడికతీస్తే ముంపు సమస్య తప్పుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నాలుగైదు మీటర్లలోతు పూడిక..
వరంగల్ ట్రై సిటీలో నయీంనగర్, భద్రకాళి, బొందివాగు, ఇతర ప్రధానమైన నాలాలు 53.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా, ఒక మీటర్ నాలాలు, పక్కా డ్రైన్లు, కచ్చా డ్రైన్లు అన్నీ కలిపి సుమారు 4 వేల కిలోమీటర్ల వరకు ఉన్నాయి. గతేడాది అక్టోబర్ చివరి వారంలో కురిసిన వర్షాలకు నగరంలోని వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చే నయీంనగర్ నాలా, వరంగల్ వైపు బొందివాగు నాలా, భద్రకాళి నాలాలు ఉప్పొంగాయి.
ఆ వరదల్లో ఎగువ ప్రాంతాల నుంచి కొట్టుకువచ్చిన మట్టి చాలాచోట్లా గుట్టలుగా పేరుకుపోయింది. అప్పటినుంచి మట్టి గడ్డలు అలాగే ఉండిపోవడంతో వాటిపై చెట్లు పెరిగి నాలాలను కమ్మేశాయి. వరదల తాకిడికి నాలాల వెంట కూలిపోయిన గోడలు, ఇతర చెత్తాచెదారం, గుర్రపుడెక్కతో నాలాలు సగానికిపైగా నిండిపోయాయి. ఇలా నాలుగైదు మీటర్ల లోతు మేరకు సిల్ట్ పేరుకుపోగా, పైనుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
అసలే ఇరుకు ఆపై సిల్ట్..
వరంగల్ నగరంలో ఏర్పాటు చేసిన డ్రైనేజీలు చాలాచోట్లా ఇరుకుగా మారాయి. పైనుంచి వచ్చే వరద ఫ్లోకు అనుకూలంగా వెడల్పు లేకపోవడంతో పాటు చాలాప్రాంతాల్లో కాల్వల మధ్యలోనే స్తంభాలు, పైపులైన్లు ఉన్నాయి. దీంతో వరద ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ సమస్య ఉండగా, అందులోనూ సిల్ట్ పేరుకుపోవడం సమస్యగా మారుతోంది. దీంతో కొద్దిపాటి వర్షానికి కూడా వరద డ్రైనేజీల పైనుంచి ప్రవహిస్తోంది. ఫలితంగా ఆ చుట్టుపక్కల రోడ్లు, ప్రాంతాలన్నీ జలయమమవుతున్నాయి.
ఏటా రూ.2 కోట్ల వరకు ఖర్చు..
వర్షాకాలంలో వరద ముంపు పరిస్థితులు ఏర్పడకుండా ఏటా డీసిల్టేషన్ చేస్తున్నారు. ఒక మీటర్ వెడల్పు ఉండే కాల్వలను జీడబ్ల్యూఎంసీ పీహెచ్ వర్కర్లు క్లీన్ చేస్తుండగా, ఆపై నాలాలను ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో టెండర్లు పిలిచి పూడికతీత పనులు చేపడుతున్నారు. ఇలా డీసిల్టేషన్ పనుల కోసం ఏటా రూ.2 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. కానీ పనులు దక్కించుకుంటున్న కాంట్రాక్టర్లు నామమాత్రంగానే పూడికతీత పనులు చేపట్టి వర్షాలు పడగానే చేతులు దులిపేసుకుంటున్నారనే విమర్శలున్నాయి. పూడిక తీయకుండానే చాలాచోట్ల పనులు పూర్తి చేసినట్లు రికార్డ్ చేసి నిధులు మింగుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ముందస్తుగా మేల్కొంటేనే బెటర్..
వరంగల్ నగరంలో చాలాచోట్లా ఇరుకు నాలాలు, వాటిలో సిల్ట్ పేరుకుపోవడం వల్ల ముంపు సమస్యలు తలెత్తుతుండగా, ముందస్తుగా మేల్కొంటేనే చాలా కాలనీలకు ముంపు ముప్పు తప్పే అవకాశం కనిపిస్తోంది. వర్షాలు ప్రారంభం కాకముందే పూడికతీత పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రధాన నాలాల్లో డీసిల్టేషన్ పేరున నిధులు వృథా చేయకుండా పెద్దాఫీసర్లు పర్యవేక్షణ చేయాలని డిమాండ్లు చేస్తున్నారు. కాగా, డీసిల్టేషన్ ప్రక్రియకు చర్యలు చేపడుతున్నామని, టెండర్లు పిలిచి పనులు మొదలు పెడతామని జీడబ్ల్యూఎంసీ అధికారులు చెబుతున్నారు.
