డాక్టర్ కనికా శర్మ ఫరీదాబాద్‌లోని ఒక సంప్రదాయ కుటుంబంలో పుట్టింది. 30 మంది కుటుంబసభ్యుల మధ్య పెరిగింది. ఆమె 11 ఏండ్ల వయసు నుంచే తన తమ్ముళ్లు, చెల్లెళ్లను చూసుకునేది. బాగా చదువుకుని తండ్రి కోరిక మేరకు డాక్టర్ అయింది. తర్వాత హెల్త్‌కేర్ మేనేజ్‌మెంట్‌లో ఆరు సంవత్సరాలు పనిచేసింది. కనిక ఒకరోజు తన నాలుగేళ్ల కొడుకుని స్కూల్‌లో పాఠాలు కాకుండా ఇంకా ఏం నేర్చుకున్నావని అడిగింది. అప్పుడు అతడు ‘‘గుడ్ టచ్, బ్యాడ్ టచ్” అని సమాధానమిచ్చాడు. ఆ మాట విన్న తర్వాత కనిక ‘‘కేవలం ఈ రెండు విషయాలపై అవగాహన ఉంటే సరిపోతుందా? నా బిడ్డకు నిజంగా ఏదైనా ఆపద వస్తే ఏం చేయాలో, తన పరిస్థితిని ఎలా వ్యక్తం చేయాలో, ఎవరిని సాయం అడగాలో తెలుసా?” అని లోతుగా ఆలోచించింది. ఆ ఆలోచన కనికను నిద్రపోనివ్వలేదు. కేవలం అప్పుడప్పుడు గంట సేపు ఇచ్చే ఉపన్యాసాల వల్ల పిల్లల్లో మార్పు రావడం కష్టమని ఆమె గ్రహించింది. శాస్త్రీయమైన పద్ధతుల్లో నిరంతరం అవగాహన కల్పిస్తేనే పిల్లలు ధైర్యంగా ఎదగగలరని నమ్మింది. పిల్లల సేఫ్టీపై ‘బీ స్మార్ట్ బీ సేఫ్’, కోకోస్ ఫీలింగ్స్, ఇట్స్ టైం టు వాయిస్ మై చాయిస్’ లాంటి పుస్తకాలు రాసింది.
హప్చి ప్రత్యేకత ఏంటి?
కనిక 2020లో ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. ఐఐఎం బెంగళూరులోని ఎన్‌ఎస్‌ఆర్‌సీఈఎల్ విమెన్ స్టార్టప్ ప్రోగ్రామ్‌కు అప్లై చేసింది. ఆ ఇనిస్టిట్యూట్ సాయంతో స్కూల్ పిల్లలకు లైఫ్‌స్కిల్స్‌పై అవగాహన కల్పించేందుకు 2021లో ‘హప్చి’ (హ్యాపీ చిల్డ్రన్)ని స్థాపించింది. చాలామంది ‘పిల్లల సేఫ్టీ’ అనగానే ఎక్కువగా లైంగిక వేధింపుల గురించి చెప్తుంటారు. కానీ, హప్చి పరిధి చాలా పెద్దది. ఇందులో ‘హప్‌సేఫ్’ పేరుతో ఒక సమగ్రమైన కరిక్యులమ్‌ని రూపొందించారు. ఇది 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి స్థాయి విద్యార్థికి వేర్వేరుగా ఉంటుంది. కరిక్యులమ్‌లో ఏముందంటే..
బాడీ అటానమీ: పిల్లలకు తమ శరీరంపై పూర్తి హక్కు ఉంటుందని, ఎవరైనా తాకినప్పుడు అది వారికి అసౌకర్యంగా అనిపిస్తే ‘నో’ అని చెప్పే ధైర్యం ఉండాలని నేర్పిస్తారు. ఇది కేవలం ఫిజికల్ టచ్‌కి మాత్రమే పరిమితం కాదు. వాళ్ల వ్యక్తిగత పరిధి (పర్సనల్ స్పేస్) గురించి కూడా చెప్తారు.
ఎమోషనల్ ఇంటెలిజెన్స్: కొందరు పిల్లలు తమ కోపాన్ని, భయాన్ని లేదా బాధను ఎలా వ్యక్తం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. హప్చి అలాంటివాళ్లకు సులభమైన పద్ధతులను నేర్పిస్తుంది. ఉదాహరణకు, ఒత్తిడిగా ఉన్నప్పుడు ‘కేక్‌ను ఊహించుకుని కొవ్వొత్తిని ఊదడం’ అనే బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చని చెప్తారు.
డిజిటల్ సేఫ్టీ: ప్రస్తుత కాలంలో పిల్లలు సెల్‌ఫోన్లకు, ఆన్‌లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. సైబర్ బుల్లీయింగ్, ఆన్‌లైన్ మోసాల నుంచి వారిని ఎలా కాపాడుకోవాలో హప్చి అవగాహన కల్పిస్తుంది. సోషల్ మీడియాలో ఏది షేర్ చేయాలి, ఏది చేయకూడదో చెప్తుంది. వేధింపులు: స్కూళ్లలో తోటి విద్యార్థుల నుంచి ఎదురయ్యే హేళనలు, వేధింపులను ఎలా ఎదుర్కోవాలో, ఎవరికి ఫిర్యాదు చేయాలో నేర్పిస్తారు.
డిజిటలైజ్డ్ సర్వీసులు
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, హప్చి సేవలను డిజిటలైజ్ చేశారు. 2025లో ప్రారంభమైన ‘హప్‌స్మార్ట్’ ప్లాట్‌ఫామ్ ద్వారా స్కూళ్లు ఈ సేఫ్టీ పాఠాలను తమ సిలబస్‌లో సులభంగా చేర్చుకోవచ్చు. ఇందులో ఉన్న ‘హప్‌బడ్డీ’ అనే చాట్‌బాట్ ఏఐ సాయంతో పనిచేస్తుంది. ఇది పిల్లలకి, తల్లిదండ్రులకు వచ్చే సందేహాలకు శాస్త్రీయమైన, సులభమైన సమాధానాలను అందిస్తుంది. ఇది ఒక స్నేహితుడిలా పిల్లలతో సంభాషిస్తూ వాళ్ల సమస్యలను గుర్తిస్తుంది.
మాతో పంచుకుంటున్నారు
బెంగళూరులోని న్యూ హారిజన్ గురుకుల్ స్కూల్ కౌన్సెలర్ జాస్మిన్ పద్దా “హప్చి ద్వారా అవగాహన కల్పించడం మొదలుపెట్టాక పిల్లలు అన్ని విషయాలు మాతో పంచుకుంటున్నారు. ఏ టైంలో ఎలా రియాక్ట్ కావాలో మమ్మల్ని అడిగి మరీ తెలుసుకుంటున్నారు” అన్నారు.
నేటి వేగవంతమైన ప్రపంచంలో సాంకేతికత ఎంతగా విస్తరిస్తోందో, పిల్లల చుట్టూ ఆపదలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. స్కూల్ బస్ నుంచి ఇంటర్నెట్ గేమ్స్ వరకు ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందో తెలియని పరిస్థితి. అందుకే పిల్లలకు పుస్తకాల్లోని పాఠాలు మాత్రమే సరిపోవు. తమను తాము రక్షించుకోవడానికి కావాల్సిన ‘జీవన నైపుణ్యాలు’ (లైఫ్ స్కిల్స్) కూడా నేర్పించాలి అనుకుంది డాక్టర్ కనికా శర్మ. ఆ ఆలోచన నుంచి పుట్టిందే హప్చి.
60 వేల మందికి అవగాహన
కేవలం మూడు నాలుగేళ్లలోనే హప్చి ఎన్నో విజయాలను సాధించింది. దేశవ్యాప్తంగా 60కి పైగా ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. సుమారు 60 వేల మంది విద్యార్థులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవగాహన కల్పించింది. 5 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి, స్కూల్ వాతావరణాన్ని పిల్లలకు అనుకూలంగా మార్చేలా చేసింది. 10 వేల మందికి పైగా తల్లిదండ్రులకు తమ పిల్లలతో ఎలా మాట్లాడాలి, వారి ప్రవర్తనలో మార్పులను ఎలా గమనించాలి అనే విషయాలపై అవగాహన కల్పించింది. ఇప్పుడు కనికా శర్మ టీం గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు కూడా తన సర్వీసులను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది.
