టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా అటు నిర్మాతలకు, ఇటు ఎగ్జిబిటర్లకు మధ్య నడుస్తున్న పర్సంటేజీ వివాదం ఎట్టకేలకు సద్దుమణిగింది. మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగడంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పడింది.
చిరంజీవి తీసుకున్న చొరవతో.. ప్రస్తుతానికి పెద్ది సినిమాను పాత పద్ధతి అయిన రెంటల్ విధానంలోనే థియేటర్లలో ప్రదర్శించేందుకు ఇరువర్గాలు అంగీకరించాయి. అలాగే ఒకవేళ థియేటర్లలో టికెట్ ధరలను పెంచితే... అందులో ఏడున్నర శాతం (7.5%) మొత్తాన్ని ఎగ్జిబిటర్లకు చెల్లించేలా ఒక కీలక ఒప్పందానికి వచ్చారు.
అయితే జూన్ 30వ తేదీ తర్వాత విడుదలయ్యే కొత్త సినిమాలను మాత్రం.. కచ్చితంగా పర్సంటేజీ పద్ధతిలోనే ప్రదర్శించాలని తెలంగాణ ఎగ్జిబిటర్లు నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని వారు చిరంజీవిని కలిసి స్వయంగా వివరించారు.
దీనిపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. భవిష్యత్తులో కూడా ఇరు వర్గాలకు ఎలాంటి నష్టం జరగకుండా, ఫిలిం చాంబర్ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారమే నడుచుకోవాలని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్‌కు సానుకూలంగా సూచించారు. చిరంజీవి సమయస్ఫూర్తితో జోక్యం చేసుకోవడంతో.. టాలీవుడ్‌లో రేగిన ఒక పెద్ద వివాదానికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.
