- అమ్మవార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించిన మంత్రులు పొన్నం, సురేఖ
- ప్రత్యేక పూజలు చేసిన సీఎం సతీమణి, కూతురు
పద్మారావునగర్, వెలుగు: బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. భక్తుల జయ జయ ధ్వానాలు, మంగళవాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ మంగళవారం బల్కంపేట రేణుకా ఎల్లమ్మ జమదగ్ని మునిరాజుల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
హైదరాబాద్నగరం నలుమూలల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణంతో పాటు పరిసర వీధులన్నీ జనసందోహంగా మారాయి. అమ్మవారి నామస్మరణతో ఆ ప్రాంతమంతా మార్మమోగింది. వేలాది మంది భక్తుల రద్దీతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున రవాణా, బీసీ సంక్షేమం, హైదరాబాద్ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కల్యాణ వేడుకను వీక్షించారు. ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి, కూతురు నైమిషారెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కుటుంబ సభ్యులు, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ కుటుంబ సభ్యులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య రెడ్డి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
భక్తులకు మెరుగైన వసతులు
అమ్మవారి కల్యాణ మహోత్సవానికి హాజరైన లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ చైర్మన్ సాయిబాబా పర్యవేక్షణలో మెరుగైన వసతులు కల్పించారు. నిరంతర తాగునీరు, విద్యుత్ సరఫరా, వైద్య సదుపాయాలు కల్పించారు. ముందస్తు ప్రణాళికతో చేపట్టిన క్యూలైన్ల నిర్వహణతో భక్తులకు ఇబ్బందులు తప్పాయి.
