హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పోలీస్ శాఖలో భర్తీకి ఆమోదం తెలిపిన 7,400 పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను 4 వారాల్లోగా సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డులను హైకోర్టు ఆదేశించింది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ కోరుతూ కె. అఖిల్ శ్రీగురుతేజ దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు డివిజన్ బెంచ్ మంగళవారం విచారించింది.
ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ ప్రస్తుతం 5 వేల పోలీస్ పోస్టుల రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ప్రారంభమైందని, దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇప్పటికే జారీ చేసిందని కోర్టుకు తెలిపారు. గత విచారణలో 7 వేలకు పైగా పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పి, ఇప్పుడు కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని పిటిషనర్ తరఫు కౌన్సెల్ వాదించారు.
దీనిపై ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ ప్రస్తుతం నోటిఫికేషన్ ఇచ్చిన 5 వేల పోస్టుల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయని, మిగిలిన 2,400 పోస్టులు ఫైర్ సర్వీసెస్, ప్రిజన్స్ డిపార్ట్‌మెంట్లకు సంబంధించినవని వివరించారు. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ పూర్తయ్యేలోపు మరిన్ని ఖాళీలు ఏర్పడే అవకాశం ఉన్నందున, నిర్దిష్ట సమయ పరిమితితో నియామకాలు పూర్తి చేయాలని పిటిషనర్ తరఫు కౌన్సెల్ కోరారు.
