- సోనమ్‌కు ఏదైనా జరిగితే కేంద్రమే బాధ్యత వహించాలని హెచ్చరిక
పంజాగుట్ట, వెలుగు: శాంతియుత దీక్షలను భగ్నం చేయడం అప్రజాస్వామికమని, నీట్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా దీక్ష చేపట్టిన సోనమ్ వాంగ్‌చుక్‌ను బలవంతంగా అరెస్ట్ చేసి, కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వకుండా వేరే ప్రాంతానికి తరలించడం దారుణమన్నారు.
సోనమ్‌కు ఏదైనా జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా వేలాది మంది విద్యార్థులు మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆకునూరి మురళి మాట్లాడుతూ... సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న దీక్షకు ప్రజల సంపూర్ణ మద్దతు ఉందన్నారు.
ఆయనకు మద్దతు తెలిపేందుకు వేలాది మంది విద్యార్థులు తరలిరావడం వారి ప్రజాభిమానానికి అద్దం పడుతోందన్నారు. శాంతియుత ఉద్యమాలను, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం గౌరవించాలని, ఒకవేళ అణచివేసేందుకు ప్రయత్నిస్తే ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని హెచ్చరించారు. నీట్ స్కామ్ నిందితులను రక్షించాలని చూస్తే కేంద్రానికి విద్యార్థుల శాపం తగులుతుందని మండిపడ్డారు.
సోనమ్ వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నీట్ విద్యార్థులు కదం తొక్కారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు వందలాదిగా నీట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తరలివచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్లకార్డులు పట్టుకొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నీట్ పేపర్ లీకేజీపై నిజనిర్ధారణ కమిటీ వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
ట్యాంక్ బండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
మరోవైపు ట్యాంక్ బండ్ పైనున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నీట్ విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి శాంతియుతంగా నిరసన చేపట్టారు. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ అంబేద్కర్ విగ్రహం వైపు రాగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున విద్యార్థులు చేరుకోవడంతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా విద్యార్థుల నిరసనలతో మార్మోగింది.
