- కమలం పార్టీ ‘మిషన్తెలంగాణ’
- అమిత్ షా, బీఎల్ సంతోష్ పర్యవేక్షణలో 3 ఏజెన్సీల గ్రౌండ్ వర్క్ షురూ
- బెంగాల్ ఎలక్షన్లలో కీలకంగా వ్యవహరించిన స్పెషల్ టీమ్ సైతం ఎంట్రీ
- రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం ‘ఆపరేషన్ సాఫ్రాన్’ మొదలుపెట్టింది. రాబోయే జీహెచ్‌ఎంసీ, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రొఫెషనల్ ఏజెన్సీలను రంగంలోకి దించింది.
ఇప్పటికే రెండు ఏజెన్సీలు పనిచేస్తుండగా, తాజాగా పశ్చిమ బెంగాల్, బిహార్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన‘అభీష్ట’ టీమ్ ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీ పెద్దల ప్రత్యక్ష పర్యవేక్షణలో విధులు నిర్వహిస్తున్న ఈ బృందం.. బూత్ స్థాయి నుంచి పార్టీ పరిస్థితులు, లోటుపాట్లపై అధ్యయనం చేస్తూ హైకమాండ్‌కు సలహాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిసింది.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేరుగా పర్యవేక్షించే ‘అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్ (ఏబీఎం)’ కొన్ని నెలలుగా రాష్ట్రంలో పార్టీ ఎజెండా, ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది. మరోవైపు జార్విస్ సంస్థ భారీ కాల్ సెంటర్ల ద్వారా ఓటర్లను సంప్రదించడం, ఫీడ్ బ్యాక్ తీసుకోవడం, బూత్ కమిటీలను పర్యవేక్షించడం లాంటి పనులు చేస్తోంది. బీజేపీ ఉపయోగిస్తున్న ‘సరళ్ యాప్’ నిర్వహణ బాధ్యతలను కూడా ఈ సంస్థే చూస్తోంది.
ఇక ఇప్పుడు కొత్తగా వచ్చిన ‘అభీష్ట’ ఏజెన్సీ అత్యంత కీలకంగా మారింది. గతంలో బెంగాల్ ఎన్నికల్లో భూపేంద్రా యాదవ్‌కు రిపోర్ట్ చేసిన ఈ టీం.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పర్యవేక్షణలో పనిచేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పరిశీలన, సర్వే పద్ధతుల్లో ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, పార్టీ స్థితిగతులు, నేతల పనితీరును ఎప్పటికప్పుడు తెలుసుకుంటూహైకమాండ్‌కు రిపోర్ట్ ఇవ్వడంతోపాటు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలనూ సూచిస్తుంది. కాగా, ఈ ఏజెన్సీకి లోకల్‌గా సహాయ సహకారాలు అందించేందుకు బీజేపీ, సంఘ్ నుంచి వలంటీర్లను నియమించనున్నట్టు తెలిసింది.
సర్ పరిశీలనతో షురూ..
ప్రస్తుతం ఈ టీం మొదట రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియను నిశితంగా గమనిస్తోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం ఎలా ఉంది..? బూత్ లెవల్ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? అనే అంశాలపై అగ్రనాయకత్వానికి ఎప్పటికప్పుడు రిపోర్టులు పంపుతోంది. దీనికితోడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని గెలిపించగల లేదంటే ప్రభావితం చేయగల 50 నుంచి 100 మంది ప్రముఖ వ్యక్తుల జాబితాను ఈ టీం తయారు చేయనున్నట్టు పార్టీవర్గాలు చెప్తున్నాయి. ఇందులో రాజకీయ నేతలతో పాటు క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యాపారవేత్తలు, మేధావులు, సామాజికవేత్తలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్థానిక సమస్యలను ఆరా తీస్తూ.. జనాల్లో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు.
టార్గెట్ జీహెచ్ఎంసీ.. ఆపై అసెంబ్లీ
ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటేలా అభీష్ట టీం చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల నాడిని పట్టుకుని, అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు ఈ టీమే బ్యాక్ ఎండ్ నుంచి నడిపించనున్నట్టు కాషాయవర్గాలు చెప్తున్నాయి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఈ ఏజెన్సీలే తెలంగాణలో మకాం వేసి, పార్టీలోకి చేరికల జోరు పెంచడంతోపాటు ఇతర పార్టీల్లోని అసంతృప్త నేతలను బీజేపీ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించేలా పనిచేయబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద బీజేపీ ఈసారి గెలుపు కోసం కేవలం నాయకులపైనే కాకుండా.. పక్కా కార్పొరేట్ తరహా వ్యూహాలపై ఆధారపడుతున్న తీరు, పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఈ ఏజెన్సీలు బీజేపీని ఏ మేరకు గట్టెక్కిస్తాయనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
