మహిళా రైతులకు షేడ్ నెట్స్... రైతుల ఆర్థికాభివృద్ధిపై సెర్ప్ స్పెషల్ ఫోకస్

మహిళా రైతులకు షేడ్  నెట్స్... రైతుల ఆర్థికాభివృద్ధిపై సెర్ప్ స్పెషల్ ఫోకస్
  • పైలట్ ప్రాజెక్ట్​గా రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్​ జిల్లాల ఎంపిక
  • 50 శాతం సబ్సిడీ, మిగతాది బ్యాంకు లింకేజీతో రుణం 
  • హైదరాబాద్, వెలుగు:రాష్ట్రంలో మహిళా రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వాతావరణ మార్పులను తట్టుకుంటూ, తక్కువ విస్తీర్ణంలోనే ఎక్కువ లాభాలు గడించేలా ‘షేడ్ నెట్స్’ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. సంప్రదాయ పంటల కంటే వాణిజ్య పంటల వైపు మహిళా రైతులను మళ్లించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మార్చడమే లక్ష్యంగా సెర్ప్  అధికారులు ప్రణాళికలు రెడీ చేశారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పైలట్  ప్రాజెక్టు కింద రంగారెడ్డి, నాగర్ కర్నూల్, వికారాబాద్ జిల్లాలను ఎంపిక చేశారు. ఈ మూడు జిల్లాల్లో 300 మంది మహిళా రైతులను గుర్తించి, వారిని షేడ్ నెట్స్  సాగుదారులుగా మార్చాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ‘మిషన్  ఫర్  ఇంటిగ్రేటెడ్  డెవలప్‌‌మెంట్  ఆఫ్  హార్టికల్చర్’ (ఎంఐడీహెచ్) పథకం కింద ఈ యూనిట్లను మంజూరు చేయనున్నారు. 240 స్క్వేర్  యార్డ్స్  నుంచి 400 స్క్వేర్  యార్డ్స్  విస్తీర్ణంలో షేడ్  నెట్స్  ఏర్పాటు చేసుకోవచ్చు.
  • సగం సబ్సిడీ.. మిగతాది లోన్

  • షేడ్  నెట్ల నిర్మాణం కోసం రూ.90 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో రైతులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం 50 శాతం భారీ సబ్సిడీని ప్రకటించింది. మిగిలిన 50 శాతం మొత్తాన్ని సెర్ప్  ద్వారా బ్యాంక్  లింకేజీ కల్పించి, సులభ వాయిదాలతో కూడిన రుణాలను అందించనున్నారు. దీంతో నిరుపేద మహిళా రైతులకు పెట్టుబడి భారం ఉండదు.
  • శిక్షణతో సాధికారత..

  • ఆర్థికసాయంతో పాటు మహిళా రైతులకు అవసరమైన సాంకేతికతపై  ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సెర్ప్, హార్టికల్చర్  డిపార్ట్‌‌మెంట్  ‘కేతిరక్షక్  నెట్ హౌస్’ సంస్థల సమన్వయంతో సాగు పద్ధతులు, యంత్రాల వినియోగం, మార్కెటింగ్  మెలకువలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ఏడాది మూడు జిల్లాల్లో వచ్చే ఫలితాలను బట్టి వచ్చే ఏడాది నుంచి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీంతో అటు మహిళా రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు వినియోగదారులకు విషరహిత, నాణ్యమైన కూరగాయలు అందుబాటులోకి 
  • రానున్నాయి.
  • షేడ్ నెట్​తో అనేక ప్రయోజనాలు

  • షేడ్  నెట్స్  సాగుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఎండ తీవ్రత నుంచి పంటలకు రక్షణ ఉంటుంది. నీటి వినియోగం చాలా తక్కువగా ఉంటుందని, చీడపీడల ఉధృతి తగ్గి, పురుగు మందుల వాడకం తగ్గుతుందని పేర్కొంటున్నారు. ఎండ తీవ్రత, గాలి, భారీ వర్షాల నుంచి పంటకు రక్షణ ఉంటుంది. షెడ్​ లోపల అనుకూలమైన ఉష్ణోగ్రత ఉండడం వల్ల మొక్కలు వేగంగా పెరుగుతాయి. 
  • డ్రిప్  సిస్టమ్  ద్వారా నీటిని అందించడం వల్ల 40 నుంచి 50 శాతం నీరు ఆదా అవుతుంది. తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతాలకు ఈ సాగు మేలు. నెట్  హౌస్  లోపలికి పురుగులు, కీటకాలు ప్రవేశించే అవకాశం తక్కువగా ఉండడంతో పురుగుమందుల ఖర్చు తగ్గి, విషరహిత కూరగాయలు పండించవచ్చు. బయట పండే కూరగాయల కంటే షేడ్  నెట్‌‌లో పండేవి ఆకర్షణీయమైన రంగు, సైజు కలిగి ఉంటాయి. మార్కెట్‌‌లో వీటికి మంచి డిమాండ్  ఉంటుంది.
  •  సీజన్‌‌తో సంబంధం లేకుండా అకాల వర్షాలు కురిసినా పంట దెబ్బతినదు. రైతులు పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే ఆందోళన అవసరం లేకుండా నేరుగా పెద్ద సూపర్  మార్కెట్లు, హోటళ్లు, ఐటీ కారిడార్‌‌లలోని రెసిడెన్షియల్  కాంప్లెక్స్‌‌లకు సరఫరా చేసేలా సెర్ప్  అధికారులు ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. 
  • మహిళా రైతు ఉత్పత్తిదారుల సంఘాలను(ఎఫ్ పీవో) ఏర్పాటు చేసి వారి ద్వారా గ్రేడింగ్, ప్యాకింగ్  చేయించి బ్రాండెడ్  ఉత్పత్తులుగా మార్కెట్లోకి పంపిస్తారు. షేడ్  నెట్లలో కలర్  క్యాప్సికమ్(ఎరుపు, పసుపు), విదేశీ కూరగాయలు(బ్రోకలీ, లెట్యూస్), ఆకుకూరలు(పాలకూర, కొత్తిమీర, పుదీనా), నారు పెంపకం (మిర్చి, టమాటా), పూల సాగు (జర్బెరా, గ్లాడియోలస్) చేపట్టాలని సూచిస్తున్నారు.