ఢిల్లీలో దళపతి: ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

ఢిల్లీలో దళపతి: ప్రధాని మోదీని కలిసిన తమిళనాడు సీఎం విజయ్

ఢిల్లీ పర్యటనలో ఉన్న తమిళనాడు సీఎం విజయ్, ప్రధాని మోదీని కలిశారు. బుధవారం (మే27) సాయంత్రం ఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానిని కలిసిన విజయ్ 20 నిమిషాల పాటు తమిళనాడుకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా చెన్నై మెట్రో రైలు విస్తరణ, జీఎస్టీబకాలయిలపై చర్చించారు. 

ప్రధాని మోదీతో సమావేశం అనంతరం ఢిల్లీలో  తమిళనాడు భవన్  కు సీఎం విజయ్ చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడ బస చేయనున్నారు. గురువారం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పలువురు సీనియర్ కేంద్ర మంత్రులతో కూడా సమావేశం కానున్నారు జోసెఫ్ విజయ్.

234 అసెంబ్లీ స్థానాలకు గాను పార్టీ 108 స్థానాలను గెలుచుకుని  మే 10న సీఎంగా  బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ ఢిల్లీలో పర్యటించడం ఇదే మొదటిసారి. మంగళవారం ఉదయం కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు ఆనకట్ట నిర్మాణానికి అనుమతించవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ విజయ్ ప్రధాని మోదీకి లేఖ రాసిన క్రమంలో ఈ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. 

కర్ణాటక ప్రతిపాదించిన ప్రాజెక్ట్ సుప్రీంకోర్టు తీర్పును  స్పష్టంగా ఉల్లంఘిస్తోందని ప్రధానికి రాసిన లేఖలో విజయ్ పేర్కొన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.