ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లల ఉన్నత చదువులు భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనున్నాయా? గొప్ప ఆశయంతో 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను ప్రారంభించినా.. గత 18 ఏండ్లుగా బకాయిలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. ప్రతిపక్షంలో ఉంటే ఒకవిధంగా.. అధికారపక్షంలో ఉంటే మరొకవిధంగా అన్నట్లుగా ఈ విషయంపై నాయకులు రాజకీయ డ్రామా ఆడుతున్నారు. దాదాపు ఇప్పటివరకు రాష్ట్రంలో రూ. 8,000 కోట్ల ఫీజు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ కళాశాల యజమాన్య సంఘం బంద్, విద్యార్థి సంఘాల ఆందోళన చేస్తున్న క్రమంలో ఇప్పటివరకు రూ. 900 కోట్లు మాత్రమే చెల్లించారు.
ప్రభుత్వం విడుదల చేసిన టోకెన్ ప్రక్రియలో జాప్యంతో ఫీజుల చెల్లింపుపై ప్రైవేట్ కళాశాలల యజమాన్య సంఘాలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం సరైన కౌంటర్ దాఖలు చేయకపోవడంతో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవాలని హైకోర్టు సైతం జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హైకోర్టు విడుదల చేసిన జీవో విద్యార్థులకు ఆందోళనకరంగా మారింది.
భవిష్యత్తులో ఫీజు రీయింబర్స్మెంట్ స్కీంను అమలు చేస్తారా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వం ఈ విషయంలో స్పందించకుంటే హైకోర్టు విడుదల చేసిన జీవో ప్రకారం విద్యార్థుల నుంచి ఫీజు బకాయిలు వసూలు చేస్తామని ప్రైవేట్ కళాశాల యజమాన్య సంఘం హెచ్చరిస్తున్నది. మరోపక్క ఎప్పటిలాగే ప్రతిపక్ష నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ప్రభుత్వం సరైన కౌంటర్ దాఖలు చేయకపోవడంతోనే హైకోర్టు ఈ విధంగా తీర్పు ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాక్ హ్యాండ్ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ హైకోర్టు తీర్పు అమలు చేస్తే... విద్యార్థులు అడ్మిషన్స్ టైంలోనే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ చదరంగం
కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ చదరంగంలో 13 లక్షల మంది పేద విద్యార్థులు బలిపశువులవుతున్నారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, పోస్ట్ -మెట్రిక్ స్కాలర్‌షిప్ బకాయిల వల్ల రాష్ట్ర విద్యారంగం ఎన్నడూ లేనివిధంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో దిక్కుతోచని స్థితిలో 22 మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకోవడం హృదయవిదారకం.
రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ (ఎంబీఎ /ఎంసీఎ), బీఈడీ, జనరల్ డిగ్రీ కాలేజీలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ఏటా బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు కాగితాలపై అంకెల గారడీ చేస్తున్నారే తప్ప.. ఆర్థికశాఖ నుంచి, ట్రెజరీ నుంచి విడతలవారీగా క్లియరెన్స్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతోంది. టోకెన్ల జారీ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కాలయాపన వల్ల ఈ నిధులు అసలు ఎప్పుడు విడుదలవుతాయో, ఎప్పుడు కాలేజీలకు చేరుతాయో తెలియక యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్ర అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
- తీవ్ర మానసిక వేదన
ప్రభుత్వం నుంచి ఫీజులు రాకపోవడంతో విధిలేని పరిస్థితిలో కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయి. ఫలితంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో, వివిధ మల్టీనేషనల్ కంపెనీలలో ఉద్యోగాలు సాధించిన యువత ఒరిజినల్ సర్టిఫికెట్లు లేక ఉద్యోగాల్లో చేరలేకపోతున్నారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనో, ఇతర రాష్ట్రాల్లో స్థిరపడాలనో ఆశపడే పేద, మధ్యతరగతి విద్యార్థుల కలలు సర్టిఫికెట్లు అందక అర్ధాంతరంగా ఆగుతున్నాయి.
పేదవాడికి ఉన్నత విద్య అనేది కేవలం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ వర్గాలకు చెందిన సుమారు 13 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఫీజులు కట్టాలంటూ కాలేజీల నుంచి వస్తున్న ఒత్తిడి భరించలేక తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఫీజులు సకాలంలో అందకపోవడంతో ప్రైవేట్ కాలేజీలు అధ్యాపకులకు, టీచింగ్, నాన్-టీచింగ్ స్టాఫ్‌కు జీతాలు చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఇలా విద్యాబుద్ధులు నేర్పే గురువులు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడటం రాష్ట్ర విద్యా ప్రమాణాలకు గొడ్డలిపెట్టే కదా?
- పొలిటికల్ గ్యారంటీలకు నిధుల మళ్ళింపు
ఫీజు రీయింబర్స్మెంట్ అనేది పేద విద్యార్థులకు రాజ్యాంగబద్ధంగా అందాల్సిన హక్కు. పేదలకు కార్పొరేట్ చదువులను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో తెచ్చిన ఈ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నీరుగార్చాయి. కేంద్ర ప్రభుత్వం తరఫున 'పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్'ల రూపంలో రాష్ట్రానికి అందుతున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వకుండా, తన ఇతర పొలిటికల్ గ్యారంటీలకు, అవసరాలకు డైవర్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్? ఆ నిధులను తక్షణమే విద్యార్థుల లేదా విద్యాసంస్థల ఖాతాల్లో జమ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
గత పదేళ్లుగా విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్, అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా సమస్యను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ఆడుతున్న రాజకీయ చదరంగంలో పేద విద్యార్థులు బలిపశువులు అవుతున్నారు. అంతేకాకుండా ఇవాళ కాలేజీల మూసివేత, సర్టిఫికెట్ల నిలిపివేతపై బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు అనిపిస్తోంది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఫీజు రీయింబర్స్మెంట్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది నిజం కాదా?
- శ్వేతపత్రం విడుదల చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఫీజు బకాయిలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో ఎంత బకాయి ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎంత చెల్లించింది? ఇంకా ఎంత ఇవ్వాలి? అనే అంశాలపై ప్రభుత్వం వెంటనే అధికారికంగా శ్వేతపత్రాన్ని ప్రజల ముందు ఉంచాలి. కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి, విద్యార్థుల కెరీర్ నష్టపోకుండా తక్షణ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి. విద్యాశాఖ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది కాబట్టి దీనిపై పర్మినెంట్ సొల్యూషన్ ఆలోచన చేయాలి.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ఫస్ట్ టు డిగ్రీ వరకు 20% అయితే, ఇంజినీరింగ్ ప్రభుత్వం చెల్లించే ఫీజు 70 శాతం వరకు ఉంటుంది. విదేశీ విద్య నిధి స్కీంతో ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇటీవల అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ విద్యార్థులకు కూడా నెలవారీగా స్టైఫండ్ ఇస్తామని ప్రకటించింది. అయితే, విదేశీ విద్య నిధికి ఒక్కో విద్యార్థికి కేటాయించే నిధులతో సుమారు 1000 మంది పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించవచ్చు. ఇప్పటికైనా విద్యాశాఖ ఆధ్వర్యంలో కమిటీని వేసి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తగు ప్రణాళికలు సిద్ధం చేయాలి. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం కాకుండా చూడాలి.
- అనిల్ కుమార్ యాదవ్
జర్నలిస్ట్
