స్వాతంత్ర్యం అనంతరం భారతదేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో దేశానికి ఆధునిక దిశానిర్దేశం చేసిన నాయకుడు మహా నేత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. శాస్త్రీయ దృక్పథం, ప్రజాస్వామ్య విలువలు, పారిశ్రామికాభివృద్ధి, విద్యా విస్తరణ వంటి అంశాల్లో ఆయన వేసిన పునాదులు నేటి భారత అభివృద్ధికి బలమైన ఆధారాలుగా నిలిచాయి. నెహ్రూ దూరదృష్టి ఆధునిక భారతావనికి నాంది పలికింది.
దేశాన్ని కేవలం వ్యవసాయ ఆధారిత సమాజంగా కాకుండా, పరిశ్రమలు సాంకేతికత విజ్ఞానంతో ముందుకు నడిపించాలని నెహ్రూ భావించారు. భారీ ఆనకట్టలు, ఉక్కు కర్మాగారాలు, విద్యుత్ ప్రాజెక్టులను ‘ఆధునిక భారత దేవాలయాలు’గా అభివర్ణిస్తూ అభివృద్ధి దిశగా దేశాన్ని నడిపించారు. భిలాయి, రౌర్కెలా, దుర్గాపూర్ వంటి ఉక్కు పరిశ్రమలు ఆయన దూరదృష్టికి నిదర్శనాలుగా నిలిచాయి.
విద్యా రంగంలో కూడా నెహ్రూ కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. భారత యువత ప్రపంచ స్థాయి విజ్ఞానం అందుకోవాలనే లక్ష్యంతో నెహ్రూ హయాంలో నిర్మించిన భాక్రా నంగల్ ప్రాజెక్ట్ దేశ వ్యవసాయ రంగానికి కొత్త ఊపునిచ్చింది. భారీ ఆనకట్టలు, సాగునీటి ప్రాజెక్టులు రైతాంగానికి జీవనాడిగా మారాయి. విద్యుత్ ఉత్పత్తి పెరిగి పరిశ్రమల అభివృద్ధికి దోహదపడింది. నెహ్రూ ఈ ప్రాజెక్టులను ‘ఆధునిక భారత దేవాలయాలు’గా అభివర్ణించారు.
- పారిశ్రామికీకరణకు బలమైన పునాది
దేశ పారిశ్రామికీకరణకు బలమైన పునాది వేయడానికి భిలాయి, దుర్గాపూర్, రౌర్కెలా స్టీల్ ప్లాంట్లు స్థాపించారు. ఇవి భారతదేశాన్ని ఉక్కు ఉత్పత్తిలో బలోపేతం చేసి స్వావలంబన దిశగా నడిపించాయి. అదేవిధంగా భారత హెవీ ఎలక్ట్రికల్స్ (బీహెచ్ఈఎల్) వంటి ప్రభుత్వ రంగ సంస్థలు భారీ పరిశ్రమల అభివృద్ధికి కీలకంగా మారాయి. ఇంధన రంగంలో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కమిషన్ (ఓఎన్జీసీ) స్థాపన దేశ ఆర్థికాభివృద్ధికి కొత్త దారులు తెరిచింది. దేశీయ చమురు వనరుల అన్వేషణలో ఓఎన్జీసీ కీలకపాత్ర పోషించింది.
అలాగే హిందుస్తాన్ ఏరోనాటిక్స్ అభివృద్ధి ద్వారా రక్షణ, వైమానిక రంగాలకు బలమైన మద్దతు లభించింది. విద్యా రంగంలో నెహ్రూ తీసుకున్న నిర్ణయాలు భారత భవిష్యత్తును మలిచాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు)ల స్థాపన ద్వారా ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులను తయారుచేసే మార్గం ఏర్పడింది. అలాగే ఎయిమ్స్ ఢిల్లీ స్థాపనతో వైద్య విద్య, ఆరోగ్య సేవలకు కొత్త ప్రమాణాలు ఏర్పడ్డాయి.
- అణుశక్తి కమిషన్ ఏర్పాటు
శాస్త్ర, సాంకేతిక రంగాలపై కూడా నెహ్రూ ప్రత్యేక దృష్టి పెట్టారు. అణుశక్తి కమిషన్ ఏర్పాటు చేసి అణుశక్తి పరిశోధనకు పునాది వేశారు. భారత అంతరిక్ష పరిశోధన అభివృద్ధికి అవసరమైన సంస్థలకు బీజం వేశారు. సీఎస్ఐఆర్ ల్యాబ్స్ వంటి పరిశోధనా సంస్థలు దేశ శాస్త్రీయ ప్రగతికి మార్గదర్శకంగా నిలిచాయి. వ్యవసాయ రంగ అభివృద్ధికి పరిశోధనా సంస్థలను బలోపేతం చేయడం ద్వారా పంటల ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకున్నారు. ఇదే తరువాత గ్రీన్ రివల్యూషన్‌కు మార్గం సుగమం చేసింది. ఆర్థిక రంగంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) జాతీయీకరణ ద్వారా ప్రజల పొదుపులను దేశ అభివృద్ధికి వినియోగించే విధానం అమలులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ పరిశ్రమల విస్తరణ ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
ఐఐటీలు, ఐఐఎంలు, శాస్త్రీయ పరిశోధనా సంస్థలను స్థాపించడంలో ప్రధాన పాత్ర పోషించారు. శాస్త్రీయ దృక్పథం పెంపొందించాలని ఆయన నిరంతరం పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వేదికపై భారత గౌరవాన్ని పెంచేందుకు నెహ్రూ అనుసరించిన సామరస్య విదేశాంగ విధానం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది. అలీనోద్యమ నేతగా నిలబెట్టింది. శాంతి, సహజీవనం, సామరస్యానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత భారత విదేశాంగానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది.
- ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ నెహ్రూ పాత్ర విశేషం. భిన్నత్వంలో ఏకత్వం భారత్ బలమని విశ్వసించిన ఆయన రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ దేశ సమైక్యతకు కృషి చేశారు. నేటి ఆధునిక భారత నిర్మాణంలో కనిపించే అనేక అభివృద్ధి అడుగుల వెనుక నెహ్రూ దూరదృష్టి, ప్రగతిశీల ఆలోచనలు ఆయన్ని మహా నేతగా నిలబెట్టాయి. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో 9 సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.
నెహ్రూ అత్యధికంగా ఇష్టపడిన నేతల్లో సర్దార్ వల్లబాయ్ పటేల్ ముందువరుసలో ఉంటారు. చరిత్రపై అవగాహన లేని కొన్ని సంస్థలు, వ్యక్తులు నెహ్రూపై తప్పుడు ప్రచారం చేస్తారు. దేశ అభివృద్ధిలో కీలక సంస్థలుగా ఉన్న సంస్థలన్నీ నెహ్రూకాలంలో రూపుదిద్దుకున్నవే.
భారత దేశ విదేశాంగ విధానాన్ని అభివృద్ధి చేసింది నెహ్రూనే. విదేశాంగ విధానంలో ప్రధాన ప్రత్యేకత ‘అలీన విధానం’ అమెరికా నేతృత్వంలోని పాశ్చాత్య కూటమిగానీ, సోవియట్ యూనియన్ నేతృత్వంలోని కమ్యూనిస్టు కూటమికిగానీ పూర్తిగా మద్దతు ఇవ్వకుండా, భారతదేశం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. ఈ విధానం వల్ల భారతదేశం ప్రపంచ రాజకీయాల్లో స్వాభిమానంతో నిలబడగలిగింది.
- ప్రపంచ శాంతి కోసం నెహ్రూ కృషి
ప్రపంచ శాంతి కోసం నెహ్రూ ఎంతో కృషి చేశారు. యుద్ధాలకు వ్యతిరేకంగా, దేశాల మధ్య సంభాషణ, సహకారం ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలనేది ఆయన నమ్మకం. ‘పంచశీల సూత్రాలు’ ద్వారా పరస్పర గౌరవం, జోక్యం లేకపోవడం, శాంతియుత సహజీవనం వంటి విలువలను ప్రపంచానికి పరిచయం చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల స్వాతంత్ర్య ఉద్యమాలకు నెహ్రూ మద్దతు ఇచ్చారు. వలసవాదానికి వ్యతిరేకంగా నిలబడి, అభివృద్ధి చెందుతున్న దేశాల ఐక్యత కోసం పనిచేశారు. దీనివల్ల భారతదేశం మూడో ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టను పెంచడంలో నెహ్రూ కీలకపాత్ర పోషించారు. అణ్వాయుధాల వ్యాప్తికి వ్యతిరేకంగా ప్రపంచ శాంతి కోసం ఆయన నిరంతరం పిలుపునిచ్చారు. నెహ్రూ విదేశాంగ విధానం భారతదేశానికి స్వతంత్ర గుర్తింపు, అంతర్జాతీయ గౌరవం, శాంతి దూత అనే ప్రతిష్టను తీసుకువచ్చింది. దేశంకోసం తమ ఆస్తులన్ని త్యాగం చేసిన నెహ్రూకు నేడు ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళి అర్పిద్దాం.
- దొమ్మాట వెంకటేష్
ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
