టెక్స్ట్ బుక్స్ ధరలు తగ్గినయ్.. ఒక్కో బుక్పై 15 నుంచి 20 శాతం మేర తగ్గింపు.. పదో తరగతి సెట్పై ఎంత తగ్గిందంటే..

టెక్స్ట్ బుక్స్  ధరలు  తగ్గినయ్.. ఒక్కో బుక్పై 15 నుంచి 20 శాతం మేర తగ్గింపు.. పదో తరగతి సెట్పై ఎంత తగ్గిందంటే..
  • పదో తరగతి సెట్ పై రూ.178.. నైన్త్ సెట్​పై రూ.151 వరకూ తగ్గుదల 
  • సేమ్ క్వాలిటీతోనే ఈసారి లామినేటెడ్ పుస్తకాలు 

హైదరాబాద్, వెలుగు: 

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు, పుస్తకాల భారంతో సతమతమవుతున్న పేరెంట్స్ కు సర్కారు ఊరట లభించే న్యూస్ చెప్పింది. వచ్చే కొత్త విద్యాసంవత్సరం (2026-–27)  నుంచి స్కూల్ టెక్స్ట్ బుక్స్ ధరలను భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో పుస్తకంపై సుమారు 15 నుంచి 20 శాతం మేర ధరలను తగ్గించింది. గత విద్యా సంవత్సరం ధరలతో పోలిస్తే, అన్ని తరగతుల పుస్తకాల రేట్లు గణనీయంగా తగ్గాయి. హైస్కూల్ విద్యార్థులకు రూ. వందల్లో పుస్తకాల భారం తగ్గనున్నది. అయితే, ధరలు తగ్గినా, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా, గతం కంటే మెరుగైన  క్వాలిటీతో లామినేటెడ్ పుస్తకాలను ప్రభుత్వం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తోంది. 
రాష్ట్రవ్యాప్తంగా11వేల వరకూ ప్రైవేటు స్కూళ్లు ఉండగా, వాటిలో 38 లక్షల మంది చదువుతున్నారు. అయితే, ప్రైమరీ స్కూల్ లెవెల్ వరకూ ఏ పుస్తకాలు వాడినా.. అధికారులు సీరియస్​గా తీసుకోరు. కానీ ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు మాత్రం తప్పనిసరిగా సర్కారు నిర్ణయించిన సిలబస్ పుస్తకాలు, సర్కారు ప్రింట్ చేసిన పుస్తకాలనే విద్యార్థులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వరుసగా నాల్గో ఏడాది కూడా పుస్తకాల ధరలు తగ్గడం.. పేరెంట్స్ కు కొంత ఊరట కలిగించే అంశమే. 

2023–24లో పదో తరగతి విద్యార్థులకు పుస్తకాల కోసం రూ.1,482 ఖర్చు అయ్యేది. 2025–26లో టెన్త్ సెట్​కు రూ.1,078 ఉన్న రేట్.. 2026–27 నాటికి ఆ ధర రూ.900కు తగ్గింది. ఈ ఏడాది ఒక్క టెన్త్ పుస్తకాల సెట్ ధరపైనే ఏకంగా రూ.178 తగ్గింది. అలాగే తొమ్మిదో తరగతి పుస్తకాల సెట్ ధర రూ.927 నుంచి రూ.776కు (రూ.151 తగ్గింపు), ఎనిమిదో తరగతి సెట్ ధర రూ.825 నుంచి రూ.690కి (రూ.135 తగ్గింపు) ధరలు తగ్గాయి. ప్రైమరీ క్లాసులకు కూడా ఒక్కో సెట్‌‌‌‌పై రూ.35 నుంచి రూ.60 వరకు ధరలు తగ్గించారు.   

  • సబ్జెక్టుల వారీగా చూస్తే.. 

గతంలో పదో తరగతి గణితం పుస్తకం ధర రూ.225 ఉండగా, దానిని రూ.187కు తగ్గించారు. సోషల్ స్టడీస్ పుస్తకం రూ.192 నుంచి రూ.160కి తగ్గింది. తొమ్మిదో తరగతి గణితం రూ.201 నుంచి రూ.167కు, ఎనిమిదో తరగతిలో రూ.205 నుంచి రూ.171కి తగ్గింది. ప్రతి సబ్జెక్టులోనూ కనీసం రూ.10 నుంచి రూ.35 వరకు ధరలు తగ్గాయి. అయితే, ఈపుస్తకాలను మార్కెట్ లో సర్కారు నిర్ణయించిన ధరలకే విక్రయించేలా చూడాలని డీఈఓలకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కువ ధరలకు అమ్మినా.. అనుమతి లేకుండా విక్రయాలు చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

  • పబ్లిషర్ల పోటీతోనే.. 

ముడి సరుకుల ధరలు 20 శాతం పెరిగినప్పటికీ, పబ్లిషర్లు గత ఏడాది కంటే తక్కువ ధరకే పుస్తకాలను ముద్రించేందుకు ముందుకు వచ్చారు. గత ఏడాది ఎల్1 గా నిలిచిన ఆర్క్‌‌బర్డ్ సంస్థ పేజీకి 54 పైసలు కోట్ చేయగా, ఈ ఏడాది నవతెలంగాణ ప్రింటర్స్, డీకే పబ్లికేషన్స్, సూపర్ ప్రింటర్స్ సంస్థలు కేవలం 44.50 పైసలకే కోట్ చేసి ఎల్-1గా నిలిచాయి. అంటే పెరిగిన ముడి సరుకుల ధరలు 20 శాతం, తగ్గించిన కోట్20 శాతం.. వెరసి విద్యార్థులపై పాత ధరల కంటే దాదాపు 40 శాతం తక్కువ భారం పడనుంది. 

తరగతులవారీగా ఇంగ్లిష్​ మీడియం
పుస్తకాల సెట్ ధరలు (రూపాయల్లో)  
క్లాస్​        2025-26         2026-27         తగ్గింపు 
పది        1,078        900        178
తొమ్మిది        927        776        151
ఎనిమిది        825        690        135
ఏడు        654        548        106
ఆరు        572        481        91
ఐదు        372        312        94
నాలుగు        332        278        54
మూడు        324        273        51
రెండు        222        188        34
ఒకటి        247        209        38

టెన్త్ క్లాస్ సబ్జెక్టులవారీగా రేట్లు ఇలా..(రూపాయల్లో)  
సబ్జెక్టు         గతేడాది ధర         ప్రస్తుత ధర  
తెలుగు రీడర్         99        83 
ఇంగ్లిష్ రీడర్        151        126 
హిందీ రీడర్         52        44
గణితం         225        187
జీవశాస్త్రం         143        119 
భౌతిక శాస్త్రం         177        147
సోషల్ స్టడీస్         192        160 
పర్యావరణ విద్య     39        34 
మొత్తం సెట్ ధర     1,078        900