హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ భవనాల ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను బల్దియాకు చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా.. పెండింగ్ పన్నులపై వన్ టైమ్ సెటిల్‌మెంట్‌కు (OTS) అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
గత 15 ఏళ్లుగా నగరంలోని వివిధ ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో.. పన్నుపై విధించే వడ్డీ, పెనాల్టీలను 100 శాతం మినహాయిస్తూ ప్రభుత్వం ఊరటనిచ్చింది. కేవలం అసలు మొత్తాన్ని మాత్రమే మున్సిపల్ కార్పొరేషన్లకు చెల్లించనుంది.
మొత్తం 1,686.39 కోట్ల రూపాయలను జీహెచ్‌ఎంసీ, ఎమ్‌ఎమ్‌సీ , సీహెచ్‌ఎంసీ లకు చెల్లించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. జీహెచ్‌ఎంసీకి రూ. 1,585.41 కోట్లు, ఎమ్‌ఎమ్‌సీకి రూ. 76.11 కోట్లు, సీహెచ్‌ఎంసీకి రూ. 24.87 కోట్లు చెల్లించనున్నారు.
ఈ భారీ బకాయిల మొత్తాన్ని ఒకేసారి కాకుండా... ఒక ఏడాది కాలంలో విడతల వారీగా చెల్లించేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో మున్సిపల్ కార్పొరేషన్లకు భారీగా ఆదాయం సమకూరనుంది. దీనిపై సంబంధిత మున్సిపల్ కమిషనర్లు తదుపరి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
