దేశంలో దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ స్పేస్‌నే అనేక ప్రాంతీయ పార్టీలు ఆక్రమించి స్థిరపడ్డాయి. ద్రవిడపార్టీలు, ఎన్సీపీ, వైసీపీ, టీఎంసీ, ఆమ్ఆద్మీ పార్టీ వరకు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ స్పేస్‌ను కొల్లగొట్టి స్థిరపడిన ప్రాంతీయ పార్టీలే. బిహార్‌లో ఆర్జేడీ, యూపీలో ఎస్పీ వంటి ప్రాంతీయ పార్టీలు కూడా కాంగ్రెస్ పాత్రను ఆక్రమించి బీజేపీకి ప్రత్యర్థి పార్టీలుగా స్థిరపడ్డాయి. మొత్తంమీద దేశంలోని దాదాపు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ స్పేస్‌ను కాజేసి ఏర్పడినవే.
ఇపుడవి బీజేపీ గెలుపుల ధాటికి నిలబడలేకపోతున్నాయి. బిహార్‌లో ఆర్జేడీ గెలవలేకపోయింది, ఢిల్లీలో కేజ్రీవాల్ తిరిగి గెలవలేకపోయాడు, బెంగాల్లో టీఎంసీ నాలుగోసారి గెలుపు కల కల్లగా మారింది. మహారాష్ట్రలోనూ బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఓడించిందనేకన్నా.. శివసేన (యూ), ఎన్సీపీ (ఎస్)లను ఓడించిందంటేనే బాగుంటుంది. అలాగే, ఒరిస్సాలో బీజేడీ ఓటమిపాలైంది. మొత్తం మీద ప్రాంతీయ పార్టీల ఓటములు కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తాయా అనేదే చూడాల్సిన విషయం.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు జాతీయ స్థాయిలో వైరుధ్య పార్టీలు. కానీ ఉత్తరాదిలో యూపీ, బిహార్, పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఓడించి అధికారంలోకి వచ్చింది. తమిళనాడులో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ద్రవిడ కూటములపై ఆధారపడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ గత 12 ఏండ్లుగా ఉనికిని కూడా చాటుకోలేకపోతోంది. కేరళలో కాంగ్రెస్ కమ్యూనిస్టులపై గెలిచింది. పంజాబ్‌ను వదిలేస్తే.. మిగతా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీకి కాంగ్రెస్‌పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా ఉంది.
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు చెప్పుకోదగ్గ మంచి పరిణామమేమిటంటే.. బీజేపీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను ఓడించడమే. బీజేపీ అప్రతిహత గెలుపులు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి తిరిగి పొలిటికల్ స్పేస్ కల్పిస్తున్నాయా? అందుకు కాంగ్రెస్ పార్టీ తన సమర్థతను చాటుకునే ప్రయత్నాలేమైనా చేయగలదా అని ఊహించడం
తప్పుకాకపోవచ్చు.
- రాహుల్‌కు పోటీదారులు తగ్గినట్లేనా?
గతంలో మోదీకి ప్రధాన ప్రత్యర్థిగా రాహుల్ గాంధీ కన్నా కేజ్రీవాల్, మమతా బెనర్జీని భావించేవారు. దేశంలోనే పెద్ద రాష్ట్రం, ఎక్కువ లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అఖిలేశ్ యాదవ్‌ను కూడా మోదీకి ప్రత్యర్థిగా అనుకునేవారు. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ అప్రతిహత గెలుపులు ఆ భావనను తుడిచేస్తున్నాయి. ఓటమి చెందిన ప్రాంతీయ పార్టీలకు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కాదనలేని పరిస్థితి అనివార్యమవుతుందా అంటే ఇప్పటికైతే అవుననే చెప్పాలి. ఢిల్లీలో కేజ్రీవాల్, బిహార్‌లో తేజస్వీ యాదవ్, బెంగాల్లో మమతా బెనర్జీ ఓటములు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ నాయకత్వానికి కలిసొచ్చే అంశాలే అని రాజకీయ పండితుల భావన. మొత్తంమీద ప్రతిపక్షాల తరఫున రాహుల్‌కు పోటీదారులు తగ్గినట్లేనేమో!
- కాంగ్రెస్ పార్టీకి రెండు అవకాశాలు
కాంగ్రెస్ పార్టీకి రెండు అవకాశాలు ఉన్నాయి.
1. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని మిగతా ప్రతిపక్షాలు అంగీకరించడం. 2. ప్రాంతీయ పార్టీలు ఓడిన చోట, కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకోవడం. రెండింటిలో ఏ ఒకటి జరిగినా అది కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశమే కావచ్చు. నిజానికి ఈ రెండు అవకాశాలను పరోక్షంగా బీజేపీ అప్రతిహత గెలుపులే కల్పిస్తున్నాయని చెప్పాలి. అందుకు ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపులను లోలోపలైనా కాంగ్రెస్ స్వాగతిస్తుందేమో?
- ఓడిపోయాక మమతకు ఇండి కూటమి గుర్తొచ్చింది!
15 ఏండ్లు బెంగాల్‌ను పాలించిన మమతా బెనర్జీ మొన్నటిదాకా దేశ రాజకీయాల్లో తనదొక మొనోపలి పాత్రగా భావించేది. అవకాశమొస్తే ప్రధాని అభ్యర్థిగా భావించేది. అందుకే, ఆమె ఏనాడూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కింద జాతీయ స్థాయిలో పనిచేయడానికి ఇష్టపడలేదు. ఇండి కూటమిలో ఆమె ఏనాడూ చేరలేదు. అవసరాన్ని బట్టి ఇండి కూటమిపై అనేక విధాలుగా ఆమె మాట మారుస్తూ వచ్చారు. ఓటమి పాలయ్యాక ఇపుడు ఇండి కూటమిని బలోపేతం చేయాలని ఆమె మాట్లాడుతుండటం చూస్తే, ఓటమి ఆమెను ఎంత అవకాశవాదిగా మార్చిందో గమనించొచ్చు. ఓడితే తప్ప దిగిరాని మమతా బెనర్జీ ప్రస్తుతం తిరిగి తన పార్టీని బెంగాల్లో బతికించుకోవడం కోసం ఆరాటపడుతోంది. ఇండి కూటమిని బలోపేతం చేయాలంటోంది! ఓటమి ఎంత భయంకరంగా ఉంటుందో మమతా బెనర్జీని చూస్తే ఎవరికైనా అర్థమవుతోంది. మునుపటిలాగ రాహుల్ నాయకత్వాన్ని కాదనే పరిస్థితులు ఆమెకు ఇపుడు లేకుండా పోయాయి.
- బలహీనపడిన ఆప్
ఢిల్లీలో అధికారం కోల్పోయాక ఆమ్ఆద్మీ పార్టీ బాగా బలహీనపడింది. కేజ్రీవాల్.. ప్రజల్లో ఉన్న ఒకప్పటి క్రేజ్‌ని బాగా కోల్పోయాడు. పంజాబ్‌లో ఆప్ తిరిగి గెలిచే అవకాశాలు కూడా తక్కువగానే ఉన్నాయని సర్వేలు చెపుతున్నాయి. పంజాబ్‌లోనూ ఆప్ ఓడిపోయి, కాంగ్రెస్ గెలిస్తే కేజ్రీవాల్ పొలిటికల్ సర్వైవల్ కష్టమే.
- తేజస్వీ, అఖిలేశ్లూ విఫల నేతలే!
లాలూ నాయకత్వం తర్వాత అంతే బలంగా ఆర్జేడీని తేజస్వీ యాదవ్ నడిపించలేకపోతున్నారు. బీజేపీ, జేడీయూ కూటమిని ఎదుర్కోవడంలో ఆయన విఫలమవుతూ వస్తున్నారు. యూపీలో బీజేపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాపులారిటీని బ్రేక్ చేయడం ఇప్పట్లో అఖిలేశ్‌కు సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడంలేదు. ఫలితంగా తేజస్వీ అయినా, అఖిలేశ్అయినా కాంగ్రెస్ నాయకత్వాన్ని కాదనే పరిస్థితులు మాత్రం లేవు.
- రాజకీయ సుస్థిరత కోసం
మన పార్లమెంటులో సుమారు 40 పార్టీలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అందులో 30 పార్టీలకు పైగా ప్రాంతీయ పార్టీలే. మనది ఎంత పెద్ద ప్రజాస్వామ్య దేశమైనా.. రాజకీయ అస్థిరత ఒక పెద్ద సమస్యగా ఉంది. సుమారు 30 ఏండ్లు బలహీన సంకీర్ణ ప్రభుత్వాలే దేశాన్ని ఏలాయి. ముఖ్యంగా 1989 నుంచి 2014 వరకు అన్నీ సంకీర్ణ ప్రభుత్వాలే. రాజకీయ అస్థిరత తాండవించింది. సంకీర్ణాలలో బ్లాక్‌మెయిల్స్‌ను, స్కామ్‌లను దేశం భరించింది. 6 సార్లు మధ్యంతర ఎన్నికలు అనివార్యమైనాయి. అందుకే దేశానికి సదా రాజకీయ సుస్థిరత అవసరం. 2014 నుంచి ఇప్పటి వరకు బీజేపీ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తూ వచ్చింది. అదేస్థాయిలో బలమైన ప్రతిపక్షం లేకపోవడమే ఇవాళ దేశానికి పెద్ద సమస్య. లోక్‌సభలో 30కి పైగా ప్రాంతీయ పార్టీల ప్రాతినిధ్యం ఉండటం చూస్తేనే.. దేశంలో ప్రత్యామ్నాయ జాతీయ పార్టీ లేదని మనకు అర్థమవుతుంది!
- ఒకటి బలంగా, మరొకటి బలహీనంగా..
దేశ రాజకీయ సుస్థిరతకు బలమైన రెండు జాతీయ పార్టీలు అవసరం. ఒక జాతీయ పార్టీ బలంగా ఉండ టం, మరొక జాతీయ పార్టీ బలహీనంగా ఉండటం మన రాజకీయ వ్యవస్థ ఆరోగ్యానికి మంచిది కాదు. తిరుగులేని మోదీ నాయకత్వం దేశంలో రాజకీయ సుస్థిరతను సాధించిన మాట నిజం. కాంగ్రెస్ పార్టీ అంతే బలమైన పార్టీగా లేకపోవడానికి దేశంలో పెరిగిపోయిన ప్రాంతీయ పార్టీలే కారణమని ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందుకే బీజేపీ ప్రాంతీయ పార్టీలను ఓడిస్తూ పోతున్న సందర్భంలో.. వాటి స్థానంలో జాతీయపార్టీగా కాంగ్రెస్ ఎంత బలపడితే దేశంలో రాజకీయ సుస్థిరతకు అంత బలం చేకూరుతుంది. అది జరిగేనా అంటే, అదంతా రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై ఆధారపడి ఉన్న అంశం మాత్రమే!
- బలమైన మోదీకి, బలమైన ప్రత్యర్థిని చూపకపోతే..
ఇండి కూటమి నాయకుణ్ణి ఎన్నుకోలేదు. అందుకు కారణం లేకపోలేదు. నాయకుడిని ఎన్నుకోవడమంటే, ఇండి కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా లేదా పార్లమెంటులో ప్రతిపక్ష నేతగా గుర్తించడమే అవుతుంది. అప్పట్లో మమత, అఖిలేశ్, కేజ్రీవాల్ లాంటి వారు తమకే నాయకత్వం లభించాలని కోరుకునే వారు. అలాంటి పరిస్థితులు ఇపుడు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో అధికారానికి దూరమైన మమత, కేజ్రీవాల్, తేజస్వీ, ఉద్ధవ్ థాకరే, శరద్ పవార్ లాంటి వారు ఇపుడు కూటమి నాయకత్వానికి పోటీపడే పరిస్థితులు లేవు. ఇండి కూటమి నేతగా రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించాల్సిన పరిస్థితులు వారికి అనివార్యంగా మారుతున్నాయి. మూడుసార్లు దేశ ప్రధానిగా కొనసాగుతున్న బలమైన మోదీ నాయకత్వానికి ప్రత్యర్థి ఎవరనేది ప్రతిపక్షాలు ప్రజలకు చూపనంత కాలం ఇండి కూటమి సాధించేదేమీ ఉండదు.
- కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
సీనియర్ జర్నలిస్ట్
