పార్లమెంట్‌‌కు రాకుండా అర్ధరాత్రి సెల్ఫీ డ్రామాలు: ప్రధాని మోదీ, అమిత్‌‌ షాపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్‌‌‌‌

పార్లమెంట్‌‌కు రాకుండా అర్ధరాత్రి సెల్ఫీ డ్రామాలు: ప్రధాని మోదీ, అమిత్‌‌ షాపై ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫైర్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు: ప్రధాని మోదీది మార్కెటింగ్ సర్కార్ అని, దేశ ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం కాదని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విమర్శించారు. పేపర్ లీకులు అరికట్టేందుకు తెచ్చిన బిల్లులపై చర్చలో పాల్గొనని ప్రధాని మోదీ, అమిత్ షా.. అర్ధరాత్రి పార్లమెంట్‌‌కు వచ్చి రీల్స్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఈ వీడియోలతో అర్ధరాత్రి వరకు సభను నడుపుతున్నామని ప్రజల్ని మభ్యపెట్టే డ్రామాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గురువారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడారు. లోక్‌‌సభలో చర్చ సందర్బంగా రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కేంద్ర ప్రభుత్వం వణికిపోతుందన్నారు.

‘‘విద్యార్థులపై దాడికి ఆదేశాలిచ్చింది ఎవరు? విద్యార్థినుల దుస్తులు చింపి, ప్రైవేట్ పార్ట్స్‌‌పై దాడి చేయమన్నది ఎవరు?’’ అని అడిగిన రాహుల్ ప్రశ్నలకు మోదీ సర్కార్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దాడులతో ఆగని కేంద్ర ప్రభుత్వం... ఫేషియల్ రికగ్నైజింగ్ కెమెరాలతో ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులను గుర్తించి, వారి ఇంటికెళ్లి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని మండిపడ్డారు. 

ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేతిలోనే ఉందని, ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. అమిత్ షాకు కేంద్ర హోం మంత్రిగా కొనసాగే అర్హత లేదని, వెంటనే ఆయన తన పదవి రాజీనామా చేయాలన్నారు.

మన బిడ్డలపై ఏకే 47 ఎక్కుపెడతారా ?
టెర్రరిస్ట్‌‌లకు మర్యాదలు చేసిన బీజేపీ సర్కార్.. మన దేశ విద్యార్థులు, యువతను మాత్రం టెర్రరిస్ట్‌‌ల కన్నా హీనంగా చూస్తోందని వంశీకృష్ణ మండిపడ్డారు. లాఠీచార్జ్, టియర్ గ్యాస్, పెల్లెట్ గన్స్, ఏకే 47తో సమాధానం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

విద్యార్థులు శాంతియుతంగా జంతర్ మంతర్‌‌‌‌లో చేసిన ధర్నాకు విదేశీ ఫండింగ్ అంటూ బీజేపీ సర్కార్ విష ప్రచారం చేసిందని, కానీ పోలీస్ శాఖనే అలాంటి నిధులు విద్యార్థులకు రాలేదని తేల్చి చెప్పిందన్నారు. అయితే, విద్యార్థులను దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ కేంద్రం వారిని టెర్రరిస్ట్‌‌లుగా చూపే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. తక్షణమే ఇలాంటి తప్పుడు ప్రచారాలను మానకోవాలని హితవు పలికారు. విద్యార్థుల పక్షాన తాము నిలబడతాని, దేశ ప్రజల ముందు సత్యాన్ని ఉంచుతామన్నారు.

పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ ఎంపీల ఆందోళన..
విద్యార్థులపై పోలీసుల చర్య, అయోధ్యలోని రామ మందిరంలో విరాళాల చోరీకి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. గురువారం ఉభయ సభల ప్రారంభానికి ముందు మకరద్వారం ఎదురుగా ఆందోళన చేపట్టాయి.

రామ మందిరంలో విరాళాల దొంగతనాన్ని తెలిపేలా... హుండీలో ఎంపీలు డబ్బులు వేస్తూ నిరసన తెలిపారు. మరోవైపు శాంతియుతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయో గం, ఏకే 47 ఎక్కుపెట్టాలని ఆదేశాలు ఎవరిచ్చారని రాసిన బ్యానర్‌‌‌‌ను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు.

‘అధికార దొంగలు, చందాల దొంగలు, కేంద్ర హోం మంత్రి సభకు రావాలి, విద్యార్థులకు దాడికి ఆదేశాలు ఎవరిచ్చారు’ అని నినాదాలతో హోరెత్తించారు. ఈ ఆందోళ నలో కాంగ్రెస్ తో పాటు పలు విపక్షాల నేతలు హాజరయ్యారు. ఈ నిరసనలో ప్రియాంక గాంధీ, ఎస్పీ ధర్మేంద్ర యాదవ్, టీఎంసీకి చెందిన సాగరిక ఘోష్, జేఎంఎం మహువా తదితరులు పాల్గొన్నారు.

అలాగే తెలంగాణకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్‌‌‌‌ రెడ్డి, కడియం కావ్య, రామ సహాయం, ఇతర ఎంపీలు పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ ఇతర ఎంపీలతో కలిసి హుండీలో డబ్బులు వేస్తూ నిరసన వ్యక్తం చేశారు.