వెట్టిచాకిరీలో మగ్గుతున్న వలస’ కార్మికులు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇటుక బట్టీల్లో వేలాది మంది ఇతర రాష్ట్రాల కూలీలు

వెట్టిచాకిరీలో మగ్గుతున్న వలస’ కార్మికులు.. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఇటుక బట్టీల్లో వేలాది మంది ఇతర రాష్ట్రాల కూలీలు
  • దళారుల చేతిలో మోసపోతూ, కనీస వసతులు లేక నరకయాతన
  • చదువుకు దూరమై బాలకార్మికులుగా మారుతున్న కూలీల పిల్లలు

నల్గొండ, వెలుగు:  ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా వేల సంఖ్యలో వలస కూలీలు ఇటుక బట్టీల యజమానుల వద్ద వెట్టిచాకిరీ చేస్తున్నారు. ఒడిశా, బిహార్, చత్తీస్‌‌ ‌‌ ‌‌ ‌‌ గఢ్ లాంటి రాష్ట్రాల నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చిన వీరిని దళారులు లక్షల రూపాయలకు యజమానులకు విక్రయిస్తున్నారు. ఇలా వలస కూలీలు జిల్లాలో 20 వేల మంది వరకు ఉంటారు. వీరు ఒక్కొక్కరు 1,000 ఇటుకలు చేస్తే కేవలం రూ. 200 కూలీ మాత్రమే ఇస్తూ, అది కూడా సకాలంలో చెల్లించకుండా యజమానులు వేధిస్తున్నారు. కార్మిక చట్టాల నిబంధనలు ఇక్కడ ఎక్కడా అమలు కావడం లేదు. నివాసం, తిండి, కనీసం తాగడానికి మంచినీరు కూడా అందించకుండా పశువుల పాకల లాంటి గదుల్లో వందలాది మందిని ఉంచుతూ వారి శ్రమను దోచుకుంటున్నారు.

రికార్డులు లేవు.. 

జిల్లాలో ఉన్న ఇటుక బట్టీల సంఖ్యపై గానీ, అక్కడ పనిచేస్తున్న వలస కూలీల వివరాలపై గానీ అధికారుల వద్ద సరైన రికార్డులు లేవు. ఏటా అక్టోబర్, నవంబర్ నెలల్లో దళారుల ద్వారా వచ్చే వేలాది మంది కూలీల గురించి కార్మిక శాఖ కనీసం పట్టించుకోవడం లేదు. అనుమతులు లేని బట్టీలు యథేచ్ఛగా నడుస్తున్నా, నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యజమానులు  అధికారులకు డబ్బులిచ్చి మేనేజ్​ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

అంధకారమవుతున్న చిన్నారుల భవిష్యత్

ఈ బట్టీల వద్ద పెరుగుతున్న చిన్నారుల భవిష్యత్​ అంధకారమవుతోంది. పదేండ్ల కింద వరకు అమల్లో ఉన్న ‘వర్క్ సైట్’ పాఠశాలలను ప్రభుత్వం ఎత్తివేయడంతో, బడికి వెళ్లాల్సిన పిల్లలు మట్టి పనుల్లోకి దిగుతున్నారు. తల్లిదండ్రులకు సాయం చేస్తూ చిన్న వయసులోనే బాలకార్మికులుగా మారుతున్నారు. దుమ్ము, ధూళి, వేడి బట్టీల మధ్య నివసించడం వల్ల ఈ పిల్లలు, కార్మికులు తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక, అత్యవసర సమయాల్లో బట్టీల వద్ద ఉండే సూపర్​వైజర్లే వైద్యులుగా మారి చికిత్స అందిస్తుండటం ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది. ప్రభుత్వం స్పందించి వలస కూలీల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, పిల్లల కోసం బడులను పునరుద్ధరించాలని, నిబంధనలు ఉల్లంఘించే బట్టీ యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

వలస కూలీల రక్షణ కోసం చట్టాలు ఉన్నా.. 

వలస కూలీల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టాలను రూపొందించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు. జిల్లాలోని దేవరకొండ, చింతపల్లి, కొండమల్లేపల్లి లాంటి ప్రాంతాల్లోనే 50కిపైగా ఇటుక బట్టీలు ఉంటే, వాటిలో 1,500 మందికిపైగా పనిచేస్తున్నారు. వీరి పరిస్థితి దారుణంగా ఉంది. అప్పుల సాకుతో కూలీలను బంధించి పనిచేయించడం, వేతనాలు అడిగితే దాడులు చేయడం నిత్యకృత్యంగా మారింది. 


‘నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న వలస కూలీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఇటీవల ఒడిశాకు చెందిన ఒక కూలీ తండ్రి స్వరాష్ట్రంలో మరణించగా, అంత్యక్రియలకు వెళ్లేందుకు యజమానిని డబ్బులు అడిగితే ఆయన నిరాకరించాడు. తోటి కూలీలు యజమానిని బతిమిలాడడంతో కేవలం ఒక్కొక్కరికి రూ. 400 చొప్పున్న రూ. 1,600 మాత్రమే ఇవ్వగా, ఆ అరకొర డబ్బుతో ప్రయాణం చేయలేక సదరు కూలీ కుంటుంబం ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఫలితంగా కన్నతండ్రి చివరి చూపునకు కూడా నోచుకోలేకపోయాడు. ఈ అమానవీయ ఘటనతో మనస్తాపం చెందిన సుమారు 100 మంది కూలీలు ఇక్కడ పనిచేయలేమని, వెళ్లిపోతామంటూ 15 కిలోమీటర్ల దూరంలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌‌ ‌‌ ‌‌ ‌‌ కు నడుచుకుంటూ పోతుండగా, ఒక స్థానిక నాయకుడు వారిని గుర్తించి తహసీల్దార్ వద్దకు తీసుకెళ్లారు. చివరికి అధికారుల జోక్యంతో యజమాని దిగివచ్చి ప్రయాణ ఖర్చులు చెల్లించడంతో వారు స్వస్థలాలకు బయలుదేరారు. ఇది ఉమ్మడి  జిల్లాలోని వలస కూలీల దుస్థితి..’