కశ్మీర్‌‌లో పోలీసులపై టెర్రిరిస్టుల అటాక్‌: అమరుడైన ఇన్‌స్పెక్టర్

కశ్మీర్‌‌లో పోలీసులపై టెర్రిరిస్టుల అటాక్‌: అమరుడైన ఇన్‌స్పెక్టర్

జమ్ము కశ్మీర్ రాజధాని శ్రీనగర్‌‌లో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై గుర్తు తెలియని టెర్రరిస్టులు దాడికి పాల్పడ్డారు. ఆదివారం మధ్యాహ్నం గల్లీల్లో తిరుగుతూ చెకింగ్ చేస్తున్న పోలీసులపై ఉన్నట్టుండి కొంత మంది ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో పోలీస్ ఇన్‌స్పెక్టర్ అర్షిద్‌ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. 

శ్రీనగర్‌‌లోని ఖాన్యార్ ఏరియా పోలీస్‌ స్టేషన్‌లో ప్రొబెషనరీ సబ్‌ఇన్‌స్పెక్టర్‌‌గా ఉన్న అర్షిద్‌ అహ్మద్ తన టీమ్‌తో కలిసి నాకా బందీ నిర్వహించారు. ఆ ఏరియాలో అణువణువూ గాలిస్తుండగా.. మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో గుర్తు తెలియని టెర్రరిస్టులు కొంత మంది వెనుక నుంచి తుపాకీలతో కాల్పులు జరిపారు. మిగిలిన పోలీసులు కౌంటర్ అటాక్ చేసే లోపే ఆ ఉగ్రవాదులు పారిపోయారు. వీపు భాగంలో అనేక బుల్లెట్లు దిగడంతో అహ్మద్ నేలకొరిగారు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు దక్కలేదు. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆయన అమరుడయ్యారు. ఈ ఘటనను ఆ ప్రదేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో పరిశీలించిన పోలీసులు దాడికి పాల్పడిన టెర్రరిస్టులను పట్టుకునేందుకు గాలింపు చేపడుతున్నారు. వాళ్లు ఆ ఏరియాను దాటి వెళ్లిపోయే చాన్స్ లేదని, ఆ ఏరియా మొత్తాన్ని కార్డన్‌ సెర్చ్ ఆపరేషన్‌ చేపడుతున్నామని కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

అహ్మద్ మృతి పట్ల జమ్ము కశ్మీర్ డీజీపీ దిల్బాగ్‌ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. ధైర్యవంతుడైన యువ ఆఫీసర్‌‌ను కోల్పోయామని, దీనికి కారణమైన వారు ముల్యం చెల్లించుకుంటారని ఆయన చెప్పారు. అహ్మద్ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. అహ్మద్ పార్థివ దేహానికి కశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ ఆఫీసర్లు నివాళి అర్పించారు.