టీవీని మామూలుగా చూడడం కంటే స్మార్ట్‌గా చూస్తే అదిరిపోతుంది. స్మార్ట్‌గా చూడడమంటే.. ఒక స్మార్ట్ సోఫాలో నడుం వాల్చి, క్వాలిటీ సౌండ్ వింటూ..హాల్‌లో మంచి కలర్ లైటింగ్ మధ్యన ఉన్న టీవీని ఎంజాయ్ చేస్తూ చూడాలి. అలా చూస్తే ఆ ఫీలింగే వేరు. ఇవన్నీ ఉంటే హాల్ కూడా మినీ థియేటర్ అయిపోతుంది.
స్మార్ట్ బ్యాక్ లైట్
థియేటర్‌లో సినిమా చూసేటప్పుడు లైట్స్ ఆపేస్తారు. అలా చీకట్లో స్క్రీన్ చూస్తే ఆ ఫీలింగ్ వేరు. ఇంట్లో టీవీని అలా చూడలేం. కాబట్టి ఇలాంటి స్మార్ట్ కలర్ లైటింగ్ సిస్టమ్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. టీవీ ఉండే హాల్‌లో పెట్టుకోవడానికే ఇలాంటి గాడ్జెట్స్‌ని స్పెషల్‌గా డిజైన్ చేశారు. ‘‘ఫిలిప్స్ బ్లాక్ హ్యూ వైట్ అండ్ కలర్ ఆంబియన్స్ ప్లే లైట్ బార్’’తో మామూలు హాల్‌కి సినిమా హాల్ లుక్ వస్తుంది. హ్యూ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుని వీటిని ఆపరేట్ చేయొచ్చు. ఈ యాప్ ఆండ్రాయిడ్‌తోపాటు ఐవోఎస్‌కి కూడా సపోర్ట్ చేస్తుంది. యాప్‌లో లైట్ కలర్స్, టైమర్ లాంటివాటిని సెట్ చేసుకోవచ్చు. ఈ బార్ నుంచి 530 ల్యూమెన్‌ల లైట్ అవుట్‌పుట్ వస్తుంది. 16 మిలియన్ల కలర్ టెంపరేచర్ అందుబాటులో ఉంది. వీటి లైఫ్ టైం 25,000 గంటల కంటే ఎక్కువే. అంటే వీటిని చాలా సంవత్సరాల పాటు వాడుకోవచ్చు. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్, సిరితో కూడా వీటిని ఆపరేట్ చేయొచ్చు. ఐ కంఫర్ట్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ ఫీచర్ ఆన్ చేసుకుంటే.. కంటిపై ఒత్తిడి పడదు. ధర: 20,000 రూపాయలు
స్మార్ట్ రిమోట్ కంట్రోల్
ఇదివరకైతే టీవీని మాత్రమే రిమోట్‌తో కంట్రోల్ చేసేవాళ్లం. ఇప్పుడు చాలా గాడ్జెట్స్ రిమోట్‌తోనే వస్తున్నాయి. దాంతో టీవీకి ఒక రిమోట్, సెట్ టాప్‌బాక్స్‌కి మరో రిమోట్, సౌండ్ సిస్టమ్ కోసం ఒక రిమోట్.. ఇలా టీపాయ్ నిండా రిమోట్‌లే ఉంటున్నాయి. అందుకే అన్నింటినీ కంట్రోల్ చేయగలిగే ఒకే రిమోట్ కొంటే సరిపోతుంది. దాదాపు అన్ని రకాల ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ని కంట్రోల్ చేసే యూనివర్సల్ రిమోట్‌లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. వాటితో టీవి, ఏసీ, ఫ్యాన్, స్పీకర్లు, లైట్లు.. ఇలా దేనినైనా కంట్రోల్ చేయొచ్చు. పైగా కొన్ని స్మార్ట్ రిమోట్‌లను మొబైల్‌తో కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. అంటే ఫోన్ నుంచి ఇంట్లో ఉన్న ఏ గాడ్జెట్‌ని అయినా ఆపరేట్ చేయొచ్చు. ఫీచర్స్‌ని బట్టి ధరల్లో తేడాలు ఉంటాయి. ధర: 799 రూపాయల నుంచి మొదలు
సోనీ హోమ్ థియేటర్
సినిమాను ఎంజాయ్ చేయాలంటే.. మంచి స్క్రీన్ ఉంటే సరిపోదు. క్వాలిటీ సౌండ్ కూడా రావాలి. అలాంటి సౌండ్ కావాలంటే.. మంచి హోమ్ థియేటర్ పెట్టించుకుంటే సరిపోతుంది. సోనీ హెచ్‌టీ ఎస్20ఆర్ ఎంట్రీ లెవల్‌లో బెస్ట్ సౌండ్ సిస్టమ్. ఇది 5.1 ఛానెల్‌తో వస్తుంది. 400 వాట్స్ పవర్ అవుట్‌పుట్, 160mm సబ్ వూఫర్ డ్రైవర్ యూనిట్ ఉంటుంది. దీని బరువు సుమారు 13 కిలోలు. వైర్‌లెస్ బ్లూటూత్, హెచ్‌డీఎంఐ, ఆప్టికల్, యూఎస్‌బీ ఇన్‌పుట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ సిస్టమ్‌తో ముఖ్యంగా మంచి సరౌండ్ సౌండ్ ఎక్స్‌పీరియెన్స్ పొందొచ్చు. డీప్ బేస్ ఎక్స్‌టెన్షన్ సబ్ వూఫర్ మంచి బేస్‌ని ఇస్తుంది. ధర: 17,990 రూపాయలు
స్మార్ట్ సోఫా
ఈ స్మార్ట్ ప్రపంచంలో ఎన్నో వస్తువులు స్మార్ట్‌గా మారుతున్నాయి. ఈ విప్లవంలో భాగంగానే కొన్నాళ్ల క్రితం స్మార్ట్ సోఫాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన హైటెక్ సోఫాల్లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఈ సోఫాల్లో వైర్‌లెస్ ఛార్జర్లు, ఎల్‌ఈడీ లైటింగ్, టెంపరేచర్ కంట్రోలింగ్ కప్ హోల్డర్లు ఉంటాయి. హాయిగా టీవీ చూస్తూ కూల్‌డ్రింక్ తాగుతుంటే.. రెండు సిప్‌లు తాగగానే కూలింగ్ పోతుంది. అందుకే ఇలాంటి సోఫాల్లో కూలింగ్ టెక్నాలజీ ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నారు. వీటికి యూఎస్‌బీ పోర్ట్‌లు కూడా ఉంటాయి. వీటిని స్మార్ట్ ఫోన్‌తో కంట్రోల్ చేయొచ్చు. ఫోన్‌తోనే కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫీచర్లను బట్టి ధరలు ఉన్నాయి. ధర: 80,000 రూపాయల నుంచి మొదలు
