మీది పేపర్ లీకుల పాలన.. మాది కొలువుల జాతర : మంత్రి అడ్లూరి లక్ష్మణ్

మీది పేపర్ లీకుల పాలన.. మాది కొలువుల జాతర : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
  • కేటీఆర్ సభలో ఉన్నది నిరుద్యోగులు కాదు..అంతా పెయిడ్ ఆర్టిస్టులే: మంత్రి అడ్లూరి లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన యువ సంగ్రామ సభ ఒక డ్రామా అని, ఇందులో నిరుద్యోగ యువకులు లేరని, పెయిడ్​ ఆర్టిస్ట్​లు, బీఆర్ఎస్​నేతలు, కార్యకర్తలు మాత్రమే ఉన్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్​ విమర్శించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో జరిగిన ప్రెస్​మీట్​లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్‌‌‌‌లు బీర్ల అయిలయ్య, అద్దంకి దయాకర్‌‌‌‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేటీఆర్.. మీది పేపర్ లీకుల పాలన అయితే.. మాది కొలువుల జాతర అని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల చేతిలో కేవలం హాల్‌‌‌‌టికెట్లు మాత్రమే ఉండేవని, తమ ప్రజా ప్రభుత్వంలో అపాయింట్‌‌‌‌మెంట్ లెటర్లు ఉన్నాయన్నారు. బీర్ల అయిలయ్య మాట్లాడుతూ డ్రామా రావు కొత్త డ్రామాలు ఆడుతున్నారని  కేటీఆర్‌‌‌‌కు దమ్ముంటే సరూర్‌‌‌‌నగర్‌‌‌‌లో కాదు.. ఉస్మానియా యూనివర్సిటీ లో సభ పెట్టాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి కుటుంబాన్ని బీఆర్ఎస్ విస్మరిస్తే, మా సీఎం రేవంత్ రెడ్డి శ్రీకాంతాచారి తల్లికి గౌరవప్రదమైన పదవి ఇచ్చారని  గుర్తు చేశారు.

విప్ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ హిట్లర్ ఎవరో, హితుడు ఎవరో ప్రజలకు తెలుసునని,  బీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడానికి కేటీఆర్ ఒక్కడు చాలని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 80,960 ఉద్యోగాలను భర్తీ చేశామని, దీనిపై కేటీఆర్‌‌‌‌తో చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.