మౌలిక వసతులకు పెద్దపీట వేయాలి : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మౌలిక వసతులకు పెద్దపీట వేయాలి : సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
  •     ట్రైబల్ ఎమ్మెల్యేలతో  మంత్రి అడ్లూరి మీటింగ్

హైదరాబాద్, వెలుగు: గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేయాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. బుధవారం సెక్రటేరియట్​లో ట్రైబల్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, వివిధ శాఖల అధికారులు, ఐటీడీఏ పీవోలతో మంత్రి రివ్యూ చేపట్టారు. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, విద్యుత్, తాగునీటి సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. నిధులు ఉన్నా పనులు జరగకపోతే  సహించబోమని, అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

అటవీ భూములు, పోడు సాగు, ఫారెస్ట్ రైట్స్ కింద హక్కుల పత్రాల సమస్యలను అధికారులు టాప్ ప్రయారిటీగా తీసుకోవాలన్నారు. అటవీ, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పని చేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. హైకోర్టు అడ్వకేట్ జనరల్‌‌‌‌తో సంప్రదించి ఎస్టీ సర్టిఫికెట్ వ్యవహారంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.  గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని మంత్రి నిర్ణయించారు. పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.