- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, పాలమూరు జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ
- కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి
- మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 10 ప్రత్యేక థీమ్స్‌తో కార్యక్రమ నిర్వహణ
మహబూబ్ నగర్ కలెక్టరేట్/నెట్వర్క్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ మూడో విడత కార్యక్రమాన్ని ఉమ్మడి పాలమూరు జిల్లాలో సక్సెస్ చేసేందుకు అధికారులు పక్కా కార్యాచరణతో సిద్ధం కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని అధికారులు ఛాలెంజ్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ఇది ప్రజలకు చేరువగా ఉండే ‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అని పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత రెండున్నరేండ్లలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలను గ్రామసభల్లో బహిర్గతం చేయాలని, పెండింగ్ పనులపై స్పష్టమైన నివేదికలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది మహిళలకు హెల్త్ ప్రొఫైల్ తయారు చేస్తున్నామని, ఈ ప్రగతి ప్రణాళికలో మహిళలను పెద్ద సంఖ్యలో భాగస్వామ్యం చేయాలని పిలుపునిచ్చారు. 99 రోజుల కార్యక్రమంలో పొందుపరిచిన 10 థీమ్స్ ను సమర్థవంతంగా అమలు చేయాలని, తాను ప్రతి 15 రోజులకోసారి ఒక థీమ్‌పై సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు.
అటవీ పోడు భూముల సమస్యల పరిష్కారానికి రెవెన్యూ, అటవీ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల్లో జరిగే కార్యక్రమాల్లో తాను స్వయంగా పాల్గొంటానని, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా కొన్ని సభలకు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి మాట్లాడుతూ మార్చి 6 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మొదటి నుంచి చివరి వరకు అదే ఉత్సాహంతో కొనసాగాలని, ప్రజలు ఇచ్చే అన్ని దరఖాస్తులను స్వీకరించాలని అధికారులను కోరారు.
అనంతరం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, మిషన్ భగీరథ లోపాలను సవరించి వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. టీచర్ల కొరతను తీర్చడం, అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచడం లాంటి అంశాలపై దృష్టి సారించాలని, అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరారు.
ఇతర ప్రాంతాల్లో..
నాగర్‌కర్నూల్ కలెక్టర్ బాదావత్ సంతోష్ స్వయంగా చీపురు పట్టి కలెక్టరేట్ ప్రాంగణాన్ని శుభ్రం చేసి సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. మార్చి 15 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించాలని, పెండింగ్ ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనురాగ్ జయంతి బొమ్మలరామారం మండలంలోని నాగినేనిపల్లి, మైసిరెడ్డిపల్లి గ్రామాల్లో పర్యటించి, గ్రామాల్లో మురుగు కాలువల క్లీనింగ్, మిషన్ భగీరథ ట్యాంకుల క్లోరినేషన్ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు.
సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మున్సిపాలిటీలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ శానిటేషన్, రోడ్డు భద్రత, మహిళా భద్రత, డ్రగ్స్ నిర్మూలన లాంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడలో డీఎంహెచ్‌వో కృష్ణ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన స్పెషాలిటీ వైద్య శిబిరంలో 432 మందికి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గణేశ్‌నగర్, ఎదిర గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేశారు.
ప్రతి డివిజన్ అభివృద్ధికి రూ. 50 లక్షలు కేటాయిస్తామని, నగరాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య యాదగిరిగుట్టలో పారిశుధ్య కార్మికులతో కలిసి వీధులు ఊడ్చి, సొంత ఇంటిలాగే ఊరిని కూడా శుభ్రంగా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ, ప్రజా సమస్యలను త్వరగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కోస్గి మున్సిపల్ చైర్మన్ నాగులపల్లి నరేందర్ నేతృత్వంలో సిబ్బంది 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' ప్రతిజ్ఞ చేసి వార్డుల్లో స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు.
