కేసీఆర్ మీకు ఓ అన్నలాగా ఈ కానుకలు పంపించారు

కేసీఆర్ మీకు ఓ అన్నలాగా ఈ కానుకలు పంపించారు

రంజాన్ సందర్భంగా ముస్లింలకు సీఎం కేసీఆర్ ఓ అన్నలాగా కానుకలు పంపించారని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. అందువల్ల సీఎం కేసీఆర్‌కు ముస్లింలందరూ దీవెనలందించాలని ఆయన కోరారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ముస్లిం సోదర సోదరీమణులకు మంత్రి గంగుల రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వర్గాల సంక్షేమమే తెరాస ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. ముస్లింలు రంజాన్ పండుగ ప్రార్థనలను ప్రభుత్వ సూచనల ప్రకారం చేసుకోవాలని సూచించారు. ప్రార్థనల్లో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి.. సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు.

‘ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు.  అల్లా దయాతో ఏటా రంజాన్ మాసం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచం మొత్తం కరోనాతో రెండేళ్లుగా అల్లాడుతుండటం వల్ల సంబరాలు అనుకున్నట్లుగా జరుపుకోలేకపోతున్నాం. వచ్చే ఏడాదైనా కరోనా దూరమై.. ఎప్పటిలాగా వేడుకలు జరుపుకోవాలని ఆశిద్దాం. ముస్లింలను 70 ఏళ్లుగా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయి తప్ప ఎలాంటి సహాయం చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను, కులాలను సమానంగా గౌరవిస్తోంది. హిందువులకు దసరాకు, క్రిస్టియన్లకు క్రిస్మస్‌కు, ముస్లింలకు రంజాన్‌కు ప్రభుత్వం తరపున కేసీఆర్ కానుకలు అందిస్తున్నారు. కేసీఆర్ మీకు ఓ అన్నలాగా ఈ కానుకలు పంపించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మతకల్లోలాలు తగ్గాయి. శాంతిభద్రతలు బాగున్నప్పుడే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి. అందుకే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మైనార్టీ, బీసీ, ఎస్సీ గురుకులాలు పెట్టి అన్ని వర్గాల ప్రజల పిల్లలకు ఉచిత విద్య అందిస్తున్నాం. నిరుపేద ఆడపిల్లల పెళ్లికి కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ కింద లక్ష రూపాయలు సహాయం చేస్తున్నాం. ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎంకు మీరంతా రంజాన్ సందర్భంగా దీవెనలు అందించాలి.  హిందూ ముస్లింల మధ్య గొడవలు పెట్టే కొన్ని రాజకీయ శక్తులను పట్టించుకోవద్దు’ అని మంత్రి గంగుల అన్నారు.