రైస్‌ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలి

రైస్‌ మిల్లర్లు ధాన్యం కొనుగోలుకు సహకరించాలి

హైద‌రాబాద్‌: వానాకాలం వరిధాన్యం కొనుగోలు సజావుగా సాగేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ రైస్ మిల్లర్లను కోరారు. ఈసారి భారీగా వరి దిగుబడి పెరిగిన నేపధ్యంలో ధాన్యం కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని ఆయన అన్నారు. గురువారం తన అధికార‌క నివాసంలో పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ నాయకులు, జిల్లాస్థాయి రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నేతలతో మంత్రి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 6వేల కొనుగోలు కేంద్రాల ద్వారా వానాకాలం వరి ధాన్యం సేకరించడానికి అంతా సిద్ధం చేసినట్టు చెప్పారు .ప్రతి గ్రామంలో ఒక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. వానాకాలం 2020-21 వరిసాగు విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలు (సన్నధాన్యం 34.45 లక్షల ఎకరాలు, దొడ్డు ధాన్యం 13.33 లక్షల ఎకరాలు) సాగు జరిగిందన్నారు. ఈ సీజన్‌లో సన్న రకాలు98.61 లక్షల మెట్రిక్‌టన్నులు, దొడ్డు రకాలు 33.33 లక్షల మెట్రిక్‌టన్నులు కలిపి మొత్తం 131.94 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం ఉత్పత్తి అంచనా వేసినట్టు తెలిపారు.

ఇందులో నికరంగా కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్‌టన్నులు వస్తుందని, దీనిని పౌరసరఫరాల సంస్ధ ద్వారా కొనుగలుచేస్తామని తెలిపారు. ఇందుకు కొత్తవి 10.13 కోట్లు, పాతవి 8.63 కోట్లు మొత్తం కలిపి 18.76 కోట్లు మేరకు అవసరమైన గోనె సంచులు సమకూర్చుకోవాలని నిర్ణయించామన్నారు. గోనె సంచుల సమస్య ఉత్పన్నం కాకుండా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూ సరిపడ కొత్తగోనె సంచులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

కొనుగోలు ప్ర‌క్రియ ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించ‌డానికి సాఫ్ట్‌వేర్ ను సిద్ధం చేసుకోవాల‌ని మంత్రి అధికారుల‌కు సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతుల‌కు త్వ‌ర‌గా డ‌బ్బులు అందేట‌ట్లు చూడాల‌ని ఆదేశించారు.