నిరుపేదల‌కు తమ ఆస్తులపై హక్కు కల్పించేందుకే ఈ స‌ర్వే

నిరుపేదల‌కు తమ ఆస్తులపై హక్కు కల్పించేందుకే ఈ స‌ర్వే

పేదోళ్లకు అండగా ఉండేందుకే ఆస్తుల ఆన్‌లైన్ సర్వే చేస్తున్నామ‌ని, సర్వేకు ప్రజలు సహకరించాలని అన్నారు మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్. గురువారం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎల్.ఆర్.ఎస్. మ‌రియు కొత్త రెవెన్యూ చట్టంపై అధికారులతో మంత్రి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. నిరుపేదకు తమ ఆస్తులపై హక్కు కల్పించాలన్నదే ఈ చట్టం లక్ష్యమ‌ని చెప్పారు. సర్వేలో ప్రజలు పాల్గొనెలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని అన్నారు. వ్య‌వసాయేతర ఆస్తులపై ఎన్నో ఏండ్లుగా నానుతున్న సమస్యలను పరిష్కరించి పేద, మధ్య తరగతి వర్గాలకు ఆస్తి హక్కులు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమ‌ని చెప్పారు.

ప్రజల నుంచి అదనంగా డబ్బు వసూలు చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని, ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తిహక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా కృషిచేస్తున్నామ‌ని చెప్పారు. భవిష్యత్తులో ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చేస్తామ‌ని అన్నారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు జ‌రుగుతుంద‌ని అన్నారు. ప్రజలు దళారులను నమ్మవద్దని, ఎవ్వరికీ ఒక్కపైసా ఇవ్వాల్సిన అవసరం లేదన్న మంత్రి గంగుల.. ఆస్తుల నమోదు ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందని చెప్పారు.