హైదరాబాద్ తర్వాత ఐటీకి కేరాఫ్ కరీంనగర్

హైదరాబాద్ తర్వాత ఐటీకి కేరాఫ్ కరీంనగర్

రెండో అతి పెద్ద ఐటీ టవర్ నిర్మాణం

డిసెంబర్ చివరి కల్లా పనులు పూర్తి

3600 మంది వరకు ఉపాధి: మంత్రి గంగుల

ఇప్పటికే 11 కంపెనీలతో ఒప్పందం

హైదరాబాద్ తర్వాత ఐటీకి కరీంనగర్ కేరాఫ్ అడ్రస్ కావాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాష్ట్రంలో మరో ఐటీ సిటీగా కరీంనగర్ ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. కరీంనగర్లో రూ.35 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనుల పురోగతిపై మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం మీడియాకు వివరించారు. హైదరాబాద్ తర్వాత రెండో అతి పెద్ద ఐటీ టవర్ కరీంనగర్ లో నిర్మాణం అవుతోందని తెలిపారు. 3 ఎకరాల్లో 7 ఫ్లోర్లలో 62 వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐటీ టవర్ నిర్మాణం పూర్తి కావచ్చిందని చెప్పారు.మొత్తం 3000 నుంచి 3600 మందికి ఇక్కడ ఉపాధి రాబోతోందన్నారు. ఈ ఉద్యోగాల్లో ఎక్కువ శాతం కరీంనగర్ వాళ్లకే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నామని చెప్పారు మంత్రి గంగుల.

దసరా నాటికే పూర్తి కావాల్సింది..

ఐటీ కంపెనీలకు మంచి ఇంన్సెంటివ్స్ ఇచ్చి, ఇక్కడకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ప్రభుత్వం ఉందని మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఇప్పటికే 11 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. దసరా నాటికే ఈ  ఐటీ టవర్ పూర్తి కావాల్సిందని, కానీ వర్షాల వల్ల కొంత ఆలస్యమైందని చెప్పారు. మరో రెండు వారాల్లోనే రెండు ఫ్లోరు సిద్ధం అవుతాయని, డిసెంబర్ కల్లా పూర్తి స్థాయిలో కరీంనగర్ ఐటీ టవర్ రెడీ అవుతుందని తెలిపారు. కరీంనగర్ ను రెండో ఐటీ రాజధానిగా మారుస్తామని, అవసరాన్ని బట్టి ఇక్కడ మరో టవర్ నిర్మిస్తామని అన్నారు.2020 నాటికి సరికొత్త కరీంనగర్ ను ఆవిష్కరిస్తామని మంత్రి చెప్పారు.

మునిసిపల్ ఎన్నికల్లోనూ విజయం ఖాయం

స్మార్ట్ సిటీల పనులు వేగవంతంగా చేపడుతున్నామని, ఈ నెల 31న దీనిపై రివ్యూ చేస్తామని చెప్పారు మంత్రి గంగుల. ప్రస్తుత పనులన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.350 కోట్లతోనే జరుగుతున్నాయని, ఇకపై స్మార్ట్ సిటీలకు కేంద్రం ఇచ్చిన నిధులు తోడవుతాయని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లోనూ విజయం టీఆర్ఎస్ పార్టీదేనని, హుజుర్ నగర్ ఫలితాలే రిపీట్ అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.