అభివృద్ధి కావాలా? ఈటల కావాలా?

అభివృద్ధి కావాలా? ఈటల కావాలా?
  • కుల సంఘాల మీటింగ్ లో మంత్రి గంగుల

హుజూరాబాద్, వెలుగు: ‘ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ గెలిస్తేనే అభివృద్ధి ముందుకు సాగుతుంది. లేకపోతే  అభివృద్ది కుంటుపడే అవకాశముంది. హుజూరాబాద్ నుంచి మరోసారి ఈటల గెలిస్తే బీజేపీలో ఒక సంఖ్య పెరుగుతుందే తప్ప నియోజకవర్గానికి ఒరిగేదేం లేదు. అభివృద్ది కావాలా.. ఈటల కావాలో హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకోవాలి’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్​జిల్లా హుజూరాబాద్ సిటీ సెంటర్లో పలు కులసంఘాల నాయకులతో పాటు  కబడ్డీ, హాకీ అసోసియేషన్, గోల్డ్ స్మిత్, ఎలక్ట్రికల్, ప్లంబర్ సంఘాలకు చెందిన ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. గతంలో కుల సంఘాల భవనాల కోసం భూములు, నిధులు కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని వారంతా చెప్పారు. స్పందించిన గంగుల కమలాకర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భూములు, నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓడినా, గెలిచినా ప్రభుత్వాలు మారవని.. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి మారుతుందన్నారు. సీఎం కేసీఆర్ సూచించిన టీఆర్ఎస్​అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని కోరారు. 

అభివృద్ధిని చూపిస్తం
హుజూరాబాద్ లో అభివృద్ధి అంటే ఏమిటో ఆగస్టు 15 వరకు చేసి చూపెడతామని మంత్రి అన్నారు. శుక్రవారం సాయంత్రం సింగాపూర్ లో  నిర్వహించిన విలేకరుల సమావేశంలో గంగుల మాట్లాడారు. రెండుసార్లు మంత్రి పదవిని పొందిన ఈటల   నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల్లో రూ.35 కోట్ల అభివృద్ధి పనులకు ఈ నెల 13న టెండర్ల ప్రక్రియ ముగుస్తుందని, మరో వారం రోజుల్లో అన్ని వార్డుల్లో పనులు ప్రారంభమవుతాయని వివరించారు.  మున్సిపాలిటీలోని కరీంనగర్, వరంగల్ రోడ్డులో రూ.20 కోట్లతో సైడ్ డ్రైనేజీ, ఫుట్ పాత్ పనులు, సైదాపూర్ కు బీటీ రోడ్డు పనులు మంజూరు కానున్నాయన్నారు. స్థానిక ఐబీ గెస్ట్ హౌస్ స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు.   అనంతరం  సిర్సపల్లి  రోడ్డులో నిర్మిస్తున్న  డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కలెక్టర్ శశాంకతో కలసి పరిశీలించారు. రెండు ప్రాంతాల్లో సుమారు 500 ఇండ్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. పనులను  త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.