నేను కారు ఓటేసిన..పోలింగ్ బూత్ బయట మంత్రి ‘గంగుల’ కామెంట్

నేను కారు ఓటేసిన..పోలింగ్ బూత్ బయట  మంత్రి ‘గంగుల’ కామెంట్

కరీంనగర్, వెలుగు:

తాను కారు గుర్తుకు ఓటేశానని… ప్రతి ఓటరు కూడా అభివృద్ధికి ఓటేస్తం.. కేసీఆర్‌‌‌‌కు ఓటేస్తం.. కారు గుర్తుకు ఓటేస్తమని అంటున్నారని మంత్రి గంగుల కమలాకర్‌‌‌‌ ఓటేసిన తరువాత పోలింగ్‌‌‌‌ బూత్‌‌‌‌ వద్ద కామెంట్‌‌‌‌ చేశారు. మంత్రి  ఓటర్లను ప్రేరేపించేలా మాట్లాడి ఎలక్షన్‌‌‌‌ కోడ్‌‌‌‌ అతిక్రమించారని బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌ పార్టీలు ఎలక్షన్‌‌‌‌ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం 42వ డివిజన్‌‌‌‌లోని ట్రినిటీ బాలికల జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్‌‌‌‌లో ఓటు వేసి బయటకు వచ్చిన కమలాకర్ మీడియాతో మాట్లాడారు. “గతంలో ఎన్నో సార్లు ఓటేశాను. ఎమ్మెల్యేగా ఓటేశాను. కానీ మంత్రి పదవి వచ్చిన తరవాత మొట్టమొదటి సారిగా ఇదే ప్రప్రథమం. అది కూడా కారు గుర్తుకు ఓటు వేయడం గర్వకారణంగా భావిస్తున్నాను. ఈ రోజు ఒక మంత్రిగా కారు గుర్తుకు ఓటు వేస్తుంటే కరీంనగర్‌‌‌‌లో అడుగడుగున జరిగిన అభివృద్ధి నాకు కనపడ్డది. స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లయినా కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదు. అందుకే దశాబ్దాల దరిద్రాన్ని పారదోలాం. నాలుగేళ్లలోనే  సీఎం కరీంనగర్ రూపురేఖలు మార్చారు. అభివృద్ధికి ఓటేస్తం.. కేసీఆర్ కు ఓటేస్తం.. కారు గుర్తుకు ఓటేస్తం…  అని ప్రతి ఓటరు అంటున్నారు. గతంలో  ఎన్నడు లేని విధంగా 75 శాతం సీట్లు గెలిచి చరిత్రలో రికార్డుగా నిలుస్తం” అని కామెంట్‌‌‌‌ చేశారు.

ఇరు పార్టీల ఫిర్యాదులు

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే.. మంత్రి తమ పార్టీకి అనుకూలంగా చేసిన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. దీనిపై జిల్లాలోని బీజేపీ, కాంగ్రెస్ వేర్వేరుగా రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి, జిల్లా ఎన్నిల అధికారి, కలెక్టర్ శశాంకకు ఫిర్యాదు చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యల ఆడియో, వీడియో రికార్డులను ఆఫీసర్లకు అందజేశారు. మంత్రి మాటలు ఓటర్లను మభ్యపెట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. తను కారు గుర్తుకు ఓటు వేశానని, ప్రజలంతా కారు గుర్తుకే ఓటు వేయాలని ప్రేరేపించేలా మాట్లాడటం బాధ్యతారాహిత్యం అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ రావు మండిపడ్డారు. గంగుల వ్యాఖ్యలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఓటర్లకు, ఎలక్షన్‌‌‌‌ ఆఫీసర్లకు ఎంపీ కృతజ్ఞతలు

ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు కరీంనగర్‌‌‌‌ ఎంపీ బండి సంజయ్‌‌‌‌కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన ఓటింగ్‌‌‌‌లో పాల్గొనడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. 60 శాతానికిపైగా ఓటింగ్ నమోదు కావడం మంచి పరిణామమన్నారు. ఓటరు చైతన్యం ద్వారానే సమాజంలో మంచి మార్పు వస్తుందన్నారు. ఓటరు తీర్పును అన్ని పార్టీలు, క్యాండిడేట్లు శిరసావహించాల్సిందేనని తెలిపారు. కరీంనగర్ సిటీ సమగ్రాభివృద్ధికి దోహదపడేలా ప్రజలు మార్పు కోసం ఓటు వేసి ఉంటారని అభిప్రాయపడ్డారు.