
- అసెంబ్లీ నిర్వహణపై ప్రగతి భవన్ లో సీఎం, మంత్రుల భేటీ
- కేంద్రాన్ని ఎలా అటాక్ చేయాలనే దానిపైనే చర్చ!
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ప్రీ బడ్జెట్ మీటింగ్‌కు మంత్రి హరీశ్‌రావు డుమ్మా కొట్టారు. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ముందే ఆహ్వానం అందినా ఆయన వెళ్లలేదు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం కోసం ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ రామకృష్ణారావును కూడా ఢిల్లీకి పంపలేదు. ఫైనాన్స్ స్పెషల్ సెక్రెటరీ రొనాల్డ్ రోస్ మాత్రమే ఈ సమావేశానికి అటెండ్ అయ్యారు.
కేంద్ర బడ్జెట్‌లో ఏయే అంశాలు ఉండాలి, రాష్ట్రాల ప్రాధాన్యతలు ఏమిటీ, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీముల్లో రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనల కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మీటింగ్‌ను ఏర్పాటు చేసింది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఏమేం అవసరమో, ఏయే పథకాలకు ఎంత నిధులు కావాలో నివేదించే అవకాశమున్నా.. కీలక వ్యక్తులను పంపకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ చాన్స్‌ను జారవిడుచుకుంది. కేంద్ర ప్రభుత్వంతో రాజకీయంగా విబేధాలుంటే వాటిని రాజకీయంగానే ఎదుర్కోవాలని, ప్రీ బడ్జెట్ సమావేశాలపై నిర్లక్ష్యం సరికాదని అధికారులు అంటున్నారు.
ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు
నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్రాల అప్పుల (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితి పెంపు, క్యాపిటల్ ఎక్స్‌పెండిచర్‌లో కేంద్ర వాటాగా రెండు ఇన్‌స్టాల్‌మెంట్లు అడ్వాన్స్ రూపంలో చెల్లించడానికి అంగీకారం తెలిపారు. దీనిపై కేంద్రానికి ఆర్థిక మంత్రులు కృతజ్ఞతలు తెలిపారు. 2023–24 కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలను చేర్చాలని మంత్రులు నిర్మలకు ప్రతిపాదనలు అందజేశారు.
అసెంబ్లీ సమావేశాలపై సీఎంతో చర్చ
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను నిరసిస్తూ వచ్చే నెలలో నిర్వహించబోయే అసెంబ్లీ సమావేశాలపై శుక్రవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్ రెడ్డి సమావేశమయ్యారు. వారం రోజుల పాటు నిర్వహించే సమావేశాల్లో కేంద్రంపై ఎలా ఎటాక్ చేయాలి.. ఏయే అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే దానిపై సమాలోచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు గవర్నర్‌పైనా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లు.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూలగొట్టింది.. ఆడియో టేపుల్లో ఉన్న అంశాలపైనా ఒక రోజు సుదీర్ఘంగా చర్చించే అవకాశమున్నట్టు తెలిసింది. సీఎంతో మంత్రుల భేటీపై సీఎంవోగానీ, టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.