నీలాంటి కుక్కల్ని చాలా మందిని చూసినం.. తొక్కిపడేస్తం

నీలాంటి కుక్కల్ని చాలా మందిని చూసినం.. తొక్కిపడేస్తం

 

  • నిరుద్యోగ భృతి అడిగిన యువకుడికి మంత్రి జగదీశ్‌‌రెడ్డి వార్నింగ్‌‌

హాలియా, వెలుగు: ‘గిసోంటి కుక్కల్ని చాలా మందిని చూసినం.. లెక్కగాదు తొక్కిపడేస్తం.. ఏయ్ ఏమనుకుంటున్నవో నిన్ను నీ నాయకుడ్ని తొక్కిపడేస్తం బిడ్డ’ అంటూ ఉద్యోగ నోటిఫికేషన్లు, నిరుద్యోగ భృతి అడిగిన ఓ యువకుడికి మంత్రి జగదీశ్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మంత్రి జగదీశ్​రెడ్డి నియోజకవర్గంలోని అనుముల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. ప్రచారం రథంపై నుంచి మంత్రి ప్రసంగిస్తుండగా ఓ నిరుద్యోగ యువకుడు వెళ్లి అడ్డుకున్నాడు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతి సంగతి ఏం చేశారని, పాత హామీలను అమలు చేయకుండా ఎందుకు వచ్చారని ప్రశ్నించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మంత్రి జగదీశ్​రెడ్డి ‘నీలాంటి కుక్కలను చాలామందిని చూశాం... నిన్ను, నీ నాయకుడిని తొక్కిపడేస్తాం..’ అని అన్నారు. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వడం లేదని యువకుడు మళ్లీ నిలదీయడంతో పోలీసులు, టీఆర్​ఎస్ కార్యకర్తలు అతన్ని పక్కకు లాక్కెళ్లారు. దీంతో మంత్రి ప్రచార రథం ముందుకెళ్లింది. ఫిబ్రవరిలో అలీనగర్ సమీపంలో జరిగిన సీఎం కేసీఆర్​ సభలో కూడా ఇలాగే కొందరు యువకులు ప్రసంగాన్ని అడ్డుకున్నప్పుడు కూడా కేసీఆర్ వాళ్లను కుక్కలతో పోల్చిన సంగతి తెలిసిందే.