మృతుల‌ కుటుంబాలకు మూడు లక్షల ఆర్థిక సాయం

మృతుల‌ కుటుంబాలకు మూడు లక్షల ఆర్థిక సాయం

దేవరకొండ నియోజకవర్గ పరిధిలోని అంగడిపేట వద్ద రోడ్ ప్రమాదంలో మృతి చెందిన క్షతగాత్రులకు మంత్రి జగదీష్ రెడ్డి ఆర్థిక సహాయం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. మృతి చెందిన తొమ్మిది మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం తరఫున ఎక్స్ గ్రేషియా చెల్లించనున్నట్లు ఆయ‌న తెలిపారు.

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమారులతో కలిసి శుక్రవారం స్థానిక మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో జ‌గ‌దీశ్ రెడ్డి మాట్లాడారు . ఈ ప్రమాదంలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్య సౌకర్యాన్ని కల్పిస్తామని ఆయన చెప్పారు . మృతుల కుటుంబాలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేస్తామని మృతుల కుటుంబంలోని పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తామని మంత్రి తెలిపారు .ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురికి రైతు బీమా కూడా అందుతుందని చెప్పారు . మృతి చెందిన ఆటో డ్రైవర్ మల్లేష్ మల్లేష్ కు టిఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉన్నందున పార్టీ తరఫున రెండు లక్షల రూపాయల బీమా అందిస్తామని జగదీశ్వర్ రెడ్డి చెప్పారు.

ప్రమాద వార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ స్పందించినట్లు ఆయన తెలిపారు. సంఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ తెలుసుకున్నారని చెప్పారు. ప్రమాదం వార్త తెలిసిన వెంటనే జగదీష్ రెడ్డి జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. జాన్ పాడ్ దర్గా పర్యటనను రద్దు చేసుకుని ఈ ఉదయం దేవరకొండ చేరుకున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గాయపడ్డ కుటుంబాలను, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.