మహిళలకు తోడుగా టీ సేఫ్ యాప్..2 నెలల్లో 5 వేల డౌన్​లోడ్స్​

మహిళలకు తోడుగా  టీ సేఫ్  యాప్..2 నెలల్లో 5 వేల డౌన్​లోడ్స్​
  • రెండు నెలల్లో 5 వేల డౌన్​లోడ్స్​
  • ఎనిమిది వేల మంది ట్రిప్స్​ ట్రాక్
  • రాత్రి 7 నుంచి అర్ధరాత్రి 12 దాకా
  • ఎక్కువగా వినియోగం 

హైదరాబాద్, వెలుగు:  మహిళాప్రయాణికుల భద్రతకు తెలంగాణ పోలీసులు ట్రావెల్​ సేఫ్​ పేరుతో తెచ్చిన ‘టీ సేఫ్​’ యాప్​నకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రారంభించిన రెండు నెలల్లోనే 5,137 వేల మందికి పైగా డౌన్​లోడ్​ చేసుకున్నారు.  ఆయా నెలల్లో 8,382 మంది ట్రిప్స్​ను పోలీసులు ట్రాక్​చేశారు. టీ సేఫ్​యాప్​ను ఎక్కువగా రాత్రి 7 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు వినియోగిస్తున్నారు. మహిళలు, యువతులు, పిల్లలు ఎవరైనా నిర్భయంగా ప్రయాణించవచ్చే భరోసాను తెలంగాణ పోలీస్​ఉమెన్​ సేఫ్టీ వింగ్​కల్పిస్తోంది. యాప్ ద్వారానే కాకుండా వెబ్​సైట్, డయల్​100 ద్వారా కూడా మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నారు. టీ -సేఫ్‌ ద్వారా 100 లేదా 112 నంబర్‌కు కాల్‌ చేస్తే 5 నిమిషాల్లో పెట్రోలింగ్‌, బ్లూ కోల్ట్స్ వాహనాలు లొకేషన్ కు వస్తాయి. ఆపదలో చిక్కుకున్నవారు తమ లైవ్‌ లొకేషన్‌ను టీ -సేఫ్‌ యాప్‌ ద్వారా ఫ్యామిలీ మెంబర్స్​, ఫ్రెండ్స్​ కు కూడా పంపొచ్చు. టీ-సేఫ్‌ సేవలకు ప్రత్యేకంగా 791 పెట్రోలింగ్‌ కార్లు, 1,085 బ్లూ కోల్ట్స్ వెహికల్స్ సిద్ధంగా ఉంటాయి. 
 
ఏడు రాష్ట్రాల పోలీసుల ఇంట్రెస్ట్

టీ సేఫ్​ను దేశంలోనే మొదటిసారి తెలంగాణ పోలీసులు తీసుకొచ్చారు.  గత మార్చి12న సీఎం రేవంత్​రెడ్డి ఈ యాప్ ను ప్రారంభించారు. ఎన్నికల కోడ్ కారణంగా సరైన ప్రచారం చేయకపోయినా.. అనూహ్యంగా 5 వేల మంది డౌన్​లోడ్​ చేసుకున్నారు. ఎన్నికల కోడ్​ ముగిశాక స్కూళ్లు, కాలేజీలు, బస్టాండ్లు, సోషల్ మీడియాలో టీ సేఫ్​గురించి విస్తృతంగా ప్రచారం చేస్తామని ఉమెన్​సేఫ్టీ వింగ్​అడిషనల్​ డీజీ షిఖా గోయల్​తెలిపారు. త్వరలో ఓలా, ఉబర్​ వంటి అగ్రిగేటర్ యాప్ ల్లో కూడా టీ సేఫ్​ సేవలు తీసుకొస్తామని పేర్కొన్నారు. టీసేఫ్​ మంచి ఫలితాలను ఇస్తుండటంతో  7 రాష్ట్రాలకు చెందిన పోలీసులు యాప్ నిర్వహణ, ఫీడ్​బ్యాక్ పై అడిగి తెలుసుకున్నారని తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని సేవలను టీ సేఫ్ లో తీసుకొస్తామన్నారు.

ఐదు నిమిషాల్లో లొకేషన్ కు.. 

టీ సేఫ్‌ యాప్‌ను ప్లే స్టోర్ లో ఫ్రీగా డౌన్ ల్‌లోడ్‌ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ కు  వచ్చే ఓటీపీని ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. అనంతరం యాప్‌లో వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఆ వివరాలు పోలీసుల నిఘాలోకి వెళ్లిపోతాయి. ఇక ట్రిప్ స్టార్ట్ చేయగానే మానిటరింగ్ కోసం వెళ్లాల్సిన డెస్టినేషన్, ఆటోలో ప్రయాణిస్తున్నారా, కారులోనా, వెహికల్​నంబర్ తదితర వివరాలు అడుగుతుంది. ఆ డిటైల్స్​ఎంటర్ చేసిన వెంటనే ఆ వ్యక్తి రైడ్ ట్రాకింగ్ చేయబడుతుంది. లొకేషన్​మారిన, ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి కాల్ ఆన్సర్​చేయకపోయినా.. సమీప​పోలీస్​స్టేషన్ కు మెసేజ్​వెళ్తుంది. పోలీసులు అలర్టై 5 నిమిషాల్లోనే లొకేషన్​కు చేరుకుంటారు. 

 కొద్దిరోజుల కిందట ఓ మహిళా తన ఫ్యామిలీతో ఎమర్జెన్సీ పనిమీద రాత్రి ఒంటి గంట సమయంలో క్యాబ్ లో వెళ్తుంది. రెండు గంటల జర్నీ కావడంతో అభద్రతకు లోనైంది. అప్పుడే టీ సేఫ్ యాప్ ఆలోచన రాగా వెంటనే ఇస్టాల్​చేసి, రిజిస్టర్ చేసుకుంది. ట్రిప్, వెహికల్స్​డిటెయిల్స్​ఎంటర్ చేసింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను ట్రాక్ చేస్తూ  కాల్స్ చేశారు. అనంతరం ఆమె తెలంగాణ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్పింది.

ఇటీవల రమేశ్ తన ఫ్యామిలీతో అర్ధరాత్రి ట్రైన్ దిగాడు. ఇంటికి క్యాబ్ లో వెళ్తున్నారు. ప్రదీప్ అనే వ్యక్తి తన సోదరి ఫ్యామిలీ అప్పుడు 20 కిలోమీటర్ల జర్నీ ఎలా చేస్తున్నారోననే భయం కలిగింది. వెంటనే తన సిస్టర్ కు ఫోన్​చేసి టీ సేఫ్​యాప్ లో రిజిస్టర్ అయి, ట్రిప్​డిటెయిల్స్ ఎంటర్​చేయమని సూచించాడు. అలా చేయగా.. వెంటనే ట్రాకింగ్​అవుతుందని తెలియగా, ఇంటికి చేరేదాకా అతడు ధైర్యంగా ఉన్నాడు..

మీకు తోడుగా మేమున్నాం.. 

టీ సేఫ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తెలంగాణలో ప్రయాణిస్తున్న మహిళలు ఒంటరి వారు కాదు. వారికి తోడుగా టీ సేఫ్​ ఉంది. మహిళలకు జర్నీలో తోడుగా మేమున్నాం. ఏ సమయంలో నైనా నిర్భయంగా ప్రయాణించవచ్చు. ఇప్పటివరకు టీసేఫ్​ ట్రిప్ లన్నీ సురక్షితంగా జరిగాయి. పోలీసులు రెస్క్యూ చేయాల్సిన అవసరం రాలేదు. టీ సేఫ్​ను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మరిన్ని ప్రోగ్రామ్స్ నిర్వహిస్తం.


– శిఖా గోయల్, అడిషనల్ డీజీ, 
తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్