హైదరాబాద్/విజయవాడ: హైదరాబాద్ నుంచి ఏపీకి రోజూ లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు. రైళ్లు, బస్సులు, విమానాలు, ప్రైవేట్ వెహికల్స్తో నిత్యం తెలంగాణ, ఏపీ మధ్య రాకపోకలు నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు హ్యాపీగా జర్నీ చేయాలనేకునే వాళ్లు అప్రమత్తం అవ్వండి.. ఎమర్జెన్సీ అయితేనే ఏపీకి ప్రయాణాలు పెట్టుకోండి.. దీనికి కారణం.. తుఫాన్.. భీకర్ తుఫాన్.. ఏపీ తీరం వైపు దూసుకొస్తున్న మోంథా తుఫాన్.. కాకినాడ, మచిలీపట్నం మధ్య కోనసీమలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలోనే విశాఖపట్నం నుంచి తీరం మీదుగా ప్రయాణించే 43 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు.
2025, అక్టోబర్ 28వ తేదీ అర్థరాత్రి నుంచి 29వ తేదీ ఉదయం మధ్య కాకినాడ దగ్గర ఈ తుఫాను తీరం దాటనుంది. ఈ తుఫాన్ ఏపీలోని 23 జిల్లాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుందని.. అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. ఈ క్రమంలోనే రాబోయే నాలుగు రోజులు అంటే.. నెలాఖరు అక్టోబర్ 30వ తేదీ వరకు ఏపీ రాష్ట్రం వెళ్లాలనుకునే వారు అలర్ట్ అవ్వండి. అత్యవసరం అయితేనే ప్రయాణాలు పెట్టుకోండి.. లేకపోతే వర్షాలు, వరదల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వాతావరణ శాఖ, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థలు ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి.
కార్తీక మాసం నడుస్తుంది.. పెళ్లిళ్ల సీజన్ ఉంది.. ఈ క్రమంలోనే హైదరాబాద్, ఏపీ మధ్య రాకపోకలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే వెదర్ డిపార్ట్ మెంట్ ముందస్తు హెచ్చరికలు ఇస్తుంది. ఇప్పటికే ఏపీలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, చీరాల తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. వాతావరణం కారు మేఘాలతో కమ్మేసింది. తుఫాన్ మోంథా తీరాన్ని సమీపించే కొద్దీ.. తీవ్రత పెరుగుతుంది. 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బీభత్సం చేయొచ్చు. తుఫాన్ తీరం దాటే ముందు.. ఆ తర్వాత భీకర గాలులకు చెట్లు కూలిపోవచ్చు.. కరెంట్ పోల్స్ పడిపోతాయి.. హోర్డింగ్స్ విరిగిపోతాయి.. భారీ వర్షాలతో రోడ్లపైకి వరద వస్తుంది.. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న క్రమంలో ఏపీలోని 23 జిల్లాలకు రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ ఇచ్చిన వాతావరణ శాఖ.. అందుకు తగ్గట్టు జనాన్ని కూడా అప్రమత్తం చేసింది.
పెళ్లిళ్లుపేరంటాలు.. గుళ్లూగోపురాలు అని ప్రయాణాలు పెట్టుకోవద్దని.. అత్యవసరం అయితేనే ప్రయాణాలకు సిద్ధం కావాలని.. వాతావరణ శాఖ హెచ్చరికలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ జాగ్రత్తలు తీసుకోవాలని భారత వాతావరణ శాఖ సూచించింది. ఈ మోంథా తుఫాను ప్రభావంతో.. కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మంగళవారం నాడు.. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే మన్యం, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప, తిరుపతి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
