అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్..ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రకటన

అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్..ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ప్రకటన

హైదరాబాద్, వెలుగు: ఆరేండ్లుగా పెండింగ్​లో ఉన్న  ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్​ బకాయిలను రిలీజ్ చేయాలని కోరుతూ ఈ నెల 30న రాష్ట్రవ్యాప్తంగా కాలేజీల బంద్​చేపట్టనున్నట్లు  ఎస్​ఎఫ్​ఐ రాష్ట్ర కమిటీ ప్రకటించింది. డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, మెడికల్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీలు, యూనివర్సిటీలు ఈ బంద్​కు మద్దతివ్వాలని కోరింది. 

సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంద్ పోస్టర్​ను ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రజనీకాంత్, నాగరాజు రిలీజ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సుమారు రూ. 8 వేల కోట్లకు పైగా ఫీజుల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 23 నెలలు గడుస్తున్నా, తాము ఇచ్చిన హామీ ప్రకారం కనీసం రూ.1200 కోట్లైనా విడుదల చేయలేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ సమస్యలపై సమీక్షించి నిధులు కేటాయించాలని కోరారు.