సోదరి నివేదితని నిబద్ధత, విద్య, సేవల త్రివేణి సంగమంగా పేర్కొంటారు. ఆమె అసలు పేరు మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్. సిస్టర్ నివేదిత 1867 అక్టోబర్ 28న మేరి ఇసబెల్, శ్యాముల్ రిచ్‌ముడ్ నోబుల్లకు ఐర్లాండ్‌లో జన్మించారు. విదేశంలో జన్మించినా భారతదేశం కోసం ప్రాణం అర్పించిన మహనీయురాలు. భారతీయ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన సోదరి నివేదిత జీవితం సేవ, త్యాగం, విద్యా మార్గాలకు ముద్ర వేసింది.
ఆమె చిన్ననాటి నుంచే బోధన, సేవాభావాలతో ఉండేవారు. 1895లో లండన్‌లో స్వామి వివేకానంద ప్రసంగం విన్న తర్వాత ఆమె జీవితం మారిపోయింది. భారతదేశానికి వచ్చి దేశ సేవలో తన జీవితాన్ని అర్పించాలని నిర్ణయించుకుంది. వివేకానంద ఆమెకు నివేదిత అంటే (అర్పితమైనది) అనే పేరు పెట్టారు.
మహిళా విద్యాభివృద్ధి కోసం కృషిమహిళలకు సరైన విద్యావకాశాలు కల్పించి విద్యావంతులను చేసినపుడే దేశం అభివృద్ధి చెందుతుందని అనుకున్న సిస్టర్ నివేదిత మహిళా విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. నివేదితకు ఒకరు బుద్ధుని జీవితానికి సంబంధించిన పుస్తకం ఇచ్చారు. అది చదివిన ఆమెకు ఆసియా ఖండంలోని అన్ని దేశాలలోని మతాల గురించి అవగాహన ఏర్పడింది. విద్య కోసం సోదరి నివేదిత స్థాపించిన పాఠశాల ఆ కాలంలో గొప్ప సంచలనమైంది. విద్య ద్వారా మహిళలు సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఆమె నమ్మకం. వివేకానందుడి బోధనలకు ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించిన మొదటి విదేశీ మహిళగా ఆమె చరిత్రను సృష్టించారు. 1895వ సంవత్సరంలో భారత మహిళా ఔన్నత్యంపై స్వామి వివేకానంద అమెరికాలో సర్వమత సమావేశానికి హాజరై భారతదేశం వెళుతూ లండన్‌లో ఆగిన వివేకానందను ఆమె కలిసి 1898 జనవరి 28న భారతదేశానికి వచ్చి రామకృష్ణ మిషన్‌లో చేరి సేవాకార్యక్రమాలను నిర్వహించడం జరిగింది.
నివేదిత జీవితాన్ని మార్చిన వివేకానంద
వివేకానంద బోధన గురించి, తనపై వాటి ప్రభావం గురించి ఆమె తాను రాసిన ‘ది మాస్టర్ యాజ్ ఐ సా హిమ్’ పుస్తకంలో వివరించారు. బాలికల విద్యకోసం ఆమె 1898 నవంబరులో కలకత్తాలోని బాగ్‌బజారులో పాఠశాలను ప్రారంభించింది. బాలికలకు విద్యను అందించడం లక్ష్యంగా ఆమె పనిచేశారు. విశ్వకవి రవీంద్రనాధ ఠాగుర్, జగదీశ్ చంద్రబోస్ తదితర ప్రముఖులతో స్నేహసంబంధాలను కొనసాగించారు. 1899 సంవత్సరం మార్చిలో కలకత్తాలో ప్రజలకు ప్లేగు వ్యాధి సోకినప్పుడు తన శిష్యులతో కలిసి వైద్యసేవలు అందించారు. 1906లో బెంగాల్‌కు వరదలు వచ్చినప్పుడు బాధిత ప్రజలకు ఆమె చేసిన సేవ, అందించిన మానసిక ధైర్యం ఎంతో విలువైనవి. భారత చరిత్రలో సోదరి నివేదిత పేరు స్త్రీ శక్తికి, సేవా త్యాగానికి చిహ్నంగా నిలిచింది. 1911 అక్టోబరు 13న డార్జిలింగ్‌లో సోదరి నివేదిత ఈ లోకాన్ని విడిచి భగవంతునిలో లీనమయిపోయింది. ఆమె సమాధిపై ‘ఇది భారతమాతకు అర్పితమైన జీవితం’ అని పేర్కొనడం జరిగింది.
- సొప్పరి నరేందర్,
హెచ్ సీయూ
