హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రభావం విమాన సర్వీసులపై పడింది. మోంథా తుఫాను ఎఫెక్ట్‌తో శంషాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు అయ్యాయి. అదే విధంగా విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాల్సిన ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. మోంథా తుఫాను కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా విమాన సర్వీసులను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్లడించాయి.
ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ప్రయాణికులకు సూచించాయి. మోంథా తుఫాన్ ప్రభావం ట్రైన్ సర్వీసులపైన పడింది. మోంథా తుఫాను కారణంగా పలు సర్వీసులను రైల్వే శాఖ ఇప్పటికే రద్దు చేసింది. ముఖ్యంగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ రూట్లలో నడిచే పలు రైళ్లు రద్దు అయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కాగా, బంగాళాఖాతంలో ఏర్పడిన మోంథా తుఫాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. మరి కొన్ని గంటల్లో మోంథా తీవ్ర తుఫాన్‌గా మారి ఏపీ తీరం వైపు రానుందని వెల్లడించింది. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న మోంథా.. మంగళవారం (అక్టోబర్ 28) రాత్రి, లేదా బుధవారం (అక్టోబర్ 30) ఉదయం మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటనున్నట్లు అంచనా వేసింది.
