నాలుగు చుక్కల పారాక్వాట్ చాలు మనిషిని చంపేయటానికి.. దీనికి విరుగుడు మందే లేదు

 నాలుగు చుక్కల పారాక్వాట్ చాలు మనిషిని చంపేయటానికి.. దీనికి విరుగుడు మందే లేదు

హైదరాబాద్: రాష్ట్రంలో గడ్డి మందు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నది. పంటచేలలో గడ్డి గాదాన్ని నాశనం చేసే పారాక్వాట్ డైక్లోరైడ్ మందు.. మనిషి ఊపిరితిత్తులు, కాలేయం, కిడ్నీలను దెబ్బ తీస్తూ రోజుల వ్యవధిలోనే ప్రాణాలను  బలిగొంటున్నది. ఈ గడ్డి మందు మార్కెట్​లో తక్కువ ధరకే దొరుకుతుండటం, కొద్దిగంటల్లోనే గడ్డిని మాడిపోయేలా చేస్తుండటంతో రైతులు దీన్ని వాడేందుకే మొగ్గుచూపుతున్నారు. దాదాపుగా ప్రతి రైతు ఇంట్లోనో, పొలం వద్దనో పారాక్వాట్ గడ్డి మందు అందుబాటులో ఉంటోంది. 

దీంతో ఇంట్లో ఏ చిన్న గొడవ జరిగినా, ఆర్థిక ఇబ్బందులు, తగాదాల వంటి సమస్యలు, పరీక్షల్లో, ప్రేమలో ఫెయిల్ అవడం లాంటి చిన్న చిన్న కారణాలకే క్షణికావేశంలో రైతులు, రైతుల పిల్లలు ఈ మందు తాగుతున్నారు. దీనికి విరుగుడు లేకపోవడంతో కొన్ని రోజుల పాటు ప్రాణాలతో పోరాడి, కిడ్నీలు, కాలేయం దెబ్బతిని, ఊపిరితిత్తులు చెడిపోయి చివరికి చనిపోతున్నారు. మరోవైపు దీని అమ్మకాలపై ఎలాంటి నియంత్రణ లేకపోవడంతో ఫర్టిలైజర్ షాపులతో పాటు ఆన్​లైన్​లోనూ విచ్చలవిడిగా అమ్ముతున్నారు.  

విరుగుడు లేదు.. 

పారాక్వాట్ డైక్లోరైడ్ అనేది అత్యంత వేగంగా గడ్డిని నాశనం చేసే మందు. స్విట్జర్లాండ్‌‌కు చెందిన సింజెంటా కంపెనీ గ్రామాక్సోన్ పేరుతో దీన్ని ప్రపంచవ్యాప్తంగా అమ్ముతోంది. ఇండియాలో కూడా అనేక కంపెనీలు దీన్ని తయారుచేసి అమ్ముతున్నాయి. పొలాల్లో గడ్డిపై స్ర్పేచేయగానే గంటల వ్యవధిలోనే గడ్డిని మాడ్చేస్తుంది. పనితీరు వేగంగా ఉండడం, ధర తక్కువ కావడంతో రైతులు దీని వాడకానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. కానీ, మనుషుల పాలిట ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. కేవలం10–15 మిల్లీలీటర్ల మందు తాగినా ప్రాణాలు దక్కడం కష్టం. 

దీనికి కచ్చితమైన విరుగుడు (యాంటిడాట్) లేదు. మందు తాగిన వెంటనే నోరు మొక్కల మాదిరిగా మాడిపోతుంది. నేరుగా రక్తంలో కలిసి ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయాన్ని పాడు చేస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల కణజాలం గట్టిపడి రాయిలా మారిపోతుంది. దీనినే వైద్య పరిభాషలో పల్మనరీ ఫైబ్రోసిస్ అంటారు. దీంతో బాధితుడికి శ్వాస అందక, వెంటిలేటర్‌‌ పై ఉంచినా ఫలితం ఉండదు. విలవిల కొట్టుకుంటూ, తీవ్ర నరకయాతన అనుభవించి మందు తాగిన కొద్దిరోజుల్లోనే చనిపోతారు. ఈ కారణంతో పాటు పంటలపై పిచికారీ చేయడం వల్ల ఇతర దుష్పరిణామాలు కూడా ఉంటాయి. 

ప్రత్యామ్నాయంగా ​గ్లైఫోసేట్, గ్లూఫోసినేట్​

పారాక్వాట్​కు బదులుగా గ్లైఫోసేట్, గ్లూఫోసినేట్ వంటి కలుపు మందులు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అవి పారాక్వాట్ అంత వేగంగా పనిచేయకపోయినా మనుషులకు అంత ప్రమాదకరం కాదు. కానీ, ఈ ప్రత్యామ్నాయ మందుల గురించి రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. కేవలం సబ్సిడీలకే పరిమితమైన ఆ శాఖ, రైతులకు చైతన్యం కలిగించడంలో చేతులెత్తేసిందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం పారాక్వాట్‌‌ను రాష్ట్రవ్యాప్తంగా నిషేధించాలని, రైతులకు ప్రత్యామ్నాయ మందులపై అవగాహన కల్పించి, వాటిని సబ్సిడీపై అందించాలని కోరుతున్నారు.  

స్పెషలిస్టు డాక్టర్లు ఏమంటున్నారంటే..

పారాక్వాట్ గడ్డిమందు మొదట కిడ్నీలనే టార్గెట్​చేస్తుందని -నిమ్స్ నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెచ్​వోడీ డాక్టర్ భూషణ్ రాజ్ అంటున్నారు. శరీరంలోకి చేరిన పారాక్వాట్ ను బయటకు పంపేందుకు కిడ్నీలు ప్రయత్నించి దెబ్బ తింటాయన్నారు. దీంతో మూత్రం ఆగిపోయి, శరీరం నుంచి విషం బయటకు పోక మరణం సంభవిస్తుందన్నారు. నిమ్స్​ జనరల్​మెడిసిన్ ​హెచ్ఒడీ డాక్టర్ సుబ్బలక్ష్మి, నిమ్స్ పల్మనాలజీ, హెచ్ఓడీ డాక్టర్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ.. పారాక్వాట్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపి, పల్మనరీ ఫైబ్రోసిస్‌‌ ఏర్పడి మరణానికి దారితీస్తుందన్నారు. స్పాంజ్ మాదిరిగా ఉండే లంగ్స్ ఈ మందు ప్రభావంతో రాయిలా గట్టిపడి, ఆక్సిజన్‌‌ గ్రహించే శక్తిని పూర్తిగా కోల్పోతాయన్నారు. ఈ దశలో రోగికి ఎంత ఆక్సిజన్ అందించినా, అది రక్తంలోకి చేరదని, చివరికి లంగ్స్ పూర్తిగా పనిచేయడం ఆగిపోయి చావుకు దగ్గరవుతారని వివరించారు.