తెలంగాణలో భూములకు సంబంధించి జరుగుతున్న సంస్కరణలలో భాగంగా రికార్డుల ప్రక్షాళన, కంప్యూటరీకరణ ( ధరణి & భూ భారతి పోర్టల్ ) నాణేనికి ఒకవైపు అయితే.. సర్వే సెటిల్మెంట్ అనేది నాణేనికి ఇంకోవైపు ఈ రెండూ బొమ్మా బొరుసులా ముడిపడి ఉంటాయి. ప్రభుత్వాలు కేవలం నాణేనికి ఒకవైపు మాత్రమే చూస్తూ ఇంకోవైపు చూడడం లేదు. తెలంగాణలో నిజాం కాలంలో జరిగిన సర్వే మ్యాపులు, పాతకాలం సర్వే బౌండరీ చట్టం 1923 నిబంధనలే ఇప్పటికీ ఆధారం. ప్రతి ముప్పై ఏళ్లకోసారి సర్వే జరిగితేనే రికార్డులు అప్డేట్ అవుతాయి.
రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం భూముల రికార్డుల ప్రక్షాళన, కంప్యూటరీకరణ, ధరణి పోర్టల్, తహసీల్దార్ కార్యాలయంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లాంటి సంస్కరణలు తీసుకొచ్చినా.. సమగ్ర భూ సర్వే మాత్రం చేపట్టలేదు. భూ సర్వే కోసం కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉన్నా సద్వినియోగం చేసుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ధరణి స్థానంలో భూ భారతి, పాత రెవెన్యూ చట్టం 2020 బదులు స్వల్ప మార్పులతో 2024 కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చారు. ఎలాంటి రికార్డుల ప్రక్షాళన చేయకుండానే ధరణి పోర్టల్ డేటాను భూ భారతిలో కొనసాగిస్తున్నారు. గత ప్రభుత్వం తొలగించిన వీఆర్వోలనే పేరు మార్చి గ్రామ పాలన అధికారులు (జీపీవో) గా నియమించారు.
భూ సర్వే రెండు రకాలు
భూ సర్వే రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది. రైతు మీ సేవ ఎఫ్లైన్ పిటీషన్ ద్వారా అప్లై చేసుకుంటే.. మండల సర్వేయర్ వచ్చి నాలుగు దిక్కులలో ఉన్న రైతులకు నోటీసులు ఇచ్చి ఒక సర్వే నంబర్ మొత్తం విస్తీర్ణం ఎంత? హద్దులు ఎన్ని అని నిర్ణయించి పంచనామా చేసి ఇస్తారు. దీంతో రైతు సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు సర్వేయర్ ఎంతో కొంత నగదు ఇచ్చుకుంటేనే తప్ప సర్వే చేసేందుకు రావడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రెండోది ఎంజాయ్మెంట్ సర్వే. అంటే ఒక సర్వే నంబర్ మొత్తం విస్తీర్ణం ఎంత ? అందులో ఎంతమంది రైతులు ఉన్నారు ? వారి రికార్డు ప్రకారం పొజిషన్ లో ఉన్నారా? లేదా అని తేల్చేది. ఈ సర్వే మండల సర్వేయర్ చేయరు. ఎందుకంటే దీనికి సంబంధించి చట్టంలో ఎలాంటి నియమ, నిబంధనలు లేవు. అందువల్ల రైతుల గెట్టు సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.
డిజిటల్ ల్యాండ్ సర్వే చేపట్టాలి
తెలంగాణలో 10,954 రెవెన్యూ గ్రామాలలో నిజాం కాలంలో సర్వే జరగని గ్రామ నక్షలు లేని కేవలం 413 గ్రామాలలో కొన్ని గ్రామాలను పైలెట్ ప్రాజెక్టు కింద సర్వే చేపట్టారు. అనంతరం తెలంగాణ మొత్తం సర్వే చేసినట్టు.. లైసెన్స్డ్ సర్వేయర్ల ద్వారా సమస్యలు మొత్తం పరిష్కారం అవుతాయి అన్నట్టు ప్రస్తుత ప్రభుత్వం చెపుతోంది. గ్రామపాలన అధికారులను నియమించి గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేశాం. లైసెన్సుడు సర్వేయర్లను నియమించి గెట్టు పంచాయతీ లేకుండా చేశాం.. అని చెప్పడం కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలి. గెట్టు పంచాయతీ లేని తెలంగాణ నిర్మాణం కావాలంటే తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర భూ సర్వే (డిజిటల్ ల్యాండ్ సర్వే) పథకానికి శ్రీకారం చుట్టాలి. దీనికోసం రాష్ట్రంపై ఆర్థికభారం పడకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా
కేటాయిస్తుంది.
లైసెన్స్డ్ సర్వేయర్లు
వ్యవసాయ భూముల అమ్మకం, కొనుగోలు సందర్భంగా రిజిస్ట్రేషన్ సమయంలో సర్వే మ్యాప్ తప్పనిసరి వల్ల పుట్టుకొచ్చిన వారే ఈ లైసెన్స్ సర్వేయర్లు. వీరు చేసిన సర్వే మ్యాపును మళ్ళీ మండల సర్వేయర్ అప్రూవ్ చేయాలి అప్పుడే ఎకరం భూమి రిజిస్ట్రేషన్ జరుగుతుంది. భూముల అమ్మకం కొనుగోలు జరగకపోతే లైసెన్స్డ్ సర్వేయర్లకు ఎలాంటి పని ఉండదు. ప్రభుత్వం మండల సర్వేయర్లను నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తేనే సర్వే సమస్యలు పరిష్కారం అవుతాయి. పత్తా లేని ‘స్వామిత్వ’... గ్రామాలలో గ్రామకంఠం భూములను సర్వే చేసి వ్యవసాయ భూములకు ఏ విధంగా పట్టా పాసుబుక్కులు ఉన్నాయో, అదేవిధంగా గృహ నివాసాలకు పట్టా పాసుబుక్కులు ఇచ్చి హక్కులు కల్పించి వారు లోన్లు పొందేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందే ఈ పథకం. దీనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదు.
- బందెల సురేందర్ రెడ్డి
