రీల్స్ చేస్తూ యమునా నదిలో జారిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

రీల్స్ చేస్తూ యమునా నదిలో జారిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

న్యూఢిల్లీ: ఛత్ పూజ సందర్భంగా యుమునా నది నీటి పరిశుభ్రతపై ఢిల్లీలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష ఆప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. యుమునా నది నీరు అపరిశుభ్రంగా ఉందని.. ఇలాంటి నీటిలో ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తే తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉందని ఆప్ ఆరోపిస్తోంది. యమునా నదిని క్లీన్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. యమునా నదిని శుభ్రం చేశామని.. ఆప్ ప్రజలను పక్కదారి పట్టిస్తోందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. 

ఈ క్రమంలోనే పట్పర్‌గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీందర్ సింగ్ నేగి యుమునా నది నీరు పరిశుభ్రంగా ఉందని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు యుమునా నది దగ్గరికెళ్లిన రవీందర్ సింగ్ బాటిల్‎లో యమునా నీటిని తీసుకోబోయాడు. ఈ క్రమంలో కాలు జారి నదిలో పడిపోయాడు. పక్కనే ఉన్న సహయకుడు ఎమ్మెల్యేను పట్టుకోబోయాడు. అప్పటికే నదిలో పడిపోయిన ఎమ్మెల్యే మెల్లగా లేచి బయటకు వచ్చాడు. 

యమునా నీరు శుభ్రంగా ఉందని నిరూపించేందుకు ఎమ్మెల్యే ఈ తతంగాన్ని అంతా వీడియో తీయించారు. కానీ అనుకోకుండా ఆయనే నదిలో పడిపోయారు. ఎమ్మెల్యే నదిలో పడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్‎గా మారింది. ఈ వీడియోపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే సంజీవ్ ఝా సెటైర్ వేశారు. బీజేపీ అబద్ధపు రాజకీయాలతో విసిగిపోయి స్వయంగా యమునా నది బహుశా వాళ్లను తనవైపుకు పిలిపి ఉండవచ్చని బీజేపీ ఎమ్మెల్యే నదిలో పడటాన్ని ఎద్దేవా చేశారు. ఢిల్లీ బీజేపీ నాయకులకు ఉచిత వాగ్దానాలు చేయడం అలవాటుగా మారిందని విమర్శించారు.