నల్గొండ జిల్లాలో ఈసారిమహిళలకు 69 షాపులు.. షాపుల కేటాయింపు పూర్తి

నల్గొండ జిల్లాలో ఈసారిమహిళలకు 69 షాపులు.. షాపుల కేటాయింపు పూర్తి
  • సిండికేట్లకు భారీగా నష్టం 
  • వంద అప్లికేషన్లకు ఒక్క షాపే

నల్గొండ/యాదాద్రి, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈసారి మహిళలు భారీగా వైన్స్​ షాపులను దక్కించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 329 షాపులకు గాను మహిళలకు 69 షాపులు వచ్చాయి. మద్యం షాపు టెండర్లను ఈసారి పురుషులతో పాటు మహిళలు కూడా భారీగా దరఖాస్తు చేసుకున్నారు. సూర్యాపేట జిల్లాలో 93 షాపుల్లో 20 షాపులు లక్కీడ్రాలో మహిళలే దక్కించుకోగా, నల్గొండ జిల్లాలో 154 వైన్స్ షాపులకు 30 షాపులకు పైగా వైన్స్ షాపులు దక్కించుకున్నారు.యాదాద్రి జిల్లాలో 82 షాపులకు గానే మహిళలకు 19 షాపులు వచ్చాయి. 

ఒకటో టోకెన్​వచ్చిన వారికి 9 షాపులు 

యాదాద్రి జిల్లాలో 82 వైన్స్ షాపులకు ప్రభుత్వం అప్లికేషన్లు ఆహ్వానించగా 2,776 అప్లికేషన్లు వచ్చాయి. కలెక్టర్​ హనుమంతరావు సోమవారం లాటరీ పద్దతిలో షాపులను కేటాయించారు. ఒకటో నెంబర్​ టోకెన్​ వచ్చిన వారికి ఈసారి లక్కు కలిసివచ్చింది. ఈ టోకెన్​ వచ్చిన వారిలో 9 మందికి వైన్స్​లు దక్కాయి. షాపులు దక్కించుకున్న వారు మంగళవారం నాడు ఫీజులోని 6వ వంతు చెల్లించాల్సి ఉంటుంది.

 సిండికేటుగా మారి వైన్స్​ షాపులకు అప్లయ్ చేసుకున్న వారికి ఈసారి భారీ నష్టం వాటిల్లింది. జిల్లాలో కొందరు వ్యక్తులు సిండికేట్​గా ఏర్పడి రూ. 9.99 కోట్లు చెల్లించి 333 అప్లికేషన్లు వేయగా వారికి కేవలం 4 షాపులే వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన వారికి రూ. 9.87 కోట్లు నష్టపోయారు. ఆలేరులో ఒక సిండికేట్​ గ్రూపు 70కిపైగా అప్లికేషన్లు వేయగా నాలుగు వచ్చాయి. తిరుమలగిరి, భువనగిరి సిండికేట్లు 51 చొప్పున అప్లికేషన్లు వేశాయి. తిరుమలగిరి సిండికేట్​కు నాలుగు, భువనగిరి సిండికేట్​కు ఒకటి దక్కింది. ఎనిమిది మంది యువకులు కలిసి 8 అప్లికేషన్లు వేయగా వారికి లాటరీలో రెండు షాపులు దక్కాయి. జిల్లాలో అత్యధికంగా 91 అప్లికేషన్లు వచ్చిన ఎల్లంబాయి షాపు మహిళ పోలు అండాలుకు దక్కింది. 

సిండికేట్‌లే ఎక్కువ..

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనూ చాలా వరకు సిండికేట్‌గా మారి టెండర్లు వేసినట్టు తెలుస్తోంది. ఒక్కొక్క గ్రూప్‌ నుంచి 80 కి పైగా దరఖాస్తులు వేయగా.. ఒకటి, రెండు షాపులు మాత్రమే లక్కీ డ్రాలో దక్కడంతో భారీగా నష్టపోయారు. లక్షల్లో పెట్టుబడి పెట్టి టెండర్లు వేసిన చాలా మంది వారు వైన్స్‌లు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. సూర్యాపేట జిల్లాలో ఒక వ్యక్తి దాదాపు 16 షాపులకు, కోదాడకు చెందిన మరో వ్యక్తి 18 షాపులకు దరఖాస్తులు చేసుకోగా వారికి ఒక్క వైన్స్ షాపు కూడా దక్కలేదు. 

రూల్స్​ మేరకే షాపులు నడపాలి 

2025–27 పాలసీ కింద షాపులు పొందిన వారు నిబంధనల మేరకు మద్యం అమ్మకాలు నిర్వహించాలని నల్గొండ, సూర్యాపేట కలెక్టర్లు ఇలా త్రిపాఠి, తేజస్‌నంద్‌లాల్‌ స్పష్టం చేశారు. ఆయా జిల్లాల్లో లక్కీ డ్రా పద్దతిలో వైన్స్​ షాపులను కేటాయించిన అనంతరం వారు మాట్లాడారు. డ్రాలో షాపు వచ్చిన వారు లైసెన్స్ ఫీజులో ఆరో వంతు ఈనెల 28 లోగా చెల్లించాలన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పారదర్శకంగా లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలను కేటాయించినట్టు చెప్పారు. నల్గొండ జిల్లాలో 154 మద్యం షాపులకు గాను 4906 అప్లికేషన్లు వచ్చాయి. సూర్యాపేట జిల్లాలో 93 షాపుల కు 2,487 ఆప్లికేషన్స్​ వచ్చాయి.