కొమురవెల్లి, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా కొమురవెల్లి పుర వీధులు శివనామస్మరణతో మార్మోగాయి. ఆదివారం సెలవు దినం కావడంతో జాగరణ చేసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం నుంచి మల్లికార్జునస్వామికి నిరంతరంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. లింగోద్బవకాలంలో స్థానిక తోటబావి వద్ద ఒగ్గుపూజారులు పెద్దపట్నం వేయనున్నారు. రాజగోపురం నుంచి ప్రధాన రహదారి, గంగరేగు చెట్టు వద్ద సందడి నెలకొంది. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు దీరారు.
అనంతరం మల్లన్న కొండపైన వెలసిన రేణుక ఎల్లమ్మ దేవతను దర్శించుకునేందుకు నెత్తిన బోనాలతో వెళ్లారు. అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈఓ వెంకటేశ్, ఆలయ ప్రధాన అర్చకుడు మహదేవుని మల్లికార్జున్, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యుల సౌకర్యాలు పర్యవేక్షించారు. హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఆధ్వర్యంలో సీఐ రమేశ్, ఎస్ఐ మహేశ్ పటిష్ట బందోబస్తు చేపట్టారు.
