సీల్డ్ కవర్ లో పేర్లు.. కామారెడ్డిలో కుర్చీని కాంగ్రెస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు

సీల్డ్ కవర్ లో పేర్లు.. కామారెడ్డిలో కుర్చీని కాంగ్రెస్ దక్కించుకునేందుకు ప్రయత్నాలు
  •      నేడే చైర్​పర్సన్​, చైర్మన్ల ఎన్నిక

కామారెడ్డి​, వెలుగు :  కామారెడ్డి జిల్లాలో 4 మున్సిపాలిటీలకు  3 చోట్ల కాంగ్రెస్​ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాగా,  కామారెడ్డిలో మాత్రం హంగ్​ ఏర్పడింది.   అక్కడ పదవిని కాంగ్రెస్​  దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  మొత్తం 49  మంది కౌన్సిలర్లు ఉండగా   కాంగ్రెస్​ 19, బీఆర్ఎస్​ 11, బీజేపీ 16, ఇండిపెండెంట్లు 3 గెలిచారు.  ఇండిపెండెంట్లుగా గెలిచిన ముగ్గురు సభ్యులు  కాంగ్రెస్​ వారితో కలిసి క్యాంపుకు వెళ్లారు.  దీంతో  కాంగ్రెస్​ బలం 22 సభ్యుల సంఖ్య చేరింది. మ్యాజిక్​ ఫిగర్​ 25 కావాలి. దీంతో  మరో ముగ్గురు  సభ్యుల మద్దతు అవసరముంది.  

సోమవారం చైర్​పర్సన్​, వైస్​ చైర్మన్​ ఎన్నికకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్​లో కాంగ్రెస్​   చైర్​ పర్సన్​ పదవిని దక్కించుకుంటుందని  ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి.    చైర్​పర్సన్​ పదవిని  సురోజ్​ వనిత,  హర్షితతో పాటు ఇండిపెండెంట్​గా గెలిచి కాంగ్రెస్​ వైపు వెళ్లిన  ఈప్ప ఉమారాణి  ఆశిస్తున్నారు.  

ఇండిపెండెంట్​ అభ్యర్థిగా గెలిచిన  ఈప్ప ఉమారాణి కి చైర్​ పర్సన్​ పదవి ఇస్తే బీఆర్​ఎస్​ మద్దతు ఇచ్చే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు.  హైదరాబాద్​ శివారులో క్యాంపులో ఉన్న కాంగ్రెస్​  కౌన్సిలర్లతో  ఆదివారం  జహీరాబాద్​ పార్లమెంట్​ ఇన్​చార్జి మంత్రి అజారుద్ధీన్​,  ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ, జహీరాబాద్​ ఎంపీ సురేష్​ షేట్కార్, మహిళ కమిషన్​ చైర్​పర్సన్​   నేరెళ్ల శారద, డీసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున్​  సమావేశం అయ్యారు.   పార్టీ   అభ్యర్థిని ఎంపిక  చేసి,   సీల్డు కవర్​లో పేరు పంపనునన్నట్లు తెలిపారు. 

బీఆర్ఎస్​ ను  వీడినట్టు ప్రచారం!  

 బీఆర్​ఎస్​ పార్టీ నుంచి గెలిచిన 11 మంది కౌన్సిలర్లు మాజీ ఎమ్మెల్యే గంప గోవర్దన్​, పార్టీ జిల్లా ప్రెసిడెంట్​ ముజిబొద్దిన్​ ఆధ్వర్యంలో క్యాంపులో ఉన్నారు.   ఆదివారం మధ్యాహ్నం నలుగురు సభ్యులు పార్టీని వీడి కాంగ్రెస్​ వెళ్లారని కామారెడ్డిలో ప్రచారం జరిగింది.  అలర్టు అయిన ఆ పార్టీ కౌన్సిలర్లు తాము ఎక్కడికి  వెళ్లలేదని  బీఆర్​ఎస్​లోనే ఉన్నామంటే వీడియో రిలీజ్​ చేశారు.   హైదరాబాద్​ శివారులో  క్యాంపుల్లో ఉన్న ఆయా పార్టీల కౌన్సిలర్లు   సోమవారం నేరుగా  మీటింగ్​కు రానున్నారు. 

 బోధన్​ చైర్​ పర్సన్​ పదవి కాంగ్రెస్​కే...

నిజామాబాద్​: జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు బోధన్​ మున్సిపాలిటీల్లో  పీఠాలు  దక్కించుకోడానికి కాంగ్రెస్​ లీడర్లు కసరత్తు చేస్తున్నారు.  హంగ్​ రిజల్టు వచ్చిన ఈ రెండు చోట్లా  మజ్లిస్​ మద్ధతు ఇచ్చింది. ప్రతిఫలంగా  మజ్లిస్​కు   వైస్​చైర్మన్​  ఇవ్వడానికి కాంగ్రెస్​ రెడీ అయింది.   ఆర్మూర్​, భీంగల్​ మున్సిపాలిటీలో పూర్తి ఆధిక్యంతో ఉన్న కాంగ్రెస్​ రెండు చోట్ల  ప్రధాన పదవులు గెలుచుకోవడం లాంఛనమే కానుంది.  

పదవుల కోసం పోటీ ఉన్నందున ఏకాభిప్రాయం కోసం పార్టీ నేతలు శని, ఆదివారం రెండు రోజులు నుంచి చర్చలు జరిపారు.  బోధన్​ మున్సిపాలిటీలో మొత్తం 38 వార్డులుండగా కాంగ్రెస్​ పార్టీ 17 స్థానాలు గెలిచింది. మజ్లిస్​ 12, బీఆర్​ఎస్​ 05, బీజేపీ 3 వార్డులు గెలుచుకోగా రెబెల్​గా పోటీ చేసి గెలిచిన అభ్యర్థి కాంగ్రెస్​లో చేరడంతో బలం18కు చేరింది.  

చైర్​పర్సన్​, వైస్​ చైర్​పర్సన్​ పదవులకు  20 ఓట్లు అవసరం.  స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ఎక్స్​ అఫిషియో ఓటు కలిపితే మ్యాజిక్​ ఫిగర్​కు ఒక ఓటుకు దూరంలో ఉంటుంది.  దీంతో మరొకరి ఓటు  అవసరం అవుతుంది.    కాంగ్రెస్​ చైర్​పర్సన్ అభ్యర్థిగా శరత్​రెడ్డి  భార్య తూము పద్మ కాకుండా ఇంకెవరిని సెలెక్ట్​ చేసినా బీఆర్​ఎస్​ మద్దతు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.మజ్లిస్​ పార్టీ కుడా శరత్​ దంపతులను కాకుండా  ఎవరికి పదవి ఇచ్చినా మద్దతిస్తామని చెప్తూనే.. చైర్మన్​ పదవి తమకే ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా ముందుచినట్టు తెలుస్తోంది.   

ఆదివారం చర్చలు కొలిక్కివచ్చి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. మజ్లిస్​కు వైస్​చైర్మన్​ కాంగ్రెస్​కు చైర్​పర్సన్​ పదవి ఇచ్చేలా పరస్పర అంగీకారం కుదుర్చుకున్నారు.  జనరల్​ కు రిజర్వు చేసిన చైర్​పర్సన్​ పదవిని శరత్​రెడ్డి, ఆయన భార్య తూము పద్మ, దాము, ఆదినారాయణ పేర్లు పరిశీలిస్తున్నారు. సోమవారం సీల్​ కవర్​లో పేరు ఓపెన్​ కానుంది. 

ఆర్మూర్, భీంగల్​లో బీసీ మహిళల పరిశీలన

ఆర్మూర్​లోని 36 వార్డుల్లో 19 స్థానాలు గెలిచిన కాంగ్రెస్​కు క్లియర్​కట్​ మెజారిటీ ఉంది. మరో ఇద్దరు ఇండిపెండెంట్​లు మద్దతు ఇస్తున్నారు. జనరల్​ మహిళకు రిజర్వు చేసిన ఛైర్​పర్సన్​ స్థానం కోసం పోటీ చేసిన అంకరిగారి శ్రీదేవీ, ఖాందేష్​ సంగీత, మోత్కూరి విజయ, గడ్డం జ్యోతి ఓటమిపాలయ్యారు. గెలిచిన వారిలో గోనె లహరి, బస్నాత్​ తిరుమల, తాటి నీలిమ పేర్లను ఛైర్​పర్సన్​ పోస్టులకు పరిశీలిస్తున్నారు. వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలే. భీంగల్​ మున్సిపాలిటీలోని 12 వార్డుల్లో 8 స్థానాలు గెలిచిన కాంగ్రెస్​కు  ఛైర్​పర్సన్, వైస్​ ఛైర్​పర్సన్​ పదవులు పొందడం లాంఛనం కానుంది.  

జనరల్​ మహిళకు కేటాయించిన ఛైర్​పర్సన్​ పోస్టుకు బీసీ వర్గానికి చెందిన 6 వార్డు కౌన్సిలర్​ బొదిరె నాగమణి, 1 వార్డు కౌన్సిలర్​గా గెలిచిన అరెపల్లి శ్రీజలో ఒకర్ని ఫైనల్​ చేయనున్నారు. సీల్​ కవర్​లోనే పేర్లు వెల్లడయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

3 చోట్ల సునాయాసంగా గెలిచే చాన్స్​  

బాన్సువాడ, ఎల్లారెడ్డి, బిచ్​కుంద మున్సిపాలిటీల్లో మెజార్టీ కౌన్సిలర్​ స్థానాలను కాంగ్రెస్​ పార్టీ దక్కించుకుంది.  ఈ 3 చోట్ల ఎవరి మద్దతు లేకుండా ఆ పార్టీకి  చైర్మన్​, వైస్​ చైర్మన్​ పదవులు దక్కనున్నాయి.  బాన్సువాడ ఛైర్​పర్సన్​  కాసుల విజయ పేరును ముందుగానే ఆ పార్టీ నేతలు ప్రకటించారు.  ఎల్లారెడ్డిలో చైర్మన్​ పదవి కోసం పద్మ శ్రీకాంత్​, భాగ్యలక్ష్మీ,  బిచ్​కుందలో మఠం మానస, షీమా షేట్కార్​లో ఏవరో ఒకరికి ఛైర్మన్​ పదవి దక్కనుంది.    ఛైర్మన్​ పదవుల కోసం ఎంపిక చేసి వారి పేర్లను కాంగ్రెస్​ పార్టీ అధిష్టాన వర్గం ఎన్నిక సమయానికి ముందు సీల్డు కవర్​లో పంపనుంది.