- మనిషిలోని ఆత్మని ఉత్తేజపరుస్తుంది.
మనల్ని మంత్ర ముగ్ధులని చేసే మహిమ ఉన్న ప్రక్రియ, కవిత్వం. కవి తన మహిమలతో సృష్టించే సంగీతమే కవిత్వం. ఓ సంతోషాన్ని, ఓ విషాదాన్ని, ఓ సెంటిమెంటుని, ఓ భావోద్వేగాన్ని కవిత్వం ప్రకటిస్తుంది. కవిత్వం సంగీతమే కాదు, చిత్రం కూడా. చిత్రకారుడు పాత ప్రపంచాన్ని కొత్తగా చిత్రిస్తాడు. కవి చేసేది కూడా అదే.
తన ఊహాశక్తితో ఓ ప్రపంచాన్ని సృష్టిస్తాడు కవి. అక్కడ అతనే నాయకుడు. కవిత్వంలో ప్రతిధ్వనించే లక్షణం ఉంది. అందుకని అది అందరినీ ప్రభావితం చేసే అవకాశం ఎక్కువ. కవిత్వానికి ఎలాంటి పొందికైన డిజైన్ లేదు. అది సహజమైనటువంటిది. విత్తనం నుంచి మొక్కలాగా, మొక్క నుంచి చిరు కొమ్మల్లాగా, పుష్పాల్లాగా, ఫలాల్లాగా.. కవిత్వమూ వస్తుంది. అది మనిషి కళ్ల నుంచి చెవులనుంచి మనస్సుకి చేరుతుంది. హృదయాల్ని తాకుతుంది. మనిషిని ఆలోచింపచేస్తుంది.
ఇవన్నీ కవులు చెప్పే మాటలు. అసలు కవిత్వాన్ని ఎవరు చదువుతున్నారు? అని కూడా కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకే పత్రికలు కవిత్వానికి ఇస్తున్న గౌరవం చాలా తక్కువ అంటున్న మాటలు కూడా వినిపిస్తుంటాయి. వీరి మాటల్లోనూ కొంత సత్యం లేకపోలేదు.
పరిగెత్తుతున్న ఈ ప్రపంచంలో కవిత్వాన్ని చదువుతున్న ప్రజల సంఖ్య తక్కువే. రేడియో, టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్‌లు వచ్చిన తరువాత, వాటి వాడకం పెరిగిన తరువాత, కవిత్వం చదివేవారి సంఖ్య తగ్గిపోయింది. ఇప్పుడు ప్రజలకి కావల్సింది ప్రపంచం. ప్రపంచంలో ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరుగబోతుంది?.. ఈ విషయాలకు ఉన్న ప్రాధాన్యం ప్రజలు, మరే విషయానికీ ఇవ్వడంలేదు. రోజువారి జరిగే సంఘటనలకి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. సమాచారానికి అత్యంత ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు. కానీ వాళ్లు గమనించని విషయం ఒకటి ఉంది. కవిత్వం ఓ అనుభూతి.. ఓ ఆలోచనని కలిగిస్తుంది. ఓ సత్యాన్ని తెలియచేస్తుంది. అదే జీవిత సత్యం. ఈ విషయాలని గ్రహించిన వ్యక్తులు తప్పక కవిత్వం చదువుతారు.
కవిత్వం ఓ అనుభూతిని కలుగజేయాలి. తాము అనుకుంటున్న విషయాన్ని కవి శక్తిమంతంగా చెప్పినప్పుడు పాఠకులు ఆ అనుభూతికి లోనవుతారు.ఉత్తేజితులవుతారు. ఇది లేనప్పుడు కవిత్వం చదవడానికి ఎవరూ ఇష్టపడరు. మంచి కవిత్వం మనిషి హృదయం లాంటిది. అందుకే అది జీవనసత్యాలని చెబుతుంది.
కవిత్వం చదవడంలేదని అంటూ ఉంటాం. కానీ, చాలామంది ఉపన్యాసాలని గమనించినా.. ఉత్తరాలని పరిశీలించినా.. హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులని గమనించినా.. అంతెందుకు.. సమయపాలన గురించి, వ్యక్తిత్వ వికాసం గురించి వస్తున్న వ్యాసాలని గమనించినా ఒక విషయం స్పష్టమవుతుంది. ఒక విషయాన్ని బలంగా చెప్పాలనుకున్నప్పుడు వాళ్లు ఉపయోగించుకుంటున్న చరణాలు కవిత్వచరణాలు. ఆ కవిత్వచరణాలకి కరతాళ ధ్వనులు కూడా వినిపిస్తుంటాయి. ఇది కాదనలేని సత్యం. దానికి కారణం ఒక్కటే.. కవిత్వంలో కవికి తెలియకుండానే ఓ జీవనసత్యం బయటపడుతుంది.
మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తరువాత వచ్చిన అత్యంత ప్రాముఖ్యం కలిగిన ముప్పైలో పది తీర్పులకు కవితాచరణాలు ఉన్నాయి. శ్రీరామ్ సార్ తన మిత్రులకి, సన్నిహితులకి రాసిన ప్రతి ఉత్తరంలో రెండు-మూడు కవితాచరణాలైనా కనిపిస్తాయి. ఉద్యోగంలో పనితీరు మెరుగుపరచడం కోసం శిక్షణతరగతుల ప్రాముఖ్యత పెరిగిపోయింది. వాళ్ళు చెప్పే తరగతుల్లో కూడా కవిత్వం అనివార్యమైపోయింది. ఊపన్యాసాల్లోనూ కవితా చరణాలు తప్పనిసరి. వాజపేయి, కలాం ఉపన్యాసాల్లో కవితాచరణాలు కనిపిస్తూనే ఉన్నాయి. చిత్రహింసలకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మకమైన తీర్పు డి.కె. బసు కేసు.
కేసు బార్డర్ రాసిన కవితతో ఇలా మొదలవుతుంది.
‘‘మనిషి ఆత్మలోని గాయమే చిత్రహింసలు
ఒక్కోసారి మనం దాన్ని తాకవచ్చు
తాక లేక పోవచ్చు
అది చంపే కోర్కెను కలుగజేస్తుంది’’
ఓ వ్యక్తిని చిత్రహింసలకి గురిచేస్తే ఆ వ్యక్తి స్పందనే కవిత. శ్రీరామ్ సార్ రాసిన ఉత్తరాల్లో ఎన్నో కవితలు ఆశ్చర్యంగా మనం గుర్తించని, గుర్తించిన కవుల కవితలు ఎన్నో కన్పిపిస్తాయి. నారాయణరెడ్డి, ఆచార్య తిరుమల, కరుణ శ్రీ, జాషువ ఇట్లా ఎందరో
‘‘ఆకులు రాలిపోతేనేమి?
చిగురుటాకులు పట్టవా?
నీళ్లు ఇగిరిపోతేనేమి?
నీలి మబ్బులు గజ్జె కట్టవా?’’
ఇది సినారె కవితాచరణం. నిరాశానిస్పృహలతో వుండే వ్యక్తికి సాంత్వనని చేకూర్చే వాక్యాలు.
ఇట్లా ఎన్నైనా ఉదహరించవచ్చు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కవిత్వం ఎవరు చదువుతారు? కవిత్వం అవసరమా? అన్న ప్రశ్నలకి సమాధానం చెప్పడం కోసం. కవిత్వంలో ఒక్కోసారి కవికే తెలియని జీవన సత్యాలుంటాయని చెప్పడం కోసం, నేను చెప్పిన మూడు కవితలు మూడు రకాలైన స్థితుల్లో ఉదహరించబడినాయి. పోలీసులు చిత్రహింసలు చేయకూడదు. దాని వల్ల చెడు ఫలితాలే ఉంటాయి. వాళ్లు న్యాయబద్ధంగా నడవాలి అని చెప్పడం కోసం ఉదహరించిన చరణాలు..
చిత్రహింసలు చంపే కోర్కెని కలుగజేస్తాయి. చనిపోయే కోర్కెను కలుగజేస్తాయి.
అందుకని అవి చెయ్యకూడదని చెప్పడం కోసం, న్యాయమూర్తులు ఎన్నుకున్న కవిత.
నిరాశానిస్పృహలకి లోను కావద్దు.
ఆకులు రాలినా చిగురాకులు పుట్టవా?
అంటున్న ఆధ్యాత్మికవేత్త శ్రీరామ్ సార్ ఉదహరించిన చరణాలు.
ఇక మూడో కవిత విషయానికి వస్తే..
ఏది అయాచితంగా రాదు. సాధించి శోధించాల్సిందే మొదటి కవితని ఉదహరించింది ఆధ్యాత్మికవేత్త. మూడవది ఉదహరించింది ట్రెయినర్. ఇప్పుడు చెప్పండి, కవిత్వం చదివేవాళ్లు లేరా?
ఈ ప్రపంచంలో ఫ్రీ లంచ్ లేదు, ఉండదు. అన్నీ కష్టపడి సాధించుకోవాలని చెబుతూ, ఓ ఇన్ సర్వీసెస్ కోర్సులో ఓ ట్రెయినర్ శ్రీశ్రీ కవితతో ముగిస్తాడు. మొత్తం క్లాసంతా ఒక ఎత్తు.
ఆ ముగింపు కవితాచరణాలు ఒక ఎత్తు.
‘‘ఏదీ తనంత తానైనీ దరికి రాదు.
శోధించి సాధించాలి.అదియే ధీరగుణం’’
- డా. మంగారి రాజేందర్
కవి, రచయిత
9440483001
